`వర్క్ ఫ్రమ్ హోం ఇక కుదరదు.. ఆఫీస్ కు రండి.. లేదా జాబ్ మానేయండి!`
01 June 2022, 18:12 IST
ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తున్న టెస్లా సంస్థ సీఈఓ ఇలాన్ మస్క్.. మరో సంచలనంతో మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఇకపై కార్యాలయానికి రావాల్సిందేనని, ఆఫీస్ రాలేకపోతే, జాబ్ మానేయాలని టెస్లా ఉద్యోగులకు తాజాగా ఒక అల్టిమేటం జారీ చేశాడు.
టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్
టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ తన ఉద్యోగులకు ఒక అధికారిక ఈ మెయిల్ పంపించారు. ఇంటి నుంచి పని చేసే రోజులు ముగిశాయని, ఇక కార్యాలయానికి రావాల్సిందేనని అందులో స్పష్టం చేశారు. ఆఫీస్‌కు వచ్చి విధులు నిర్వర్తించలేని పక్షంలో నిరభ్యంతరంగా ఉద్యోగం మానేయవచ్చని తేల్చిచెప్పారు. టెస్లాలో ఇక `వర్క్ ఫ్రం హోం`కు అనుమతి లేదని స్పష్టం చేశారు.
నో మోర్ రిమోట్ వర్క్
సంస్థకు సంబంధించిన విధుల్లో ఇక రిమోట్ వర్క్‌ను అనుమతించబోమని టెస్లా ఉద్యోగులకు మస్క్ తేల్చిచెప్పారు. టెస్లాలో ఉద్యోగం చేయాలనుకుంటే కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సిందేనని ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేశారు. `ఇంటి దగ్గర నుంచే పని చేయాలనుకుంటే సంతోషంగా మరో కంపెనీని వెతుక్కోండి` అని టెస్లా ఉద్యోగులకు సూచించారు. `వర్క్ ఫ్రం హోం` పేరుతో పని చేస్తున్నట్లు నటించే వారు టెస్లాకు అవసరం లేదన్నారు. ఈ మేరకు టెస్లా ఉద్యోగులకు ఒక అధికారిక ఈ మెయిల్‌ను మస్క్ పంపించారు. అందులో సబ్జెక్ట్ లైన్‌లోనే `రిమోట్ వర్క్ ఈజ్ నో లాంగర్ యాక్సెప్టబుల్` అని పేర్కొని తన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పారు. `ఇంటి నుంచి పని చేయాలనుకునే వారు వారానికి కనీసం( నా ఉద్దేశం `కనీసం`) 40 గంటలు కార్యాలయానికి వచ్చి పని చేయాల్సిందే. అంతకుమించి, చేయాలనుకుంటే, మిగతా సమయాన్ని `వర్క్ ఫ్రం హోం` చేయొచ్చు` అని వ్యంగ్యంగా ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. ఇది ఆమోదనీయం కానివారు ఉద్యోగం మానివేయవచ్చు అని సూచించారు.
మస్క్‌కు ఇది మామూలే
ఇలాంటి అల్టిమేటంలు జారీ చేయడం మస్క్‌కు మామూలే. మొదట్లో స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ అనే స్టార్ట్ అప్‌ను ప్రారంభించిన మస్క్, మొదట్లోనే అక్కడి ఉద్యోగులకు పలు హెచ్చరికలు జారీ చేసేవాడు. కాఫీ కోసం కాఫీ మెషీన్ వద్ద గుంపులుగా నిల్చున్న ట్రైనీ ఉద్యోగులను, మరోసారి అలా టైం వేస్ట్ చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తానని హెచ్చరించారు. ఆ తరువాత ఉద్యోగులపై నిఘా కోసం కార్యాలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను అమర్చారు. ఈ విషయాన్ని కొంతకాలం మస్క్‌తో పాటు పనిచేసిన కీత్ రేబోయిస్ వెల్లడించారు.
ట్విటర్ కొనుగోలులోనూ గొడవలే
ఇలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు వ్యవహారం కూడా సాగుతోంది. నకిలీ ఖాతాలపై ఒక క్లారిటీ వచ్చేవరకు ఈ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కొన్ని రోజుల కింద మస్క్ ప్రకటించారు. ట్విటర్‌ను మస్క్ కొనుగోలు చేయడంలో ట్విటర్ ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి. తమ ఉద్యోగ భద్రతపై కూడా వారు ఆందోళన చెందుతున్నారు.
టాపిక్