తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  చైనా జనాభా తగ్గిపోనుంది.. తొలిసారిగా అతి తక్కువ పెరుగుదల నమోదు..

చైనా జనాభా తగ్గిపోనుంది.. తొలిసారిగా అతి తక్కువ పెరుగుదల నమోదు..

HT Telugu Desk HT Telugu

30 May 2022, 12:43 IST

google News
  • చైనా జనాభా క్రమంగా తగ్గుముఖం పట్టనుంది. ఈ దిశగా తాజా గణాంకాలు సంకేతాలను అందిస్తున్నాయి. 60 ఏళ్ల క్రితం తీవ్రమైన కరువు పరిస్థితుల అనంతరం ఇప్పుడు జనాభా తగ్గుముఖం పట్టనుంది.

చైనాలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు (ప్రతీకాత్మక చిత్రం)
చైనాలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు (ప్రతీకాత్మక చిత్రం) (REUTERS)

చైనాలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు (ప్రతీకాత్మక చిత్రం)

మెల్‌బోర్న్, మే 30: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా జనాభా ఇకమీదట తగ్గిపోనుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో ఆరో వంతు కంటే ఎక్కువగా చైనాలోనే ఉంది. 

నాలుగు దశాబ్దాల్లో చైనా జనాభా 660 మిలియన్ల నుంచి 1.4 బిలియన్లకు వేగంగా పెరిగిన అనంతరం 1959-61 నాటి తీవ్రమైన కరువు అనంతరం తొలిసారిగా తగ్గుముఖం పట్టింది.

చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాల ప్రకారం 2021లో చైనా జనాభా 1.41212 బిలియన్ల నుంచి 1.41260కి మాత్రమే పెరిగింది. అంటే కేవలం 4,80,000 మాత్రమే పెరిగింది. ఇది రికార్డుస్థాయి తక్కువ వార్షిక పెరుగుదల. ఒక దశాబ్దం క్రితం ఏటా కనీసం 80 లక్షల జనాభా పెరుగుదల నమోదయ్యేది.

కఠినమైన కోవిడ్ ఆంక్షల నడుమ పిల్లలను కనేందుకు ఇష్టపడకపోయి ఉండవచ్చని, ఈ కారణంగా జననాల సంఖ్య తగ్గుముఖం పట్టి ఉంటుందని అంచనా. కాగా ఈ సరళి కొద్ది సంవత్సరాలుగా కూడా ఇదే రీతిలో ఉంది. చైనా దేశపు సంతానోత్పత్తి రేటు(ఒక మహిళకు కలిగే సంతానం) 1980ల కాలంలో 2.6గా ఉండేది. 

1994కు వచ్చేసరికి ఇది 1.6 నుంచి 1.7 మధ్య ఉండేది. ఇక 2020 నాటికి మరింత తగ్గి 1.3కు పడిపోయింది. ఇక 2021లో కేవలం 1.155గా నమోదైంది.

ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్‌లో టోటల్ ఫర్టిలిటీ రేటు 1.6గా ఉంది. జపాన్‌లో టీఎఫ్ఆర్ 1.3గా ఉంది. 2016లో చైనా ‘ఒకే సంతానం’ పాలసీని రద్దు చేసి, ముగ్గురు పిల్లల పాలసీని ప్రకటించింది. గత ఏడాది పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. ఇన్ని చేసినా చైనాలో టీఎఫ్ఆర్ 1.15కు పడిపోవడం గమనార్హం.

ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నప్పటికీ చైనా మహిళలు పిల్లలను ఎందుకు కనడం లేదన్న అంశంపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. చిన్న కుటుంబాలకు అలవాటు పడడం ఒకటైతే, జీవన వ్యయం పెరగడం మరొకటి. ఇక వివాహం చేసుకునే వయస్సు పెరుగుతుండడం, పిల్లలను కనడంలో ఆలస్యమవడానికి దారితీస్తోంది. అలాగే పిల్లలను కనాలన్న ఆసక్తి కూడా సన్నగిల్లేలా చేస్తోంది.

దీనికి తోడు పిల్లలను కనగలిగే వయస్సు ఉన్న మహిళలు చైనాలో తక్కువగా ఉన్నారు. 1980 నుంచి ఒకే సంతానం పాలసీ అమలైనప్పుడు ఎక్కువ మంది జంటలు మగ సంతానాన్ని ఎంచుకున్నారు. ఈ కారణంగా స్రీ పురుష నిష్పత్తి సమతుల్యం కోల్పోయింది. ప్రతి వంద మంది బాలికలకు 120 మంది బాలురు ఉన్నారు. కొన్ని రాష్ట్రాల్లో 100 మంది బాలికలకు 130 మంది బాలురు ఉన్నారు.

1959 నాటి తీవ్ర కరువు అనంతరం తొలిసారిగా గత ఏడాది అతి తక్కువ పెరుగుదల నమోదైంది. అంచనా వేసిన సమయం కంటే ఓ దశాబ్దకాలం ముందుగానే జనాభా తగ్గుదల ప్రారంభం మొదలైందని అంచనా వేస్తున్నారు. చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ 2029లో జనాభా గరిష్ఠ సంఖ్య 1.44 బిలియన్లకు చేరుతుందని 2019లో అంచనా వేసింది.

కాగా యునైటెడ్ నేషన్స్ 2031-32లో చైనా జనాభా 1.46 బిలియన్ల గరిష్ఠానికి చేరుకుంటుందని 2019లో అంచనా వేసింది.

షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ బృందం 2021 తర్వాత వార్షిక సగటు 1.1% క్షీణతను అంచనా వేసింది. అంటే 2100 సంవత్సరం నాటికి చైనా జనాభా 587 మిలియన్లకు తగ్గనుందని అంచనావేసింది. అంటే ప్రస్తుత జనాభాలో అది సగం కంటే తక్కువవుతుందని అంచనా వేసింది.

అంచనాలు సహేతుకమని చెప్పడానికి కారణాలు ఏంటంటే చైనా సంతానోత్పత్తి రేటు ఇప్పుడున్న 1.15 నుంచి 2030లో 1.1కి పడిపోనుండడమే. ఇది 2100 వరకు అలాగే ఉండొచ్చు.

అయితే వేగవంతంగా జనాభా తగ్గితే చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్రప్రభావం చూపుతుంది.

చైనాలో వర్కింగ్ ఏజ్‌ జనాభా 2014లో గరిష్ఠంగా ఉండేది. 2100 నాటికి వర్కింగ్ ఏజ్ జనాభా 2014 నాటి వర్కింగ్ ఏజ్ జనాభాలో మూడో వంతుకు తగ్గనుంది.

ఇక చైనాలో పెద్దల జనాభా క్రమంగా పెరుగుతూనే ఉంది. 2080లో వర్కింగ్ ఏజ్ కంటే కూడా పెద్దల జనాభా ఎక్కువ ఉండనుంది.

పెద్దవాళ్లు పెరుగుతున్నారు..

ప్రస్తుతం ప్రతి 100 మంది వర్కింగ్ ఏజ్ జనాభా 20 మంది వృద్ధులకు సపోర్ట్‌గా ఉంది. 2100 సంవత్సరం నాటికి ప్రతి వంద మంది వర్కింగ్ ఏజ్ ప్రజలు కనీసం 120 మంది వృద్ధులకు సపోర్ట్‌గా ఉండాల్సి వస్తుంది.

వర్కింగ్ ఏజ్ ప్రజల జనాభా ఏటా 1.73 శాతం తగ్గుతోంది. ఇది ఆర్థిక వృద్ధి తక్కువయ్యేందుకు కారణమవుతుంది. 

లేబర్ ఫోర్స్ తగ్గినకొద్దీ లేబర్ కాస్ట్ పెరుగుతుంది. ఈ కారణంగా తయారీరంగంలో తక్కువ మార్జిన్లకు పరిమితం కావాల్సి వస్తుంది. ఇప్పటికే వియత్నాంలో ఉన్నలేబర్ చార్జీల కంటే చైనాలో రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

ఇదే సమయంలో వృద్ధుల జనాభా పెరుగుతున్నందున ప్రొడక్టివ్ రీసోర్సెస్‌ను ఆరోగ్యం, వైద్యం, వృద్ధాప్య సేవల కోసం మళ్లించాల్సి వస్తుంది.

విక్టోరియా యూనివర్శిటీలోని సెంటర్ ఆఫ్ పాలసీ స్టడీస్ మోడలింగ్ ప్రకారం చైనా పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు లేకుండా.. దాని పెన్షన్ చెల్లింపులు 2020లో జీడీపీలో 4% నుండి 2100లో జీడీపీలో 20%కి పెరుగుతాయని సూచిస్తున్నాయి.

కాగా ఈ దశాబ్దంలోనే భారత దేశపు జనాభా చైనా జనాభాను అధిగమిస్తుందని అంచనాలు ఉన్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం