Hooch tragedy: కల్తీ మద్యం తాగి 8 మంది మృతి; మృతుల సంఖ్య పెరిగే అవకాశం
16 October 2024, 20:02 IST
- కల్తీ మద్యం సేవించి ఎనిమిది మంది మృతి చెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మంగళవారం రాత్రి మద్యపాన నిషేధం అమల్లో ఉన్న బిహార్ లో చోటు చేసుకుంది.

కల్తీ మద్యం తాగి 8 మంది మృతి
బిహార్లోని సివాన్, సరన్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి ఎనిమిది మంది మృతి చెందగా, డజను మందికి పైగా ఆస్పత్రుల్లో చేరారు. సివాన్ లో ఆరుగురు, సరన్ జిల్లాలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురైన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఎక్సైజ్ సిబ్బందిపై చర్యలు
కల్తీ మద్యం బాధితుల్లో మొత్తం 15 మందిని సివాన్ లోని ఆసుపత్రికి తీసుకురాగా, వారిలో ముగ్గురిని పట్నాకు రెఫర్ చేశారు. భగవాన్ పూర్ ఎస్ హెచ్ వో, భగవాన్ పూర్ పోలీస్ స్టేషన్ ప్రొహిబిషన్ ఏఎస్ ఐలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సివాన్ జిల్లా మేజిస్ట్రేట్ ముకుల్ కుమార్ గుప్తా తెలిపారు. సరన్ లో కల్తీ మద్యం సేవించి ముగ్గురు ఆస్పత్రిలో చేరారు. ఇద్దరు మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతున్నారు.
సరన్ జిల్లాలో ఘటన
జిల్లా యంత్రాంగం బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సరన్ జిల్లాలోని ముష్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపూర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు మృతి చెందినట్లు తమకు సమాచారం అందిందని సరన్ జిల్లా కలెక్టర్ అమన్ సమీర్ తెలిపారు. పొరుగున ఉన్న సివాన్ లో ఆరుగురు మరణించగా, కేవలం నలుగురు మాత్రమే మరణించినట్లు అధికార యంత్రాంగం ధృవీకరించింది. పోలీసులు బుధవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది. మరో ఇద్దరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
కల్తీ మద్యం లక్షణాలు
మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ, కల్తీ మద్యం సేవించిన వ్యక్తులకు దృష్టి కోల్పోవడం, తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 2016 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 150 మందికి పైగా కల్తీ మద్యం సేవించి చనిపోయారని బీహార్ ప్రభుత్వం ఇటీవల అంగీకరించింది.
మద్య నిషేధం ఎత్తివేయాలి..
బీహార్ (BIHAR) లో కల్తీ మద్యం కారణంగా మరణాలు పెరుగుతుండటంతో రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ లు వెల్లువెత్తాయి. 2022లో బిహార్లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 73 మంది మృతి చెందారు. సరన్ లోని డోయిలా, యదు మోట్ గ్రామాల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. బీహార్ లో మద్య నిషేధం ఉన్నందున బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం ఇవ్వబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు.