Justin Trudeau : అటు ఆరోపణలు- ఇటు స్నేహం కోసం ప్రయత్నాలు.. కెనడా ప్రధాని మాటలకు అర్థమేంటి?
29 September 2023, 9:40 IST
Justin Trudeau : భారత్‌పై ఓవైపు తీవ్ర ఆరోపణలు చేస్తూనే.. మరోవైపు చెలిమి గురించి మాట్లాడుతున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. ఈ వార్త ఇప్పుడు చర్చలకు దారి తీసింది.
జస్టిన్ ట్రూడో..
Justin Trudeau latest news : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య నేపథ్యంలో భారత- కెనడా మధ్య బంధం బలహీన పడుతున్న వేళం.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో. భారత్‌తో ఇప్పటికీ తాము మంచి బంధం కావాలని కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే.. భారత్‌తో బంధం ఈ సమయంలో చాలా ముఖ్యం అని కూడా అన్నారు.
కెనడా మాంట్రియల్లో గురువారం జరిగిన ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు జస్టిన్ ట్రూడో. భారత్‌తో బంధంపై ఈ మేరకు వ్యాఖ్యానించారు.
India Canada relation : "భారత్.. వేగంగా వృద్ధిచెందుతున్న ఒక ఆర్థిక శక్తి. భౌగోళిక రాజకీయాల్లో ఆ దేశానిది కీలక పాత్ర. మా ఇండో-పెసిఫిక్ స్ట్రాటెజీని గతేడాదే మీకు చూపించాము. దానిపై మేము చాలా సీరియస్‌గా ఉన్నాము. అందుకే ఇండియాతో సత్సంబంధాలు కుదుర్చుకోవాలని చూస్తున్నాము. కెనడా ఒక్కటే కాదు! కెనడా మిత్రపక్షాలు కూడా భారత్‌తో మంచి బంధాన్ని ఏర్పరచుకోవాలి," అని జస్టిన్ ట్రూడో అన్నారు.
జూన్‌లో హర్దీప్ సింగ్ నిజ్జార్ హతమయ్యాడు. దీని వెనుక భారత ప్రభుత్వం హస్తం ఉందని సంచలన వ్యాఖ్యలు చేసి, ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశారు కెనడా ప్రధాని. ఈ వ్యవహారంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే.. ఆధారులున్నాయి, ఆధారులున్నాయి అంటున్నారు కానీ.. వాటిని ట్రూడో చూపించడం లేదు. ఈ తరుణంలో భారత్‌తో స్నేహగీతం కోసం ఆయన ప్రయత్నిస్తుండటం చర్చలకు దారి తీసింది.
ఇదీ చూడండి:- Nijjar killing: ‘భారతీయ హిందువులు కెనడా నుంచి వెళ్లిపోవాలి’- భారతీయులకు ఖలిస్తాన్ అనుకూల నేతల హెచ్చరిక
అమెరికా గురించి..
Hardeep Singh Nijjar death : భారత్‌పై తాము చేసిన ఆరోపణలకు అమెరికా మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు జస్టిన్ ట్రూడో.
"భారత్‌తో మంచి సంబంధమే కావాలి. కానీ కెనడా దేశంలో కూడా కొన్ని చట్టాలు ఉంటాయి. అసలు నిజాలు తెలిసేందుకు ఇండియా.. మాతో కలిసి పనిచేయాలి. భారత విదేశాంగమంత్రి జై శంకర్- అమెరికా విదేశాంగమంత్రి ఆంటోని బ్లింకెన్ మధ్య సమావేశం జరిగింది. మేము చేసిన ఆరోపణలను ఆ సమావేశంలో ప్రస్తావిస్తామని బ్లింకెన్ మాకు హామీనిచ్చారు," అని జస్టిన్ ట్రూడో అన్నారు.
కాగా.. గురువారం జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు జై శంకర్, బ్లింకెన్. కానీ కెనడా విషయాన్ని ఎవరు ప్రస్తావించలేదు.