తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Congestion Tax : రద్దీ సమయంలో ఈ రోడ్ల మీద వెళితే కొత్త ‘ట్యాక్స్​’ వేస్తారు..!

Delhi congestion tax : రద్దీ సమయంలో ఈ రోడ్ల మీద వెళితే కొత్త ‘ట్యాక్స్​’ వేస్తారు..!

Sharath Chitturi HT Telugu

12 October 2024, 13:39 IST

google News
  • Congestion tax Delhi : పీక్ హవర్ ట్రాఫిక్​ని తగ్గించేందుకు “రద్దీ పన్ను”ను ప్రవేశపెట్టాలని దిల్లీ యోచిస్తోంది. పైలట్ ప్రాజెక్ట్​ కింద 13 కీలక సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించనుంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్​ని తగ్గించేందుకు కొత్త ట్యాక్స్​!
రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్​ని తగ్గించేందుకు కొత్త ట్యాక్స్​! (Sunil Ghosh/HT Photo)

రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్​ని తగ్గించేందుకు కొత్త ట్యాక్స్​!

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ట్రాఫిక్​ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో ప్రజలు చాలా కాలంగా రద్దీ రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్​ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇప్పటివరకు పెద్దగా పరిష్కారం దక్కలేదు. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం ‘ట్యాక్స్​’ ఆలోచనతో ముందుకొచ్చింది. ఈ ‘దిల్లీ కంజెషన్​ ట్యాక్స్​’ ప్రకారం.. రద్దీ సమయంలో, ఎంపిక చేసిన రోడ్డు మీద మీరు ప్రయాణిస్తే అదనంగా- కొత్త ట్యాక్స్​ కట్టాల్సి వస్తుంది! ఇలా చేస్తే, ట్రాఫిక్​ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

ట్రాఫిక్​ నియంత్రణ పేరుతో ట్యాక్స్​ మోత..?

రద్దీ సమయాల్లో నిర్దేశిత రహదారులను ఉపయోగించినందుకు డ్రైవర్లకు ఛార్జీలు వసూలు చేసే వ్యూహాన్ని రూపొందిస్తున్నామని రవాణా శాఖ ప్రత్యేక కమిషనర్ షహజాద్ ఆలం తెలిపారు.

"రవాణా నిర్వహణకు కొత్త నిధుల కేటాయింపు జరుగుతోంది. మేము పనిచేస్తున్నదాన్ని ‘రద్దీ ధర(కంజెషన్​ ప్రైజింగ్​)’ అని పిలుస్తున్నాము," అని ఆలం చెప్పారు.

ఇందుకోసం ప్రయోగాత్మకంగా దిల్లీ సరిహద్దుల్లోని 13 కీలక ప్రాంతాలను గుర్తించి పైలట్​ ప్రాజెక్ట్​ని చేపట్టారు.

రద్దీ పన్ను ఆలోచన దిల్లీకి కొత్త కాదు..!

దిల్లీలో సదరు “రద్దీ పన్ను” ప్రతిపాదన కొత్త విషయం కాదు. 2018లో అప్పటి లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తొలిసారి ఈ ప్రతిపాదన చేశారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్​ అధికంగా ఉండే రోడ్లపైకి ప్రవేశించే వాహనాలకు ఛార్జ్​ వసూలు చేయాలని ఆయన ప్రతిపాదించారు.

ట్రాఫిక్​ని సులభతరం చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం ఈ ప్రయోగం ముఖ్య లక్ష్యం. నాడు.. ప్రభుత్వం నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు, ఈ విధానాన్ని అమలు చేయడానికి ముందు ప్రజల అభిప్రాయాన్ని కోరుతామని బైజల్ పేర్కొన్నారు. ఐటీఓ కూడలి, మెహ్రౌలి-గుర్గావ్ రోడ్డు సహా 21 హై ట్రాఫిక్ ప్రాంతాలను పన్నుకు అవకాశం ఉన్న ప్రాంతాలుగా ఆ సమయంలో దిల్లీ ప్రభుత్వం గుర్తించింది.

2017లో పార్లమెంటరీ కమిటీ కూడా రాజధానిలో రద్దీగా ఉండే ప్రాంతాలపై టోల్ విధించాలని సిఫార్సు చేసింది.

బెంగళూరులోనూ రద్దీ పన్ను విధించాలి..!

బెంగళూరులో జనసాంద్రత ఎక్కువగా ఉండే రోడ్లపై ట్రాఫిక్​ని తగ్గించడానికి 'రద్దీ పన్ను' విధించాలని అధికారులకు ఇటీవలే ఒక నివేదిక సూచించింది.

కర్ణాటక దశాబ్దం - 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి రోడ్ మ్యాప్ అనే శీర్షికతో కర్ణాటక ప్రణాళికా విభాగం, పరిశ్రమ బృందం ఇచ్చిన నివేదిక, రద్దీ సమయాల్లో నగరంలోకి ప్రవేశించే మినహాయింపు లేని వాహనాల నుంచి పన్ను వసూలు చేయడానికి ప్రస్తుత ఫాస్టాగ్ వ్యవస్థను ఆ నివేదిక ఉపయోగించాలని సూచించింది.

ప్రజారవాణాను మెరుగుపరచడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి, జీవన నాణ్యతను పెంచడానికి ఈ ఆదాయాన్ని ఉపయోగించవచ్చని తెలిపింది.

సింగపూర్, లండన్, స్టాక్​హోమ్​ వంటి నగరాలు ట్రాఫిక్​ని నిర్వహించడానికి, రద్దీని తగ్గించడానికి ఇలాంటి పన్నులను విజయవంతంగా అమలు చేశాయి.

మరి ఈ కంజెషన్​ ట్యాక్స్​ మీద మీ ఒపీనియన్​ ఏంటి? ఇది అమల్లోకి వస్తే ప్రజలపై మరింత భారం పడినట్టు అవుతుందా? లేక నిజంగానే ట్రాఫిక్​ కంట్రోల్​ అవుతుందా?

తదుపరి వ్యాసం