Muscat mosque shooting: మస్కట్ మసీదులో కాల్పులు; ఒక భారతీయుడు మృతి, మరొకరికి గాయాలు
16 July 2024, 21:00 IST
- Muscat mosque shooting: ఒమన్ లోని మస్కట్ లో ఉన్న ఒక మసీదులో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఇది ఉగ్రవాదుల దాడిగా భావిస్తున్నారు.
మస్కట్ లోని కాల్పులు జరిగిన మసీదు దృశ్యం
Muscat mosque shooting: ముస్కట్ లోని ఒక మసీదులో సోమవారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందగా, మరొకరు గాయపడినట్లు ఒమన్ లోని భారత రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది. నిన్న మస్కట్ నగరంలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత, ఒమన్ సుల్తానేట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడని, మరొకరు గాయపడ్డారని తెలియజేసిందని ఒమన్ లోని భారత రాయబార కార్యాలయం ఒక పోస్ట్ లో తెలిపింది. భారతీయుడి మృతి పట్ల ఎంబసీ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. మృతుడి కుటుంబానికు అన్ని రకాల సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఎంబసీ తెలిపింది. ఒమన్ లోని షియా ముస్లిం మసీదుపై సోమవారం అర్థరాత్రి ఈ దాడి జరిగింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు సహా తొమ్మిది మంది మరణించారు. మరో రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు భారతీయులు ఉన్నట్లు సమాచారం.
ఒమన్ లో అసాధారణం
ఒమన్ రాజధాని మస్కట్ లోని అల్ వదీ అల్ కబీర్ ప్రాంతంలో ఉన్న షియా ముస్లింలకు చెందిన ఇమాం అలీ మసీదు లో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఒమన్ సుల్తనేట్ లో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. నిజానికి, ఈ ప్రాంతంలోని దేశాల మధ్య ప్రాంతీయ విబేధాలు చోటు చేసుకున్న సమయంలో ఒమన్ మధ్యవర్తి పాత్ర పోషిస్తుంటుంది. హుస్సేన్ అమరత్వానికి గుర్తుగా షియాలు అశుర ను ఈ వారమే జరుపుకుంటారు.