Justice Sanjiv Khanna: 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా; నవంబర్ 11న ప్రమాణ స్వీకారం
24 October 2024, 21:05 IST
Justice Khanna: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ఆయన ప్రస్తుత సీజేఐ పదవీవిరమణ అనంతరం, నవంబర్ 11న సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సీజేఐగా జస్టిస్ ఖన్నా పదవీకాలం ఆరు నెలలు ఉంటుంది. 2025 మే 13న ఆయన పదవీ విరమణ చేస్తారు.
51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (65) పదవీ విరమణ చేసిన మరుసటి రోజున, అంటే, నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు కొత్త సీజేఐ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ 2022 నవంబర్ 8న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. సీజేఐగా జస్టిస్ ఖన్నా పదవీకాలం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే 13న పదవీ విరమణ చేయనున్నారు.
కేంద్ర మంత్రి ఎక్స్ పోస్ట్
సుప్రీంకోర్టు (supreme court) ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమితులైన విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం వెల్లడించారు. ‘‘భారత రాజ్యాంగం ప్రసాదించిన అధికారాన్ని ఉపయోగించి, గౌరవనీయులైన రాష్ట్రపతి, గౌరవనీయ భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల తరువాత, 2024 నవంబర్ 11 నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా శ్రీ జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించడం సంతోషంగా ఉంది’’ అని అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.