Lok Sabha speaker: ఓం బిర్లా వర్సెస్ కే సురేశ్- మూడోసారి లోక్‌సభ స్పీకర్ కోసం ఎన్నిక!
26 June 2024, 11:59 IST
Lok Sabha speaker elections: స్వతంత్ర భారత దేశంలో మూడోసారి.. లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది! బీజేపీ, కాంగ్రెస్‌లు తమ తమ అభ్యర్థులను నిలబెట్టాయి.
లోక్‌సభ స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన ఓం బిర్లా..
స్వతంత్య్ర భారత దేశ చరిత్రలో లోక్‌సభ స్పీకర్ పదవి కోసం మూడోసారి ఎన్నిక జరగనుంది. 18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం బీజేపీ నుంచి ఓం బిర్లా, కాంగ్రెస్ నుంచి కే సురేశ్ పోటీపడనున్నారు.
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..
బీజేపీ ఎంపీ, గత లోక్‌సభలో స్పీకర్‌గా ఉన్న ఓం బిర్లా.. ఈసారి కూడా ఆ బాధ్యతలు చేపట్టనున్నట్టు, అది ఏకగ్రీవంగా జరగనున్నట్టు అందరు భావించారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ.. కే సురేశ్‌ని స్పీకర్ పదవికి నిల్చోబెట్టింది.
మంగళవారం మధ్యాహ్నం నాటికి స్పీకర్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఓం బిర్లా, కే సురేశ్‌లు నామినేషన్ దాఖలు చేశారు. లోక్‌సభ స్పీకర్ పదవికి బుధవారం ఎన్నిక జరగనుంది.
రాజస్థాన్ కోటా నుంచి బీజేపీ ఎంపిగా ఉన్నారు ఓం బిర్లా. ఇక కేరళ మావేలికర నుంచి 8సార్లు గెలిచారు కే. సురేశ్. ఈయన్ని ప్రోటెం స్పీకర్‌గా ఎంపిక చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. కానీ భర్తృహరికి ఆ పదవి ఇచ్చింది. ఈ విషయంపైనా ఇరుపక్షాల మధ్య విభేదాలు కనిపించాయి.
అయితే.. లోక్‌సభలో ఎన్డీఏకి మద్దతు ఎక్కువగా ఉంది కాబట్టి.. ఓం బిర్లా గెలుపు ఖాయం! ఎన్డీఏ కూటమి దగ్గర 293 ఓట్లు, ఇండియా కూటమి వద్ద 232 ఓట్లు ఉన్నాయి. ఫలితంగా.. బుధవారం జరిగే ఎన్నికలో గెలిచి.. వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్ అయిన రెండో వ్యక్తిగా నిలుస్తారు ఓం బిర్లా.
ఇదీ చూడండి:- Lok Sabha Speaker : ఓం బిర్లాకే లోక్‌సభ స్పీకర్ బాధ్యతలు! మరి పురంధేశ్వరి?
కుదరని సయోధ్య..
వాస్తవానికి అధికార-విపక్షాల మధ్య లోక్‌సభ స్పీకర్ విషయంపై చర్చలు జరిగాయి. ఎన్డీఏ నిలబెట్టే స్పీకర్ అభ్యర్థికి మద్దతిస్తామని ఇండియా కూటమి ఒప్పుకుంది. బదులుగా డిప్యూటీ స్పీకర్‌ని తాము నిర్ణయిస్తామని డిమాండ్ చేసింది. ఈ విషయంలో ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదరలేదని సమాచారం. చివరికి.. అనూహ్యంగా కే సురేశ్‌ని స్పీకర్ రేసులో నిలిపింది కాంగ్రెస్.
‘ప్రభుత్వ పాలనలో విపక్షం మద్దతివ్వాలని, నిర్మాణాత్మక బాధ్యత చేపట్టలని ప్రధానమంత్రి అన్నారు. మేము స్పీకర్‌ని సపోర్ట్ చేస్తామని, కానీ డిప్యూటీ స్పీకర్ పదవి మాకు కావాలని విపక్షం అడిగింది. స్పీకర్ విషయంలో మద్దతు కోసం రాజ్‌నాథ్ సింగ్ మల్లిఖార్జు ఖర్గేకి ఫోన్ చేశారు. డిప్యూటీ స్పీకర్ గురించి అడిగితే.. మళ్లీ ఫోన్ చేస్తానని, ఇంకా చేయలేదు. ఇది మ నేతకు అవమానం. మోదీకి నిర్మాణాత్మక సహకారం అక్కర్లేదు" అని రాహుల్ గాంధీ అన్నారు.