Manish Sisodia bail: ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
09 August 2024, 18:12 IST
Delhi excise policy case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. ఈ కేసులో మనీశ్ సిసోడియా గత 17 నెలలుగా జైళ్లో ఉన్నారు. సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
దిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నమోదు చేసిన కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రికి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. మనీష్ సిసోడియాకు రూ.2 లక్షల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ మంజూరైంది. మనీష్ సిసోడియా బెయిల్ షరతుల్లో భాగంగా తన పాస్ పోర్టును పోలీస్ స్టేషన్లో సరెండర్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా గత 17 నెలలుగా జైళ్లో ఉన్నారు. ఆయనను గత సంవత్సరం ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు.
సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు (Delhi liquor scam case) విచారణలో సుదీర్ఘ జాప్యం మనీష్ సిసోడియా సత్వర విచారణ హక్కును కాలరాచిందని, సత్వర విచారణ హక్కు వ్యక్తి స్వేచ్ఛలో భాగమని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ బెయిల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. మనీష్ సిసోడియా 17 నెలలుగా కస్టడీలో ఉన్నారని, ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, దీంతో ఆయనకు సత్వర విచారణ హక్కు లేకుండా పోయిందని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసుల్లో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు పంపడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని సుప్రీంకోర్టు (supreme court) ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సత్వర విచారణ హక్కును కోల్పోయారు..
‘‘త్వరితగతిన విచారణ పొందే హక్కును సిసోడియా కోల్పోయారు. త్వరితగతిన విచారణ పొందే హక్కు పవిత్రమైన హక్కు. ఇటీవల జావేద్ గులాం నబీ షేక్ కేసులో మేము ఈ విషయాన్నే స్పష్టం చేశాం. కోర్టు, రాష్ట్రం లేదా ఏజెన్సీ సత్వర విచారణ హక్కును రక్షించలేనప్పుడు, నేరం తీవ్రమైనదని చెప్పి బెయిల్ ను వ్యతిరేకించలేము. నేరం స్వభావంతో సంబంధం లేకుండా ఆర్టికల్ 21 వర్తిస్తుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. విచారణను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే అవకాశం లేదని, విచారణ పూర్తి చేయడానికి ఆయనను జైలులో ఉంచడం ఆర్టికల్ 21 ఉల్లంఘన తప్ప మరేమీ కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
జైలు కాదు.. బెయిల్ నిబంధన రావాలి
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు ప్రశంసించారు. ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, మనీష్ సిసోడియాను 17 నెలల పాటు జైలులో ఉంచి కేంద్ర ప్రభుత్వం నేరం చేసిందన్నారు. ‘‘మనీష్ సిసోడియా కోల్పోయిన 17 నెలలను కేంద్ర ప్రభుత్వం అతని కుటుంబానికి తిరిగి ఇవ్వగలదా? మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు ఎలాంటి షరతు విధించలేదు. అంటే ఆయన తన కార్యాలయానికి వచ్చి తన పనిని తిరిగి ప్రారంభించవచ్చు. ప్రతి సోమ, గురువారాల్లో ఆయన ఢిల్లీలో ఉన్నందుకు గుర్తుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి ఉంటుంది’’ అని భరద్వాజ్ తెలిపారు. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ సహా ఇతరులకు కూడా న్యాయం జరుగుతుందని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 'జైలు కాదు.. బెయిల్' అనే నిబంధన ఉండాలని కాంగ్రెస్ నేత శశిథరూర్ మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.