Delhi crime news: రూ.45 వేల అప్పు గురించి గొడవ; వ్యక్తి దారుణ హత్య
21 December 2024, 15:11 IST
Delhi crime news: రూ. 45 వేలు అప్పు తీసుకున్న వ్యక్తి దానిని తిరిగి ఇవ్వకపోవడంతో ప్రారంభమైన గొడవ, చిలికి చిలికి గాలివానై ఒక వ్యక్తి దారుణ హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఢిల్లీలోని నరేలాలో చోటు చేసుకుంది. అయితే, ఆ అప్పుతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేని 26 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
రూ.45 వేల అప్పు గురించి గొడవ; వ్యక్తి దారుణ హత్య
Delhi crime news: ఉత్తర ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో శుక్రవారం సాయంత్రం 26 ఏళ్ల యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక వివాదానికి సంబంధించి ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేరానికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
రూ. 45 వేల అప్పు గొడవ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నాలుగు నెలలుగా హిమాన్షు తన స్నేహితుడు సుమిత్ కౌశిక్ తో కలిసి నరేలా ప్రాంతంలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్లో ఉంటున్నాడు. ఆ ఫ్లాట్ లోనే శుక్రవారం శవమై కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించి సాయంత్రం 6:28 గంటలకు పోలీసులకు పిసిఆర్ కాల్ వచ్చింది. దర్యాప్తులో రవి, సాహిల్, అక్షయ్ ఖత్రి, ఆశిష్ అనే నలుగురు వ్యక్తులు హిమాన్షుపై దాడి చేసి, కత్తితో పొడిచినట్లు పోలీసులు గుర్తించారు. ఫిర్యాదుదారుడు సుమిత్ కౌశిక్ ఈ నేరానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. నిందితులు సాయంత్రం 6 గంటల సమయంలో అపార్ట్మెంట్ కు వచ్చి హిమాన్షుపై దాడి చేసి పారిపోయారని పోలీసులు తెలిపారు. సుమిత్ కౌశిక్ నుంచి రవి రూ.45 వేలు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో ఈ గొడవ ప్రారంభమైందని తెలుస్తోంది.
ఇంటికి వెళ్లి గొడవ చేయడంతో..
సుమిత్ కౌశిక్ నుంచి తీసుకున్న రూ. 45 వేలను రవి తిరిగి ఇవ్వకపోవడంతో, సఫియాబాద్ లోని రవి ఇంటికి హిమాన్షు పలు మార్లు వెళ్లి, ఆ డబ్బు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులను బెదిరించాడు. దాంతో ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన రవి తన అనుచరులతో కలిసి ఈ దాడికి పాల్పడ్డాడు. పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రవి (30), సాహిల్ (24), ఆశిష్ (26)లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న అక్షయ్ ఖత్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరుగుదొడ్డిని సరిగా ఫ్లష్ చేయలేదనే వివాదంలో..
మరో ఘటనలో మరుగుదొడ్డిని సరిగా ఫ్లష్ చేయలేదనే వివాదంలో 18 ఏళ్ల స్క్రాప్ షాప్ కార్మికుడిని అతని ఇరుగుపొరుగు వారు కత్తితో పొడిచి చంపారు. కామన్ టాయిలెట్ సరిగా ఫ్లష్ చేయకపోవడంపై మృతుడు సుధీర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. సుధీర్ కు నిందితుడి కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగింది. భికం సింగ్, అతని భార్య మీనా, వారి ముగ్గురు కుమారులు సంజయ్ (20), రాహుల్ (18), ఒక బాలుడు కలిసి సుధీర్ పై, అతడి సోదరుడు ప్రేమ్ పై, వారి స్నేహితుడు సాగర్ పై దాడి చేశారు. కిచెన్ కత్తితో సుధీర్ ఛాతీ, ముఖం, తలమీద పొడిచి హత్య చేశారు. అతని సోదరుడు ప్రేమ్ (22) చికిత్స పొందుతుండగా, అతని స్నేహితుడు సాగర్ డిశ్చార్జ్ అయ్యాడు.