Girls marriage age: ఆ దేశంలో వివాహ వయస్సును 9 ఏళ్లకు తగ్గిస్తూ ప్రతిపాదనలు.. మండిపడ్తున్న దేశవాసులు
09 August 2024, 19:29 IST
- మైనారిటీ తీరని బాలికలకు వివాహం చేసేయాలన్న ప్రతిపాదన ఇరాక్ లో ఆందోళనలకు కారణమైంది. ఇరాక్ లో బాలికల చట్టబద్ధ వివాహ వయస్సును 9 ఏళ్లకు తగ్గించాలని ఆ దేశ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ బాలికల కనీస వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంది.
దేశంలో వివాహ వయస్సును 9 ఏళ్లకు తగ్గిస్తూ ప్రతిపాదనలు
ముస్లిం దేశం ఇరాక్ లో మరో చాంధస ప్రతిపాదన చట్టరూపం దాల్చనుంది. ఇరాక్ లో యువతుల చట్టబద్ధ కనీస వివాహ వయస్సును 9 సంవత్సరాలకు తగ్గించాలని అక్కడ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదిత బిల్లు ఇరాక్ పౌరులలో, ముఖ్యంగా ఉద్యమకారులలో విస్తృతమైన ఆందోళనలకు కారణమైంది. చట్టబద్ధ వివాహ వయస్సులో ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న ఈ మార్పు మహిళల హక్కులకు భంగం కలిగిస్తుందని, దేశంలోని పితృస్వామ్య సమాజంలో బాల్య వివాహాలు పెరగడానికి దారితీస్తుందని హక్కుల న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం 18 ఏళ్లు..
దేశ పర్సనల్ స్టేటస్ లా ను సవరించాలని ఇరాక్ న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఈ వివాదాస్పద బిల్లు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇరాక్ లో వివాహానికి కనీస చట్టపరమైన వయస్సు 18 గా ఉంది. ఈ ప్రతిపాదిత బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇప్పటికే నిరసనలు చేపట్టారు. బాగ్దాద్ లో మరిన్ని ప్రదర్శనలను, భారీ నిరసనలకు ప్లాన్ చేశారు.
దేశం వెనక్కు వెళ్తుంది..
ఈ చట్టాన్ని ఆమోదించడం వల్ల ఒక దేశం ముందుకు కాకుండా వెనుకకు వెళ్తుందని హ్యూమన్ రైట్స్ వాచ్ (HRW) పరిశోధకురాలు సారా సాన్బార్ అన్నారు. ఇరాక్ ఉమెన్స్ నెట్ వర్క్ అడ్వకేసీ గ్రూప్ సభ్యురాలు అమల్ కబాషి మాట్లాడుతూ, ఇప్పటికే ఇరాక్ లో తీవ్రమైన ఛాందస సంప్రదాయవాద, పురుషాధిక్య సమాజం వేళ్లూనుకుని ఉంది. ఈ ప్రతిపాదిత వివాహ వయస్సు సవరణ దేశంలో పురుషాధిక్యతకు, మహిళల వెనుకబాటుకు మరింత వీలు కల్పిస్తుంది అని నిరసనకారులు వాదిస్తున్నారు.
బిల్లులో ఇంకా ఏ ప్రతిపాదనలున్నాయి?
ప్రతిపాదిత బిల్లులో మరికొన్ని సవరణలను కూడా ప్రభుత్వం తీసుకువస్తోంది. కుటుంబ సమస్యలను పరిష్కరించడానికి మతపరమైన అధికారులు లేదా పౌర న్యాయవ్యవస్థలో ఒకదాన్ని ఎంచుకోవడానికి పౌరులను ఈ బిల్లు అనుమతిస్తుంది. ఇది వారసత్వం, విడాకులు, పిల్లల సంరక్షణ వంటి రంగాలలో హక్కులను హరిస్తుందని విమర్శకులు ఆందోళన చెందుతున్నారు. సంప్రదాయ షియా ముస్లిం చట్టసభ సభ్యుల మద్దతు ఉన్న ఈ సవరణ ద్వారా 1959 చట్టం బలహీనపడుతుందని భావిస్తున్నారు. మతపరమైన నియమాలను, ముఖ్యంగా షియా, సున్నీ ఇస్లాం చట్టాల అమలును ఈ బిల్లు అనుమతిస్తుంది. ఈ ప్రతిపాదన ఇరాక్ లోని ఇతర మతాలు లేదా వర్గాల గురించి ప్రస్తావించలేదు.
1959 చట్టం ఏం చెబుతోంది?
1959 పర్సనల్ స్టేటస్ చట్టంలో ఇరాక్ లో బాలికల చట్టబద్ధ వివాహ వయస్సును 18 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇరాక్ లో రాచరికం పతనమైన కొద్దికాలానికే అమలు అయిన 1959 చట్టం కుటుంబ విషయాలను నిర్ణయించే అధికారాన్ని మత పెద్దల నుండి ప్రభుత్వానికి, దేశంలోని న్యాయవ్యవస్థకు మార్చింది. ఇరాక్ లో 28 శాతం మంది అమ్మాయిలకు 18 ఏళ్లు నిండకముందే పెళ్లిళ్లు అయ్యాయని యూనిసెఫ్ తెలిపింది. జూలై చివరిలో, చట్టసభ సభ్యుల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాల రావడంతో ప్రతిపాదిత మార్పులను పార్లమెంటు ఉపసంహరించుకుంది. అయితే, ఛాంబర్లో గణనీయమైన ఆధిపత్యం ఉన్న ప్రభావవంతమైన షియా కూటముల మద్దతు పొందిన తరువాత ఆగస్టు 4 న జరిగిన సెషన్లో ఈ బిల్లు తిరిగి కనిపించింది.