Karthik Naralasetty: అమెరికాలో మేయర్ గా పోటీ చేస్తున్న తెలుగువాడు కార్తీక్ నరాలశెట్టి; గెలిస్తే రికార్డే
31 October 2024, 17:26 IST
Karthik Naralasetty: అమెరికా రాజకీయాల్లో భారతీయుల పాత్ర పెరుగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన కమల హారిస్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ పడుతుండగా, టెక్సాస్ లోని ఒక పట్టణంలో జరుగుతున్న ఎన్నికల్లో మేయర్ స్థానానికి ఒక తెలుగువాడు పోటీ పడుతున్నాడు.
అమెరికాలో మేయర్ గా పోటీ చేస్తున్న తెలుగువాడు కార్తీక్ నరలశెట్టి
Karthik Naralasetty: అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు టెక్సాస్ లోని హిల్స్ విలేజ్ లో మేయర్ ఎన్నిక జరుగుతోంది. ఆ పోటీలో తెలుగువాడైన 35 ఏళ్ల అమెరికన్ వ్యాపారవేత్త కార్తిక్ మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. మేయర్ ఎన్నికల్లో గెలిస్తే కార్తిక్ నరాలశెట్టి అతి పిన్న వయస్కుడైన మేయర్ గా, భారత సంతతికి చెందిన తొలి మేయర్ గా చరిత్ర సృష్టిస్తారు. ఈ గ్రామంలో 2000 పైగా ఉన్న జనాభాలో కేవలం ఐదు భారతీయ కుటుంబాలు మాత్రమే ఉన్నాయి.
కార్తీక్ నరలశెట్టి ఎవరు?
- కార్తీక్ నరాలశెట్టి (Karthik Naralasetty) ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జన్మించారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం ఢిల్లీలో పూర్తయింది. భారత్ లో గ్రాడ్యుయేషన్ అనంతరం రట్జర్స్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ చదవడానికి అమెరికా వచ్చాడు.
- అయితే, అతను చదువు మానేసి భారతదేశానికి తిరిగి వచ్చాడు. భారత్ లో అతను రక్తదానం కోసం తన మొదటి సంస్థ సోషల్ బ్లడ్ ను ప్రారంభించాడు. నేడు, దీనిని ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్ల (12 కోట్ల) మంది ఉపయోగిస్తున్నారు.
- ఆ తరువాత పెంపుడు కుక్కల యజమానులను గ్రూమర్లతో అనుసంధానించే ‘పాష్(Pawsh) సంస్థను నెలకొల్పాడు.
- అదనంగా, ప్రొడక్ట్ డిజైనర్ గా కార్తీక్ నరలశెట్టి ఆపిల్, వాల్ మార్ట్, లివైస్ వంటి సంస్థలకు కన్సల్టెంట్ గా పని చేశారు.
వినూత్నంగా ఎన్నికల ప్రచారం
హిల్స్ విలేజ్ మేయర్ గా పోటీలో ఉన్న కార్తీక్ నరాలశెట్టి ఆ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రాంతం అందరూ అభివృద్ధి చెందే ప్రదేశం కావాలన్నదే తన అభిమతమని చెప్పారు. తన రాజకీయ లక్ష్యాలు, ఈ ఎన్నికల్లో గెలిస్తే తాను చేయలనుకుంటున్న కార్యక్రమాల వివరాలను కార్తీక్ తన ప్రచార వెబ్ సైట్ లో సమగ్రంగా వివరించారు.
భార్య ఆదితి సపోర్ట్
కార్తీక్ నరలశెట్టి భార్య అదితి. వారిది ప్రేమ వివాహం. ఆమెను కార్తీక్ రట్జర్ యూనివర్సిటీలో మొదటి సారి కలిశారు. వారికి లీలానీ, జైవిన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. భార్య, పిల్లలతో పాటు న్యూజెర్సీలో నివసిస్తున్న కార్తీక్ అత్తమామలు అతనికి రాజకీయ ప్రస్థానంలో పూర్తి మద్దతు ఇస్తున్నారు. అతడికి అవసరమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారు.