తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Maharashtra Cm : మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎం వద్దనుకుంటే కేంద్రమంత్రి పదవి ఆఫర్!

Maharashtra CM : మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. ఏక్‌నాథ్ షిండే డిప్యూటీ సీఎం వద్దనుకుంటే కేంద్రమంత్రి పదవి ఆఫర్!

Anand Sai HT Telugu

27 November 2024, 13:12 IST

google News
    • Maharashtra CM News : మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించింది. అయితే తదుపరి సీఎం ఎవరు అనే విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు బీజేపీ గట్టి నిర్ణయం తీసుకుందట.
దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే
దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే

దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి పేరుపై ఉత్కంఠ కొనసాగుతొంది. దేవేంద్ర ఫడ్నవీస్ పేరుపై భారతీయ జనతా పార్టీ గట్టిగానే ఉందని, కూటమి ప్రభుత్వంలో కిందిస్థాయిలో ఉండేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. మెున్నటి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు వచ్చినందుకు పీఠంపై బీజేపీ కూర్చోవాలని చూస్తోంది.

ఈ పదవికి ఫడ్నవీస్ పేరు ఖరారు అయినట్టుగా బీజేపీ నుంచి ఏక్‌నాథ్ షిండేకి సమాచారం వచ్చిందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఏక్‌నాథ్ షిండేకు ఉపముఖ్యమంత్రి పాత్రను ఆఫర్ చేసినట్లుగా సమాచారం. దిల్లీకి షిఫ్ట్ అయ్యి కేంద్ర మంత్రివర్గంలో మంత్రి పదవిని తీసుకునే అవకాశం కూడా షిండేకి లభించిందట.

ఎన్‌సీపీ అజిత్ పవార్ ఇప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మద్దతు ఇచ్చారు. దీంతో ఏక్‌నాథ్ షిండేకు మరో ఆప్షన్ లేకుండా అయిపోయింది. ఈ వారం ప్రారంభంలో తన నివాసంలో కొత్తగా ఎన్నికైన పార్టీ శాసనసభ్యులతో జరిగిన సమావేశంలో సీఎం పదవికి ఫడ్నవీస్ పేరును పవార్ సమర్థించారు.

ఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 అసెంబ్లీ స్థానాలకు గాను మహాయుతి కూటమి 232 స్థానాలను గెలుచుకుంది. ఇందులో బీజేపీ ఒంటరిగా 132 సీట్లు గెలుచుకుంది. ఏక్‌నాథ్ షిండే శివ సేన 57 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకుంది.

అయితే ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినందున ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలనే భావన ప్రజల్లో నెలకొందని శివసేనలోని ఒక వర్గం డిమాండ్‌ చేస్తుంది. బీహార్ ఫార్ములాతో బీజేపీ ముందుకు సాగాలని పార్టీ నాయకులు అంటున్నారు. అక్కడ ఎక్కువ అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నా.. కాషాయ పార్టీ.. నితీష్ కుమార్ నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినందున కూటమి నాయకుడితో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కానీ మహారాష్ట్రలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి.

బిజెపి కీలక మిత్రపక్షమైన ఆర్‌పీఐ(ఎ) నాయకుడు రాందాస్ అథవాలే మహారాష్ట్ర తదుపరి సీఎంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఏక్‌నాథ్ షిండే కేంద్రమంత్రి వర్గంలోకి మారాలని కోరారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా సీనియర్ బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌కు మద్దతు ఇచ్చారు. 288 అసెంబ్లీ స్థానాల్లో కాషాయ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుందని చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి హక్కును కలిగి ఉందని వాదించారు.

తదుపరి వ్యాసం