తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rudraprayag: రుద్రప్రయాగ్ లో ఘోర ప్రమాదం; లోయలో పడిన టెంపో; 12 మంది భక్తుల మృతి

Rudraprayag: రుద్రప్రయాగ్ లో ఘోర ప్రమాదం; లోయలో పడిన టెంపో; 12 మంది భక్తుల మృతి

HT Telugu Desk HT Telugu

Published Jun 15, 2024 03:05 PM IST

google News
  • Rudraprayag: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్ర ప్రయాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. రిషికేష్-బద్రీనాథ్ హైవేపై భక్తులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోవడంతో 12 మంది మృతి చెందారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు. వారు ఢిల్లీ ప్రాంతానికి చెందిన వారుగా భావిస్తున్నారు.

రుద్రప్రయాగ్ లో లోయలో పడిన టెంపో

రుద్రప్రయాగ్ లో లోయలో పడిన టెంపో

Rudraprayag accident: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో రిషికేష్-బద్రీనాథ్ హైవేపై టెంపో ట్రావెలర్ లోతైన లోయలో పడిపోవడంతో 12 మంది మృతి చెందారు. మరో పదిహేను మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.


మృతుల సంఖ్య పెరిగే అవకాశం

ఈ ప్రమాదం లో 12 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) కమాండెంట్ మణికాంత్ మిశ్రా తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని, వాహనంలో ఎంత మంది ప్రయాణిస్తున్నారో కూడా ఇప్పుడే చెప్పలేమని మిశ్రా తెలిపారు. లోయలో పడిపోయిన తరువాత, అక్కడి నదీ ప్రవాహంలో కొందరు భక్తులు కొట్టుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ‘‘వాహనంలో ప్రయాణిస్తున్న ఎవరైనా నీటిలో కొట్టుకుపోయారో లేదో చెప్పలేం. సాధ్యాసాధ్యాలను నిర్ధారించడానికి గజ ఈతగాళ్ల బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించాం’’ అన్నారు.

ఢిల్లీ ప్రాంతానికి చెందినవారు..

మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, ప్రయాణికులు ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన వారేనని మాత్రమే తమకు తెలిసిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చార్ ధామ్ యాత్ర (chardham yatra)లో భాగంగా వారు టెంపో ట్రావెలర్ వాహనంలో ప్రయాణిస్తున్నారని సమాచారం. ప్రమాద సమాచారం తెలియగానే, స్థానిక యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించాలని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ ను కోరినట్లు ధామి తెలిపారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.