తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maldives President : దిల్లీకి చేరుకున్నాక మాల్దీవుల అధ్యక్షుడు యూటర్న్.. భారత టూరిస్టులకు రిక్వెస్ట్

Maldives President : దిల్లీకి చేరుకున్నాక మాల్దీవుల అధ్యక్షుడు యూటర్న్.. భారత టూరిస్టులకు రిక్వెస్ట్

Anand Sai HT Telugu

07 October 2024, 14:50 IST

google News
    • Maldives President Mohamed Muizzu : ఒకప్పుడు మాల్దీవుల్లో 'ఇండియా ఔట్' క్యాంపెయిన్ నిర్వహించిన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు.. ఇండియాకు చేరుకోగానే యూటర్న్ తీసుకున్నారు. భారత్‌తో మాల్దీవుల సంబంధాలు గౌరవం, భాగస్వామ్య ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు.
ప్రధాని మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు
ప్రధాని మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

ప్రధాని మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

మాల్దీవుల అధ్యక్షుడు మెుహమ్మద్ ముయిజ్జుతో ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలో భేటీ అయ్యారు. గత ఏడాది వివాదం తర్వాత పుంజుకుంటున్న ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం సాయంత్రం దిల్లీకి చేరుకున్నారు మెుహమ్మద్ ముయిజ్జు. ఒకప్పుడు మాల్దీవుల్లో 'ఇండియా ఔట్' క్యాంపెయిన్ నిర్వహించిన ముయిజ్జు ఇండియాకు చేరుకోగానే యూటర్న్ తీసుకున్నారు. వాణిజ్య, అభివృద్ధి భాగస్వాముల్లో భారత్ ఒకటని తెలిపారు. ఇరుగుపొరుగువారు స్నేహితుల పట్ల గౌరవం మన డీఎన్ఏలోనే ఉందని చెప్పారు.

భారత పర్యాటకులు మాల్దీవులకు రావాలని ముయిజ్జు విజ్ఞప్తి చేశారు. 'భారతీయులు ఎల్లప్పుడూ సానుకూల సహకారం అందిస్తారు. మా దేశానికి భారతీయ పర్యాటకులను స్వాగతం పలుకుతున్నాం.' అని మయిజ్జు అన్నారు. ఇదే సమయంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. 'భారత్-మాల్దీవుల ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నాం.' అని చెప్పారు.

ముయిజ్జు హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సాదర స్వాగతం పలికారు. భారత్- మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ముయిజ్జుకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. మూడు సైన్యాలు ముయిజ్జు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం దిల్లీలోని రాజ్ ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.

మాల్దీవుల అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ రెండు దేశాలు భవిష్యత్తులో అనేక ప్రాజెక్టులకు సహకరించుకుంటాయని ప్రకటించారు. మాల్దీవులకు ఎప్పుడు భారత్ సహకరిస్తుందని చెప్పారు.

మాల్దీవుల అధ్యక్షుడు తన సతీమణి సాజిదా మహమ్మద్, తన దేశ ప్రతినిధి బృందంతో కలిసి ఆదివారం సాయంత్రం భారత్ చేరుకున్నారు. గత ఏడాది నవంబరులో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముయిజ్జు తొలిసారిగా ప్రభుత్వ పర్యటనకు వచ్చారు. జూన్‌లో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. చైనా అనుకూలిడిగా ముయిజ్జుకు పేరు ఉంది. గతేడాది బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 'ఇండియా ఔట్' క్యాంపెయిన్ కూడా నిర్వహించారు.

మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీని విమర్శించడంతో ఇండియాతో ద్వైపాక్షిక సంబంధాలు కూడా క్షీణించాయి. మాల్దీవులు తీవ్ర ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. మాల్దీవుల ప్రభుత్వ ప్రత్యేక అభ్యర్థన మేరకు భారత్ 50 మిలియన్ డాలర్ల ప్రభుత్వ బాండ్లను మరో ఏడాది పొడిగించింది. ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం మయిజ్జును కలిశారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం