Karnataka opinion poll 2023 : బీజేపీకి ఓటమి తప్పదా? ఏ సర్వే.. ఏం చెబుతోంది?
05 May 2023, 10:13 IST
- Karnataka opinion poll 2023 : కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. గెలుపుపై పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు సర్వేలు చెబుతున్న వివరాలు తెలుసుకుందాము..
మే 10న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి.
Karnataka opinion poll 2023 : 2023 కర్ణాటక ఎన్నికలకు ఇంకొన్ని రోజుల సమయమే ఉంది. ఈ క్రమంలో తుది దశ ఎన్నికల ప్రచారాలను మరింత విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. హామీలతో ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డాయి. మరోవైపు.. ఇప్పటికే దాదాపు అన్ని సర్వేలు బయటకొచ్చాయి. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇంకొన్ని సర్వేలు మాత్రం.. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వెలువడిన సర్వేలు, అవి చెబుతున్న వివరాలను తెలుసుకుందాము..
ఏ సర్వే.. ఏం చెబుతోంది..?
ఏబీపీ- సీఓటర్ సర్వే ప్రకారం.. కర్ణాటకలో కాంగ్రెస్(107-119) ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. బీజేపీ(74-86) ఘోర వైఫల్యాన్ని చూస్తుంది. జేడీఎస్(23-35) ప్రదర్శన కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది.
2023 Karnataka elections : ఇండియా టుడే- సీఓటర్ సర్వే ప్రకారం.. కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోతుంది. బీజేపీకి 74-86 సీట్లు మాత్రమే లభిస్తాయి. 2018తో పోల్చుకుంటే దాదాపు 25 సీట్లు తగ్గుతాయి. కాంగ్రెస్‌కు 107-119 సీట్లు దక్కొచ్చు. జేడీఎస్‌కు 23-35 సీట్లు రావొచ్చు.
ఇదీ చదవండి:- Karnataka elections : కర్ణాటకలో బీజేపీ- కాంగ్రెస్ హామీల వర్షం.. ప్రజలకు ఆకర్షించేనా?
జీ న్యూస్- మాట్రీజ్ కర్ణాటక పోల్ ప్రకారం.. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. కాంగ్రెస్, జేడీఎస్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలుస్తాయి. బీజేపీ 103-115 స్థానాల్లో గెలుస్తుంది. కాంగ్రెస్ 79-91, జేడీఎస్ 26-36 స్థానాల్లో విజయాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఈ పోల్‌లో 1.80లక్షల మంది పురుషులు, 1.12లక్షల మంది మహిళలు పాల్గొన్నారు.
Karnataka election results : కన్నడ వార్తా సంస్థ సువర్న న్యూస్ 24X7, జన్ కీ బాత్ ప్రకారం.. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. కానీ ఓటు షేరు విషయంలో బీజేపీ కన్నా కాంగ్రెస్ ముందంజలో ఉంటుంది.
కన్నడలోని ఈదిన ప్రకారం కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ వచ్చి, ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. 132-140 సీట్లల్లో గెలవచ్చు. బీజేపీకి 57-65 సీట్లే వస్తాయి.
సర్వేలు ఏం చెబుతున్నా.. గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ ధీమాగా ఉన్నాయి. మరోమారు అధికారం తమదేనని బీజేపీ వ్యాఖ్యానిస్తుంటే.. ఈసారి మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తామని కాంగ్రెస్ అంటోంది. జేడీఎస్ మాత్రం.. మరోమారు కింగ్ మేకర్ పాత్ర పోషించి, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండాలని అభిప్రాయపడుతోంది.
కర్ణాటక ఎన్నికలు..
224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ఈ నెల 10న ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి. మరి ఈ సర్వేల విశ్లేషణలు నిజమవుతాయా? లేదా? అన్నది 13తో తేలిపోతుంది!