మూడు నెలలుగా తల్లి అస్థిపంజరంతోనే కొడుకు.. అడిగితే వింత సమాధానం
24 October 2024, 13:45 IST
- Viral News : అస్సాంలోని గౌహతికి చెందిన జైదీప్ దేవ్ తన తల్లితో కలిసి నివసిస్తున్నాడు. తల్లి మూడు నెలల క్రితం చనిపోయింది. కానీ ఈ విషయాన్ని అతడు ఎవరికీ చెప్పలేదు. జైదీప్ తన తల్లి మృతదేహాన్ని దహనం చేయలేదు.

ప్రతీకాత్మక చిత్రం
అస్సాంలోని గౌహతిలో ఓ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ మహిళ మూడు నెలల కింద చనిపోయింది. అయితే అతడి కుమారుడు మాత్రం ఈ విషయాన్ని దాచిపెట్టాడు. తల్లి మృతదేహాన్ని మంచం మీద పెట్టి పూజలు చేశాడు. చుట్టు పక్కలవారు పదే పదే తల్లి గురించి అడగటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..
గౌహతిలో జైదీప్ దేవ్ (40) అనే వ్యక్తి తన తల్లి పూర్ణిమా దేవి మృతదేహాన్ని మూడు నెలల పాటు తన ఇంట్లోనే ఉంచాడు. తల్లి చనిపోయాక తిరిగి ప్రాణం వస్తుందన్న కారణంతో మృతదేహానికి దహన సంస్కారాలు చేయలేదు. చాలా రోజుల నుంచి పూర్ణిమాదేవి కనిపించకపోవడం, ఇంటి పరిస్థితి అనుమానంగా ఉండటంతో ఇరుగుపొరుగు వారు ప్రశ్నించడంతో విషయం బయటకు తెలిసింది.
మూడు నెలల క్రితం జైదీప్ తల్లి చనిపోయింది. అయితే ఈ విషయాన్ని అతడు ఎవరికీ చెప్పలేదని పోలీసుల విచారణలో తేలింది. జైదీప్ తన తల్లి కోసం రోజూ ఆహారం తీసుకువచ్చేవాడని ఇరుగుపొరుగు వారు తెలిపారు. అతని ఇంటి బయట చెత్త కుప్ప పెద్దగా తయారైంది. ఇరుగుపొరుగు వారు తల్లి గురించి చాలాసార్లు ఆరా తీయగా తన తల్లి చనిపోయిందని చెప్పాడు. దీంతో ఆందోళన చెందిన వారు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు జైదీప్ ఇంటికి చేరుకుని చూడగా మంచంపై పూర్ణిమాదేవి అస్థిపంజరం కనిపించింది. ఇంటి లోపల పూజా సామగ్రి, శివుని చిత్రం, గడ్డి, మండుతున్న దీపం కనిపించాయి. తాను రోజూ 'ఓం నమః శివాయ్' అని జపించేవాడినని, తన తల్లి తిరిగి బ్రతికి వస్తుందని నమ్మానని జైదీప్ పోలీసులకు తెలిపాడు.
భర్త చనిపోయిన తర్వాత పూర్ణిమాదేవి తన కుమారుడితో కలిసి నివసిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమె భర్త రిటైర్డ్ రైల్వే అధికారి కాగా, జైదీప్ ఆమె పెన్షన్ పై ఆధారపడి జీవిస్తున్నాడు. క్రమం తప్పకుండా బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసేవాడు. జైదీప్ మానసిక స్థితి సరిగా లేదని, ఈ కారణంగానే తల్లి మరణాన్ని ఇంతకాలం దాచిపెట్టి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.