Karnataka Elections 2023: బీజేపీకి భారీ ఎదురుదెబ్బ.. పార్టీకి మాజీ సీఎం గుడ్‍బై.. కారణమిదే!
16 April 2023, 14:20 IST
- Karnataka Elections 2023 - Jagadish Shettar: బీజేపీకి తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు కీలక నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టార్. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కషాయ పార్టీకి ఇది పెద్ద షాక్‍గా మారింది.
బీజేపీకి భారీ ఎదురుదెబ్బ.. పార్టీకి మాజీ సీఎం గుడ్‍బై (HT Photo)
Karnataka Elections 2023 - Jagadish Shettar: కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీ (BJP)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత జగదీశ్ శెట్టార్.. ఎమ్మెల్యే పదవికి ఆదివారం రాజీనామా చేశారు. బీజేపీకి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly Elections) జరగనుండగా.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుబ్లీ-ధర్వాడ్ సెంట్రల్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ ఈసారి నిరాకరించింది. దీంతో బీజేపీకి గుడ్‍బై చెప్పేందుకు శెట్టార్ నిర్ణయించుకున్నారు. వివరాలివే..
ఆరుసార్లు ఎమ్మెల్యే..
Karnataka Elections 2023 - Jagadish Shettar: హుబ్లీ-ధర్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జగదీశ్ శెట్టార్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచే ఆయన ఎమ్మేల్యేగా ఉన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా ఈ తతంగం జరుగుతోంది. బీజేపీ నేతలు కొందరు బుజ్జగించినా చివరికి పార్టీని వీడేందుకే శెట్టార్ నిర్ణయించుకున్నారు. 2012 జూలై నుంచి 2014 మే వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా చేశారు జగదీష్ శెట్టార్.
“కొందరు కుట్ర చేశారు”
Karnataka Elections 2023 - Jagadish Shettar: ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సికి వెళ్లిన జగదీశ్ శెట్టార్.. అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు రాజీనామా పత్రం సమర్పించారు. పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు హుబ్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Karnataka Elections 2023 - Jagadish Shettar: “శాసనసభ సభ్వత్వానికి, బీజేపీకి నేను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. పార్టీని కింది నుంచి పైకి తీసుకొచ్చా. కానీ వారు (కొందరు బీజేపీ నాయకులు).. నేను రాజీనామా చేయాల్సిన పరిస్థితని సృష్టించారు” అని షెట్టార్ అన్నారు. తనకు వ్యతిరేకంగా కొందరు కుట్రలు పన్ని, పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారని ఆరోపించారు. దశాబ్దాల పాటు పార్టీకి సేవలు చేసిన తనను, అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు శెట్టార్.
పార్టీలోనే ఉండాలని సీఎం బసవరాజు బొమ్మై, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్ సహా మరికొందరు బీజేపీ సీనియర్ నేతలు జగదీశ్ శెట్టార్‌పై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన పార్టీని వీడేందుకే నిర్ణయం తీసుకున్నారు.
Karnataka Elections 2023 - Jagadish Shettar: కర్ణాటకలో బలమైన లింగాయత్ వర్గానికి చెందిన సీనియర్ నేత జగదీశ్ శెట్టార్ పార్టీని వీడడం బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బగానే ఉంది. ఉత్తర కర్ణాటకలో ఆయన కీలక నేతగా ఉన్నారు. ఇటీవల, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడీ కూడా ఎమ్మెల్యే టికెట్ రాలేదనే కారణంతో కమలం పార్టీని వీడారు.
పోటీ చేస్తా
హుబ్లీ-ధర్వాడ్ స్థానం నుంచి తాను పోటీ చేసి తీరుతానని జగదీశ్ శెట్టార్ స్పష్టం చేస్తున్నారు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలా.. ఇతర పార్టీలో చేరాలా అన్నది ఆయన ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వైపు ఆయన మొగ్గుచూపే అవకాశం ఉందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీన జరగనుంది. మే 15వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.