Metro Rail news: ఉదయం 5.30 నుంచే మెట్రో రైలు సేవలు; ఆ ఒక్క రోజు మాత్రమే.. ఎందుకంటే?
06 December 2024, 15:37 IST
Metro Rail news: బెంగళూరులో మెట్రో రైలు సేవలను ఉదయం 5.30 నుంచే ప్రారంభించాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్ణయించింది. బెంగళూరులో వారాంతాల్లో మెట్రో రైళ్లు ఉదయం 7.00 గంటలకు ప్రారంభమవుతాయి. అయితే, ఇలా ముందుగా మెట్రో రైళ్లు ప్రారంభం కావడం డిసెంబర్ 8 రోజు మాత్రమేనని బీఎంఆర్సీఎల్ స్పష్టం చేసింది.
ఉదయం 5.30 నుంచే మెట్రో రైలు సేవలు
Bengaluru Metro Rail news: వచ్చే ఆదివారం, అంటే డిసెంబర్ 8వ తేదీన బెంగళూరులో మెట్రో రైలు సేవలు ఉదయం 5.30 గంటల నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బిఎంఆర్సిఎల్) శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా బెంగళూరులో మెట్రో రైళ్లు ఉదయం 7.00 గంటలకు ప్రారంభమవుతాయి.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్
డిసెంబర్ 8, ఆదివారం రోజున కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ఉన్నందున ఆ రోజు బెంగళూరులో మెట్రో సర్వీసులు ఉదయం తొందరగా, అంటే ఉదయం 5.30 గంటలకే ప్రారంభం కానున్నాయి. బెంగళూరు నగరంలో, నగర శివార్లలో పలు కేంద్రాల్లో ఈ పరీక్ష జరగనుంది. ఆ రోజు అభ్యర్థులు ట్రాఫిక్ జామ్ ల కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడం కోసం బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష అభ్యర్థులకు ప్రయాణలో ఎలాంటి సమస్య ఎదురు కాకుండా, సకాలంలో తమ పరీక్షాకేంద్రాలకు చేరుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
డెవలప్మెంట్ ఆఫీసర్ పరీక్ష
08.12.2024 (ఆదివారం) కేపీఎస్సీ-డెవలప్మెంట్ ఆఫీసర్ (పిడిఒ) పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం మాడవర, సిల్క్ ఇన్స్టిట్యూట్, చల్లఘట్ట, వైట్ ఫీల్డ్ (కడుగోడి) మెట్రో స్టేషన్ల నుండి ఉదయం 07:00 గంటలకు బదులుగా ఉదయం 05:30 గంటలకు మెట్రో రైలు (METRO) సేవలు ప్రారంభమవుతాయని బిఎంఆర్సిఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే మెజెస్టిక్ లోని నాదప్రభు కెంపేగౌడ స్టేషన్ నుంచి నాలుగు వైపులా మొదటి రైలు ఉదయం 05:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రైళ్లు తెల్లవారుజామున 30 నిమిషాల ఫ్రీక్వెన్సీతో నడుస్తాయని బీఎంఆర్సీఎల్ తెలిపింది. ‘‘ఉదయం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు 30 నిమిషాల ఫ్రీక్వెన్సీతో రైళ్లు నడుస్తాయి. ఉదయం 7.00 గంటల తర్వాత రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారమే రైళ్లు నడుస్తాయి. ప్రజలు పై సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని ఆ ప్రకటనలో కోరారు.
మెట్రో టైమింగ్స్
బెంగళూరు (bengaluru news) లో మెట్రో వారపు రోజుల్లో ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 11:00 గంటల వరకు నడుస్తుంది. రద్దీ సమయాల్లో మూడు నుండి ఐదు నిమిషాల ఫ్రీక్వెన్సీని నిర్వహిస్తుంది. సెలవులు, ప్రతి నెలా రెండవ మరియు నాల్గవ శనివారాలలో, కార్యకలాపాలు ఉదయం 7:00 గంటలకు ఎనిమిది నిమిషాల విరామంతో ప్రారంభమవుతాయి. అయితే ఐపీఎల్ (IPL) మ్యాచ్ లు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, మారథాన్ లు, ఈవెంట్స్, కీలక పరీక్షలు వంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్న రోజుల్లో మెట్రో రైలు ఆపరేషన్ టైమింగ్స్ ను పొడిగిస్తుంది. బెంగళూరు నగరంలో అత్యంత ఇష్టపడే ప్రజా రవాణా వ్యవస్థల్లో మెట్రో ఒకటి.