Bedsheet gang in Bengaluru: ఎట్టకేలకు బెంగళూరులో ‘బెడ్ షీట్ గ్యాంగ్’ ఆట కట్టించిన పోలీసులు; ఎవరీ దోపిడి ముఠా?
29 November 2024, 16:52 IST
Bengaluru Bedsheet gang: బెంగళూరులో గత కొన్ని రోజులుగా హల్చల్ చేసిన దొంగల ముఠా బెడ్ షీట్ గ్యాంగ్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. విలువైన వస్తువులు లక్ష్యంగా ఈ బెడ్ షీట్ గ్యాంగ్ గత కొన్ని రోజులుగా దొంగతనాలు చేస్తున్నారు. వీరు బిహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
ఎట్టకేలకు బెంగళూరులో ‘బెడ్ షీట్ గ్యాంగ్’ అరెస్ట్
Bedsheet gang in Bengaluru: "బెడ్ షీట్ గ్యాంగ్" గా పాపులర్ అయిన ఒక ప్రసిద్ధ దొంగల ముఠాను బెంగళూరు పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారు బెంగళూరు నగరం అంతటా కొత్త తరహాలో దొంగతనాలను పాల్పడి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.
ఇది కూడా బిహార్ గ్యాంగే..
బిహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాకు చెందిన ఈ ఎనిమిది మంది సభ్యుల ముఠా కొన్ని రోజులుగా బెంగళూరులో వరుస దోపిడీలకు పాల్పడుతూ కోట్ల రూపాయల విలువైన వస్తువులను కొల్లగొడుతోంది. దాంతో ఈ బెడ్ షీట్ గ్యాంగ్ పై బెంగళూరు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సీసీ టీవీ ఆధారాలను సేకరించి, ఎట్టకేలకు వారి ఆట కట్టించారు. 8 మంది ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
వీరే బెడ్ షీట్ గ్యాంగ్
బెడ్ షీట్ గ్యాంగ్ గా బెంగళూరులో దొంగతనాలకు పాల్పడుతున్న వారు ఇమ్మియాజ్ ఆలం (30), జావేద్ ఆలం (32), పవన్ షా (29), మునీల్ కుమార్ (30), రిజ్వాన్ దేవన్ (32), సలీం ఆలం (30), రామేశ్వర్ గిరి (40), సూరజ్ కుమార్ (34)ల దోపిడీ ముఠా అని పోలీసులు తెలిపారు. వీరు 15 రోజుల క్రితం పక్కా ప్రణాళికతో బెంగళూరుకు వచ్చారు. పగటి పూట నగరంలో సాధారణ కస్టమర్లుగా తిరుగుతూ మొబైల్ షాపులు, ఇతర టార్గెట్స్ ను గుర్తు పెట్టుకునేవారు. ఒకసారి స్టోర్ లోకి వెళ్లిన తరువాత ఆ షాప్ లేఅవుట్ ను క్షుణ్ణంగా గమనించేవారు. అత్యంత విలువైన వస్తువులను ఎక్కడ ఉన్నాయో గుర్తుంచుకునేవారు.
బెడ్ షీట్ గ్యాంగ్ అనే పేరెలా వచ్చింది?
ఆ తరువాత రాత్రి సమయంలో ఆ షాప్ లక్ష్యంగా దోపిడీకి పాల్పడేవారు. అయితే, వారు తాము దొంగతనం చేసే షాప్ ముందు, ఎవరికీ కనపడకుండా, ఎవరూ గుర్తించకుండా బెడ్ షీట్ ను అడ్డుగా పెట్టేవారు. దాంతో వారికి బెడ్ షీట్ గ్యాంగ్ అనే పేరు వచ్చింది. దుకాణం ముందు అడ్డంగా ఉంచిన బెడ్ షీట్ ను ఉపయోగించి ముఠా లోని ముగ్గురు సభ్యులు వాహనదారులు, ఇతరుల దృష్టి మళ్లించేవారు. అదే సమయంలో మిగిలిన ముఠా నిశ్శబ్దంగా షాపుల రోలింగ్ షట్టర్లను తొలగించి హై ఎండ్ మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగిలించేవారు.
శాంసంగ్ షోరూమ్ లో..
ఇటీవల నాగవర్ పల్లిలోని శాంసంగ్ షోరూంలో రూ.22 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను దొంగిలించారు. ఈ తతంగం సీసీటీవీలో రికార్డవడంతో ముఠా సభ్యులను పట్టుకోవడంలో అది కీలక సాక్ష్యంగా మారింది. చోరీల అనంతరం దొంగిలించిన వస్తువులను నేపాల్ కు తరలించి విక్రయించేవారు. ఈ ముఠా గతంలో ఉడిపి, ఉత్తర కన్నడ జిల్లాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.