Kannada prescriptions : కన్నడలో మందుల చీటీ రాస్తున్న డాక్టర్లు- పొగుడుతున్న కర్ణాటక ప్రజలు!
20 September 2024, 11:18 IST
- కొందరు కర్ణాటక వైద్యులు మందుల చీటీని కన్నడలో రాస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు కర్ణాటక ప్రజలు ఈ డాక్టర్లను ప్రశంసిస్తున్నారు.
కన్నడలో మందుల చీటీ రాస్తున్న డాక్టర్లు!
కన్నడ భాష చుట్టూ చాలా వార్తలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఓ చోట కన్నడ రాని ప్రయాణికుడిని డ్రైవర్లు ఎక్కించుకోకపోతుంటే.. మరోచోట, ఫుడ్ డెలివరీ బాయ్‌కి కన్నడ రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి మధ్య తాజాగా మరో వార్త వైరల్‌గా మారింది. కర్ణాటకలోని పలువురు డాక్టర్లు మందుల చీటీని కన్నడలో రాయడం మొదలుపెట్టారు! కర్ణాటక ప్రజలు ఈ డాక్టర్లను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి వారిని ఫేమస్ చేయాలని పిలుపునిస్తున్నారు. అసలు విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి..
ఇదీ జరిగింది..
కర్ణాటకలో స్థానిక భాషను ప్రోత్సహించడానికి కొంతమంది వైద్యులు తమ మందుల చీటీని కన్నడలో రాయడం ప్రారంభించారు. రాష్ట్రంలో కన్నడ వాతావరణాన్ని తీసుకురావడానికి ఈ ప్రక్రియను తప్పనిసరి చేయాలని కన్నడ డెవలప్మెంట్ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరింది.
కర్ణాటకలోని చిత్రదుర్గలో సంజయ్ రాఘవేంద్ర అనే ఆర్థోపెడిక్ వైద్యుడు తన రోగికి ప్రిస్క్రిప్షన్ మొత్తాన్ని కన్నడంలోనే రాశారు. ఆయన ప్రిస్క్రిప్షన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కన్నడ ఉద్యమకారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. 'అతని పేరు డాక్టర్ సంజయ్, అతను కన్నడలోనే ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. అతడిని ఫేమస్ చేయండి. ఇలాంటి సంజయ్లను మనం తెరపైకి తీసుకురావాలి," అని ఒకరు వ్యక్తి ఎక్స్‌లో ట్వీట్ చేశాడు.
హోసంగడికి చెందిన మురళి అనే మరో దంత వైద్యుడు కూడా మందుల చీటీని ఇంగ్లిష్ బదులు కన్నడలోనే రాస్తున్నారు. కేడీఏ చైర్మన్ పురుషోత్తం బిలిమల్ సంబంధిత స్లిప్‌ని షేర్ చేస్తూ.. “హోసంగడి డాక్టర్ మురళీమోహన్ కన్నడలో ప్రిస్క్రిప్షన్‌ను అందంగా రాశారు. ఆయన్ని అభినందిద్దాం,” అని అన్నారు. మందుల చీటీని వైద్యులకు కన్నడలో రాయడాన్ని తప్పనిసరి చేయాలని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావును బిలిమల్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు, తాలూకాలు, జిల్లా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులు ప్రిస్క్రిప్షన్లు రాసేటప్పుడు కన్నడకు ప్రాధాన్యమిస్తే అది కన్నడ అస్తిత్వాన్ని పరిరక్షించే దిశగా పెద్ద ముందడుగు అవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయం గురించి తెలిసిన తర్వాత వందలాది మంది వైద్యులు మందుల చీటీని కన్నడలో రాసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్టు, తనకు చెప్పినట్టు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి:- Crime news : సెక్స్ వర్కర్ని చంపి.. శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన కిరాతకుడు!
అయితే, ఈ ప్రాంతంలో కన్నడను తప్పనిసరి చేయడం ఆచరణాత్మక ఆలోచన కాదని దినేష్ గుండూరావు అన్నారు. “వైద్య పరంగా ఫ్లెక్సిబిలిటీ చాలా ముఖ్యం, ఎందుకంటే ప్రజల ఆరోగ్యం ఇందులో ఇమిడి ఉంటుంది. డాక్టర్లు మందుల చీటి కన్నడలో రాయగలిగితే బాగుంటుంది. కానీ దీన్ని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయడం ఆచరణాత్మక ఆలోచన కాదు,” అని అన్నారు.
మరోవైపు కన్నడలో మందుల చీటీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు దీనిపై మిశ్రమంగా స్పందిస్తున్నారు.
“ఇలా కన్నడలో మందుల చీటీ రాస్తే.. ఒక మందు బదులు ఇంకోటి ఇస్తే? రోగి పరిస్థితి ఏంటి?” అని పలువురు నెజిటన్లు ప్రశ్నిస్తున్నారు.
మరి ఈ వ్యవహారంపై మీ స్పందన ఏంటి? మీరేం అంటారు?