Sexual harassment in IAF: భారత వైమానిక దళంలో లైంగిక వేధింపుల ఆరోపణలు; ఎఫ్ఐఆర్ నమోదు
10 September 2024, 22:00 IST
- భారత వైమానిక దళంలో లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం సృష్టించాయి. వింగ్ కమాండర్ హోదాలో ఉన్న పై అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాలో ఉన్న ఒక యువతి ఆరోపించింది. ఆమె ఆరోపణల మేరకు, బుద్గాం పోలీస్ స్టేషన్లో పోలీసులు ఆ వింగ్ కమాండర్ పై కేసు నమోదు చేశారు.
భారత వైమానిక దళంలో లైంగిక వేధింపుల ఆరోపణలు
వింగ్ కమాండర్ స్థాయి అధికారిపై భారత వైమానిక దళానికి చెందిన మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలు చేశారు. ఆ వింగ్ కమాండర్ పై ఆమె సెంట్రల్ కశ్మీర్లోని బుద్గాం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ వైమానిక దళానికి చెందిన ఆ ఇద్దరు అధికారులు ప్రస్తుతం శ్రీనగర్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఆ యువతి ఫిర్యాదు అనంతరం సెంట్రల్ కశ్మీర్ లోని బుద్గాం పోలీస్ స్టేషన్ లో ఆ వింగ్ కమాండర్ పై సంబంధిత సెక్షన్ల కింద శనివారం ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ‘‘ఈ కేసు గురించి మాకు తెలుసు. ఈ విషయంపై శ్రీనగర్ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను స్థానిక బుద్గాం పోలీస్ స్టేషన్ సంప్రదించింది. ఈ కేసుకు మేం పూర్తిగా సహకరిస్తున్నాం’ అని ఐఏఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
రెండేళ్లుగా లైంగిక వేధింపులు
వింగ్ కమాండర్ హోదాలో ఉన్న అధికారి గత రెండేళ్లుగా తనను వేధింపులు, లైంగిక వేధింపులు, మానసిక హింసలకు గురిచేస్తున్నారని ఆ మహిళా అధికారి ఆరోపించారు. గత సంవత్సరం డిసెంబర్ 31న ఆఫీసర్స్ మెస్ లో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా వింగ్ కమాండర్ తనను బలవంతంగా ఒక గదిలోకి తీసుకువెళ్లాడని, అక్కడ తన పై బలవంతంగా ఓరల్ సెక్స్ లో పాల్గొని లైంగికంగా వేధించాడని మహిళా అధికారి ఆరోపించారు. అతడిని తాను తోసేసి అక్కడి నుంచి పారిపోయానని వివరించారు. ఆ తరువాత ఆ వింగ్ కమాండర్ ఏమీ జరగనట్లుగా ప్రవర్తించారని ఫ్లయింగ్ ఆఫీసర్ పేర్కొన్నారు.
మహిళా అధికారుల సహకారంతో..
ఈ వేధింపుల విషయం చెప్పడంతో, మరో ఇద్దరు మహిళా అధికారులు.. పై అధికారులకు ఫిర్యాదు చేయాలని తనకు సూచించారని ఆమె చెప్పారు. దాంతో, ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి కల్నల్ స్థాయి అధికారిని నియమించారని, అయితే, తనతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వింగ్ కమాండర్ ను కూడా కూర్చోబెట్టి వాంగ్మూలాలను రికార్డ్ చేశారని ఆమె వివరించారు. అతడితో పాటు కూర్చోబెట్టి వాంగ్మూలాలను రికార్డు చేయడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానని చెప్పారు. చివరకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నానని ఆమె వివరించారు.