ఈ దొంగ లవర్ బాయ్.. 10 మంది భార్యలు, ఆరుగురు గర్ల్ ఫ్రెండ్స్, జాగ్వార్, 5 స్టార్ హోటల్స్‌లో బస
17 October 2024, 6:37 IST
- Viral News : ఓ దొంగకు సంబంధించిన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. అతడికి 10 మంది భార్యలు, ఆరుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అంతేకాదు లగ్జరీ లైఫ్‌స్టైల్ అనుభవిస్తాడు. మరోవైపు తన ఊరికి సాయం అందిస్తాడు.

దొంగ ఇంట్రస్టింగ్ స్టోరీ
పది మంది భార్యలు, ఆరుగురు గర్ల్‌ఫ్రెండ్‌లు, జాగ్వార్‌లో తిరగడం, విమానాల్లో ప్రయాణించడం, 5 స్టార్ హోటళ్లలో బస చేయడం ఇది ఓ దొంగ కథ. అతడి లైఫ్‌స్టైల్ చూస్తే దొంగ అని ఎవరూ నమ్మరు. బీహార్‌లోని సీతామర్హిలో నివసిస్తున్న ఒక వ్యక్తి తన నేరపూరిత కార్యకలాపాలకే కాదు.. అతడు ఉండే విధానంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మొహమ్మద్ ఇర్ఫాన్.. అతడిని ఉజాలే అని కూడా పిలుస్తారు. దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఈ దొంగ ఒక సంపన్న పారిశ్రామికవేత్త ఎలా బతుకుతాడో అలా ఉంటాడు. పది మంది భార్యలు, ఆరుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌తో అతని కథ షాకింగ్‌గా ఉంటుంది.
రెండేళ్ల క్రితం ఘజియాబాద్‌లోని కవినగర్ కొత్వాలి పోలీసులు ఇర్ఫాన్‌ను అరెస్టు చేయడంతో అతని జీవితం గురించి తెలిసింది. అరెస్టు సమయంలో పోలీసులు అతని విలాసవంతమైన జాగ్వార్ కారును స్వాధీనం చేసుకున్నారు. అది అతని భార్యలలో ఒకరి పేరు మీద ఉంది. అమ్మాయిలను ఈజీగా ఆకర్శించడం, మోసం చేయడంలో ఇర్ఫాన్‌కు నైపుణ్యం ఉంది. ఇర్ఫాన్ నేరాలు చేయాలని ప్లాన్ చేసిన నగరాల్లోని మహిళలను ఆకర్షించేవాడు. దొంగిలించిన వస్తువులతో పారిపోయే ముందు కొందరిని పెళ్లి చేసుకోవడం అలవాటు.
దొంగతనాలు చేస్తున్నప్పటికీ ఇర్ఫాన్ తన సొంత గ్రామంలో మంచి పేరు ఉంది. చాలా మంది అతన్ని దొంగగా కాకుండా దేవుడిలా చూస్తారు. అతను దోచుకున్న డబ్బులో ఎక్కువ భాగాన్ని తన గ్రామ అభివృద్ధికి ఖర్చు చేశాడు. అతడి సహకారంతో గ్రామంలో రోడ్లు, విద్యుత్తు దీపాలు వంటి సదుపాయాలు వచ్చాయి. దీంతో అతడి మొదటి భార్య జిల్లా పంచాయితీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అతను తన జాగ్వార్‌లో బీహార్ నుండి ఢిల్లీకి వెళ్తాడు. ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఇష్టపడతాడు. విలాసవంతమైన బంగ్లాలు దొంగతనం చేసేందుకు టార్గెట్ చేసుకుంటాడు. ఒక వారం లేదా పది రోజుల పాటు రెక్కీ వేస్తాడు. ఆ తర్వాత విలువైన వస్తువులను దొంగిలించి జాడ లేకుండా తప్పించుకునేవాడు.
ఇర్ఫాన్ స్టైల్ చూసి కొంతమంది మహిళలు ఇట్టే ఆకర్శితులయ్యేవారు. ఆర్యన్ ఖన్నా అనే పారిశ్రామికవేత్తగా వివిధ నగరాల్లో ఉన్న సమయంలో మహిళలతో స్నేహం చేసేవాడు. వారిలో కొందరిని పెళ్లి చేసుకునేవాడు. మరికొందరు గర్ల్ ఫ్రెండ్స్‌గా ఉండేవారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇర్ఫాన్ స్వయంగా పోలీసుల విచారణలో తనకు ఎంత మంది భార్యలు ఉన్నారో కచ్చితంగా తెలియదని చెప్పాడు. తనకు గుర్తున్నంత వరకు పది మంది భార్యలు, ఆరుగురు గర్ల్‌ఫ్రెండ్‌ల లిస్టు చెప్పాడు. ఈ సంబంధాలు కూడా ఎక్కువ రోజులు మెయింటెన్ చేయడు. దొంగతనం అయిపోయాక మళ్లీ వారిని కలవడు.