తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Dink Lifestyle : కలిసే ఉంటారట.. పిల్లలు వద్దట.. భారత్‌లో పెరుగుతున్న Dink లైఫ్‌స్టైల్!

DINK Lifestyle : కలిసే ఉంటారట.. పిల్లలు వద్దట.. భారత్‌లో పెరుగుతున్న DINK లైఫ్‌స్టైల్!

Anand Sai HT Telugu

Published Aug 19, 2024 02:02 PM IST

google News
    • DINK Couple : కొంతకాలంగా ఇండియాలో ఓ ట్రెండ్‌కు రోజురోజుకు పెరుగుతుంది. అదేంటంటే.. వివాహం చేసుకుంటారు.. జీవితాంతం కలిసే ఉంటారు. కానీ పిల్లల్ని మాత్రం ప్లాన్ చేయరు. దీనిని DINK లైఫ్‌స్టైల్ అంటారు. చాలా మంది ఈ ట్రెండ్ ఫాలో అయ్యేందుకు ఎందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు?
DINK లైఫ్‌స్టైల్ (Unsplash)

DINK లైఫ్‌స్టైల్

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు.. సంతోషం వచ్చినా.. బాధ వచ్చినా.. కలిసే పంచుకునేవారు. రానురాను ఉద్యోగాలు, ప్రైవేసీ పేరుతో ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం అన్నట్టుగా జనాలు ఆలోచన మెుదలుపెట్టారు. ఆ తర్వాత అసలు అత్తామామలను ఎక్కడో పెట్టి.. భార్యాభర్తలు మాత్రం లైఫ్‌ని లీడ్ చేసే కల్చర్ వచ్చింది. ఇప్పుడు ఇది కాస్త ఇంకా అడ్వాన్స్‌డ్‌గా మారింది. అది ఏంటంటే DINK లైఫ్‌స్టైల్.

ఈ పద్ధతికి అర్థమేంటి?

DINK లైఫ్‌స్టైల్ అంటే.. Double Income No Kids. సంపాదన ఎక్కువే ఉండాలి.. కానీ పిల్లలు మాత్రం వద్దు అనే సంస్కృతి భారతదేశంలో కొన్ని రోజులుగా మెుదలైంది. జంటలు తమ ప్రైవేసీ కోసం ఇలాంటి పద్ధతిని పాటిస్తున్నారు. పిల్లలను కనకుండా దంపతులు బాగా డబ్బులు సంపాదిస్తారు. అంటే ఇద్దరి సంపాదన ఉంటుంది. తర్వాత వాటితో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. నచ్చిన ప్రదేశానికి వెళ్తారు.. నచ్చిన తిండి తింటారు. అంటే ఇక వారి జీవితానికి వారే రాజు.. రాణి అన్నమాట.

నిజానికి ఈ కాన్సెప్ట్ ఇతర దేశాల్లో 1980లలోనే మెుదలైంది. కానీ ఇటీవల ఇండియాలో కూడా ఫాలో అవుతున్నారు. దానికి తగ్గట్టుగానే జననాల రేటు తగ్గిపోతుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

సోషల్ మీడియాలో మెుదలై

ఈ ట్రెండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా జనాదరణ పొందుతోంది. తెలిసి తెలియక అటువంటి జీవనశైలిని గొప్పగా ఉందని చెప్పడం ద్వారా జంటలను DINK ఆలోచనల వైపు వెళ్తున్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా DINK జీవనశైలి జనాదరణ పొందుతోంది. ఇది సమీప భవిష్యత్తులో ప్రమాదకరం కూడా కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

లగ్జరీ లైఫ్

భారతదేశంలో చాలా ఏళ్ల కిందట ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. గత నాలుగైదు దశాబ్దాల వరకు దానికి కట్టుబడి ఉండేవారు. కానీ ఈ సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొన్ని దశాబ్దాలుగా దెబ్బతింది. ఎందుకంటే విద్యావంతులైన చాలా మంది యువ జంటలు ఉమ్మడి కుటుంబానికి దూరమై కొత్త ఉద్యోగాల వెతుకులాటలో, ఎక్కువ ఆదాయం సంపాదించి, లగ్జరీ లైఫ్ అనుభవించేందుకు అలవాటు పడ్డారు.

DINK జీవనశైలి పాశ్చాత్య దేశాలలో మాత్రమే కాకుండా.. భారత్ వంటి దేశంలోనూ యువ జంటలను చాలా వేగంగా ఆకర్షిస్తోంది. ఈ పద్ధతి ద్వారా పిల్లల మీద పెట్టే ఖర్చుతో జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని కొందరు అనుకుంటున్నారు. పిల్లలతో పడాల్సిన బాధలు ఏవీ ఉండవని అనుకుంటారు. ఇందుకోసం సంపాదించిన దాంట్లో కొంత భాగం వృద్ధాప్యం కోసం దాచిపెడుతున్నారు. అయితే వృద్ధాప్యంలో పిల్లలతోడు లేకుంటే ఎంత నరకంగా ఉంటుందో మాత్రం ఆలోచించడం లేదు.

ఏం చేస్తారంటే

ఈ ట్రెండ్ ద్వారా కొన్ని లాభాలు ఉన్నప్పటికీ.. నష్టాలు కూడా అనేకం ఉన్నాయి. ఈ లైఫ్‌స్టైల్ పాటిస్తే వచ్చే ఆర్థిక స్వేచ్ఛతో జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని కొందరు అనుకుంటున్నారు. పిల్లలకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని భావనలో ఉన్నారు. రెట్టింపు ఆదాయాన్ని సంపాదించి ఎలాంటి ఆర్థిక పరిమితులు లేకుండా తమకు నచ్చిన జీవితాన్ని ఆస్వాదించవచ్చని భావిస్తున్నారు. ఇది వారికి నచ్చిన విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి, స్వేచ్ఛతో విలాసవంతమైన జీవనశైలిని గడపడానికి ఆర్థిక పరపతిని ఇస్తుంది.

ఈ లైఫ్‌స్టైల్ పాటిస్తే పిల్లలను పెంచడంపై వారికి ఎటువంటి భారం ఉండదు. అందువల్ల పిల్లల సంరక్షణ, బాధ్యతల భారం లేకుండా వారి ఉద్యోగాలు, అభిరుచులు, ప్రయాణ ప్రయోజనాలను కొనసాగించడానికి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లే స్వేచ్ఛ ఉంది. పిల్లలు లేకుండా ఈ జంటలు తమ సంబంధంలో ఎక్కువ సమయం, డబ్బును పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు.

పిల్లలు ఉంటేనే కుటుంబం

నిజానికి సంతానోత్పత్తి అనేది ప్రకృతి నియమం. మానవులకు, భూమిపై ఉన్న ఇతర జీవులకు విశ్వవ్యాప్తంగా ఈ రూల్ వర్తిస్తుంది. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజమూ దీర్ఘకాలంలో మనుగడ సాగించదు. భారతదేశంలో పిల్లలు కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. పిల్లల ఉనికిని కలిగి ఉండటం తల్లిదండ్రులకు మాత్రమే కాదు.. అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. రానురాను DINK లైఫ్‌స్టైల్ భారతదేశంలో ఎలా ఉంటుందో చూడాలి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.
తదుపరి వ్యాసం