తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi: ‘జీవన విధానంలో యోగా, చిరుధాన్యాలను భాగం చేయండి’: ప్రధాని మోదీ

PM Modi: ‘జీవన విధానంలో యోగా, చిరుధాన్యాలను భాగం చేయండి’: ప్రధాని మోదీ

HT Telugu Desk HT Telugu

Published Jun 18, 2024 04:56 PM IST

google News
  • జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చిరుధాన్యాల సాగు భూసారాన్ని పరిరక్షించడంతో పాటు వాతావరణ మార్పులపై పోరాటానికి తోడ్పడతాయని అన్నారు. యోగాను, చిరు ధాన్యాలను జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన గ్రామ ప్రధాన్ లకు లేఖ రాశారు.

ప్రధాని మోదీ (PTI)

ప్రధాని మోదీ

International Day of Yoga: భూసారాన్ని పరిరక్షించడానికి, వాతావరణ మార్పులపై పోరాటానికి తోడ్పడే యోగా, చిరుధాన్యాలపై మరింత అవగాహన కల్పించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రజల నేతృత్వంలోని ఉద్యమంగా మార్చాలని గ్రామ పంచాయతీ ప్రధాన్ లను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామ పంచాయతీల ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

యోగా కార్యక్రమాలు చేపట్టండి

‘‘క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య సంస్థల సంరక్షకులుగా, యోగా, చిరుధాన్యాల గురించి మరింత అవగాహన కల్పించండి. తద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రజల నేతృత్వంలోని ఉద్యమంగా మార్చాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’ అని ప్రధాని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. పంచాయతీ ప్రాంగణాలు, పాఠశాలలు, అంగన్వాడీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఇతర ప్రదేశాలలో యోగా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రధాని సూచించారు.దానివల్ల ప్రజల్లో ముఖ్యంగా యువతలో స్థిరమైన, ఒత్తిడి లేని జీవనశైలి అలవడుతుందని సూచించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ సమాజంపై యోగా చూపిన ప్రభావానికి ప్రతీక అని ప్రధాన మంత్రి అన్నారు.

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం

‘‘2024 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రపంచ దేశాలు సన్నద్ధమవుతున్నాయి. యోగా ప్రపంచ సమాజంపై చూపిన ప్రభావాన్ని, అలాగే అది మన జీవితాల్లో తీసుకువచ్చిన సానుకూల మార్పులకు ఇది ఒక వేడుక.‘‘మనకోసం, మన సమాజం కోసం యోగా’’ అనే థీమ్ తో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని ప్రధాని మోదీ వెల్లడించారు. ఆరోగ్యకరమైన దేశాన్ని నిర్మించడానికి మన ప్రయత్నాలను మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు.

సంపూర్ణ ఆరోగ్యానికి..

యోగాతో శరీరం, మనస్సు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాయని ప్రధాని మోదీ తెలిపారు. యోగా మనకు మన ప్రాచీన సంస్కృతి అందించిన గొప్ప బహుమతి అన్నారు. ‘‘యోగాభ్యాసం మనల్ని శారీరకంగా, మానసికంగా బలోపేతం చేస్తుంది. శరీరానికి, మనసుకు యోగా ఎంత అవసరమో, చిరుధాన్యాలు వంటి సూపర్ ఫుడ్స్ కూడా అంతే అవసరం. ఇవి నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి. చిరుధాన్యాలకు పెరుగుతున్న డిమాండ్ చిన్న రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతుంది’’ అని ప్రధాని వివరించారు.

2014 నుంచి

ఐక్యరాజ్యసమితి 2014 డిసెంబరు 11న జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేసే ముసాయిదా తీర్మానాన్ని ఐరాసలో భారత్ ప్రతిపాదించగా, రికార్డు స్థాయిలో 175 సభ్య దేశాలు ఆమోదించాయి. జనరల్ అసెంబ్లీ 69వ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ ప్రతిపాదనను ప్రవేశపెట్టారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం