తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Starlink In India : త్వరలో స్టార్‌లింక్ సేవలు భారత్‌లో ప్రారంభం.. ప్రభుత్వ షరతులకు ఎలాన్ మాస్క్ ఓకే

Starlink In India : త్వరలో స్టార్‌లింక్ సేవలు భారత్‌లో ప్రారంభం.. ప్రభుత్వ షరతులకు ఎలాన్ మాస్క్ ఓకే

Anand Sai HT Telugu

12 November 2024, 11:54 IST

google News
  • Starlink In India : ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ త్వరలో భారత్‌లో ప్రారంభం కానుంది. డేటా స్టోరేజ్, సెక్యూరిటీకి సంబంధించి భారత ప్రభుత్వ నిబంధనలను పాటించేందుకు కంపెనీ అంగీకరించినట్లు సమాచారం.

స్టార్‌లింక్
స్టార్‌లింక్

స్టార్‌లింక్

ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్ త్వరలో భారత్‌లో ప్రారంభం అవుతుంది. ఒక నివేదిక ప్రకారం డేటా స్టోరేజ్, భద్రతకు సంబంధించి భారత ప్రభుత్వ నిబంధనలను పాటించడానికి కంపెనీ అంగీకరించింది. ఇది శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి అవసరమైన లైసెన్సులను పొందే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. స్టార్‌లింక్ నిబంధనలను పాటించడానికి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, ఈ అవసరాలను తీర్చడానికి అధికారికంగా తన ఒప్పందాన్ని సమర్పించాలి.

భారత్ లో కార్యకలాపాలు నిర్వహించాలంటే స్టార్‌లింక్ వంటి శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థలు దేశంలో యూజర్ల డేటా మొత్తాన్ని స్టోర్ చేయాలి. ప్రభుత్వం నుండి లైసెన్స్ పొందడానికి ముందు నెరవేర్చాల్సిన ఒక ముఖ్యమైన షరతు ఇది.

అవసరమైతే ప్రభుత్వ సంస్థలు డేటాను ఎలా యాక్సెస్ చేయవచ్చో స్టార్‌లింక్ వివరించాల్సి ఉంటుంది. అక్టోబర్ 2022లో స్టార్‌లింక్ జీఎంపీసీఎస్(గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ సర్వీసెస్) లైసెన్స్ అని పిలిచే నిర్దిష్ట లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది. ఇది వారి శాటిలైట్ ఇంటర్నెట్ సేవను ఏర్పాటు చేయడానికి మొదటి దశ. ఇది సాధారణంగా ట్రయల్ పీరియడ్‌ను కలిగి ఉంటుంది.

భారతదేశంలో అంతరిక్ష కార్యకలాపాలను నియంత్రించే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ పర్యవేక్షణలో స్టార్‌లింక్ అప్లికేషన్ కొనసాగుతోంది. స్టార్‌లింక్, అమెజాన్ రెండింటి శాటిలైట్ ప్రాజెక్టులను కూడా తాను ప్రశ్నించానని, అవసరమైన వివరాలను సేకరించే పనిలో ఉన్నామని ఇన్-స్పేస్ చైర్మన్ పవన్ కుమార్ గోయెంకా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

స్టార్‌లింక్ భద్రతా అవసరాలను తీర్చిన తర్వాత, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఉపగ్రహ సేవల ధర, స్పెక్ట్రమ్ కేటాయింపు నిబంధనలను ఖరారు చేయాలి. తర్వాత భారతదేశంలో శాటిలైట్ స్టార్‌లింక్ సేవలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ట్రాయ్ తన సిఫార్సులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తుందని, దేశంలో స్టార్‌లింక్ ప్రారంభానికి మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.

ఇదిలావుండగా వేలం లేకుండా శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను కేటాయించాలన్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల భారత టెలికాం రెగ్యులేటరీ బాడీని కోరింది. ఈ చర్య ఎలాన్ మస్క్ స్టార్ లింక్‌కు కొంత ఇబ్బంది కలిగించేదే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం