Nobel Peace Prize 2024: అణుబాంబు బాధిత గ్రూప్ ‘నిహాన్ హిడాంక్యో’కు నోబెల్ శాంతి బహుమతి
11 October 2024, 15:46 IST
- Nobel Peace Prize 2024: అణ్వాయుధాలు, అణుయుద్ధాలు లేని ప్రపంచాన్ని సాధించేందుకు కృషి చేస్తున్న జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యోకు 2024 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ సంస్థ నాగసాకి అణుబాంబు దాడుల్లో ప్రాణాలతో బయటపడిన వారికి ప్రాతినిధ్యం వహిస్తోంది.
‘నిహాన్ హిడాంక్యో’కు నోబెల్ శాంతి బహుమతి
Nobel Peace Prize 2024: హిరోషిమా, నాగసాకి అణుబాంబు దాడుల్లో ప్రాణాలతో బయటపడిన వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యో (Nihon Hidankyo) కు నార్వే నోబెల్ కమిటీ 2024 సంవత్సరానికి గానూ నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించింది. అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం పోరాడుతున్న, అణుయుద్ధ బీభత్సంపై శక్తివంతమైన సాక్ష్యంగా నిలిచిన ఈ గ్రూప్ ను నోబెల్ కమిటీ అత్యున్నత శాంతి బహుమతితో సత్కరించింది.
1956 నుంచి..
1956లో ఏర్పడిన నిహాన్ హిడాంక్యో జపాన్ లో అణుబాంబు బాధితుల అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన సంస్థ. అణ్వాయుధాల వల్ల చోటు చేసుకునే విపత్కర మానవతా పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడమే ఈ సంస్థ లక్ష్యం. 1945 ఆగస్టులో అణుబాంబు దాడి వల్ల తాము అనుభవించిన వినాశనం గురించి ఈ సంస్థ సభ్యులు తమ వ్యక్తిగత అనుభవాలను, బాధలను పంచుకుంటూ ఉంటారు. హిరోషిమా, నాగసాకి అణు బాంబు దాడి నుండి ప్రాణాలతో బయటపడిన హిబాకుషాలు.. అణ్వాయుధాల వినియోగం నైతికంగా ఆమోదయోగ్యం కాదని వాదించే అంతర్జాతీయ "అణు నిషేధాన్ని" రూపొందించడంలో సహాయపడ్డారు.
అణు వినాశనానికి వ్యతిరేకంగా..
అణ్వాయుధాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన నిహాన్ హిడాంక్యో అచంచల కృషిని నోబెల్ కమిటీ ప్రశంసించింది. వారి వ్యక్తిగత అనుభవాలతో అణ్వాయుధాల వల్ల కలిగే భయంకర పర్యవసానాలపై వారు ప్రత్యేకమైన, ప్రత్యక్ష అవగాహనను అందించారని నోబెల్ కమిటీ పేర్కొంది. ‘ఊహకు అందని వినాశనాన్ని వివరించడానికి హిబాకుషా మనకు సహాయపడుతుందని కమిటీ తన ప్రకటనలో పేర్కొంది.
నేటికీ ముప్పుగానే..
బాంబు పేలుళ్లు జరిగి దాదాపు 80 ఏళ్లు గడుస్తున్నా అణ్వాయుధాలు ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తూనే ఉన్నాయి. ప్రపంచ శాంతికి పెరుగుతున్న ముప్పును గుర్తు చేస్తున్నాయి. అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్నారని, భౌగోళిక సమస్యలతో యుద్ధ భయాలు పెరుగుతున్న నేపథ్తయంలో అణ్వాయుధాల వినియోగానికి వ్యతిరేకంగా రూపొందిన నిబంధనలు ఒత్తిడికి గురవుతున్నాయని నోబెల్ కమిటీ పేర్కొంది.
కొనసాగుతున్న యుద్ధాలు
రష్యా దురాక్రమణతో ఉక్రెయిన్ లో జరిగిన యుద్ధం మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతూ భారీ ప్రాణ నష్టంతో కొనసాగుతోంది. గాజాలో 2023 అక్టోబర్లో చెలరేగిన ఘర్షణలో ఇప్పటికే 42,000 మందికి పైగా మరణించారు. సూడాన్ కూడా 17 నెలలుగా ప్రాణాంతక యుద్ధంతో కొట్టుమిట్టాడుతోంది. మానవ చరిత్రలో ఈ క్షణంలో అణ్వాయుధాలు అంటే ఏమిటో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రపంచం ఇప్పటివరకు చూసిన అత్యంత విధ్వంసకర ఆయుధాలు ఇవేనని నోబెల్ కమిటీ () అని పేర్కొంది.
అణు విధ్వంసానికి 80 ఏళ్లు
హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసి 2024 సంవత్సరానికి 80 ఏళ్లు పూర్తవుతాయి. హిబాకుషా కథలు అణు నిరాయుధీకరణ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి. అణ్వాయుధాల నిర్మూలనకు చేసిన కృషిని నోబెల్ కమిటీ గతంలో కూడా గౌరవించింది. ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిషన్ న్యూక్లియర్ వెపన్స్ 2017 లో శాంతి బహుమతిని గెలుచుకుంది. 1995 లో జోసెఫ్ రోట్బ్ లాట్, సైన్స్ అండ్ వరల్డ్ అఫైర్స్ పుగ్వాష్ కాన్ఫరెన్స్ లు "అంతర్జాతీయ రాజకీయాల్లో అణ్వాయుధాల పాత్రను తగ్గించడానికి మరియు దీర్ఘకాలికంగా, అటువంటి ఆయుధాలను తొలగించడానికి చేసిన ప్రయత్నాలకు" నోబెల్ శాంతి బహుమతి పొందాయి.
గత ఏడాది ఇరాన్ ఉద్యమకారిణికి..
మహిళల హక్కులు, ప్రజాస్వామ్యం కోసం, మరణశిక్షను వ్యతిరేకించినందుకు జైలులో ఉన్న ఇరాన్ ఉద్యమకారిణి నర్గెస్ మహమ్మదీకి గత ఏడాది బహుమతి (Nobel Peace Prize 2023) లభించింది. ఇరాన్ లో మహిళల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసిన లక్షలాది మందికి ఇది గుర్తింపు అని నోబెల్ కమిటీ పేర్కొంది. నోబెల్ బహుమతుల్లో 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్లు (1 మిలియన్ డాలర్లు) నగదు బహుమతి ఉంటుంది. స్టాక్ హోమ్ లో ఎంపిక చేసి ప్రకటించే ఇతర నోబెల్ బహుమతుల మాదిరిగా కాకుండా, ఓస్లోలో ఐదుగురు సభ్యుల నార్వేజియన్ నోబెల్ కమిటీ (Nobel Committee)నోబెల్ శాంతి బహుమతిని (Nobel Peace Prize) ప్రకటిస్తుంది. ఆర్థిక శాస్త్రాలలో బ్యాంక్ ఆఫ్ స్వీడన్ బహుమతిగా పిలువబడే ఆర్థిక బహుమతి విజేతను ప్రకటించడంతో నోబెల్ సీజన్ ముగుస్తుంది.