Indians in America : ట్రంప్ అధికారంలోకి వస్తే.. వేల సంఖ్యలో భారతీయులు ఇంటికే!
14 December 2024, 9:59 IST
Donald Trump immigration policies : అమెరికాలో దాదాపు 18వేల మంది అన్‌డాక్యుమెంటెడ్ భారతీయులు ఉన్నారని ఓ నివేదిక పేర్కొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో వీరు కొనసాగడం కష్టమేనని నివేదిక పేర్కొంది.
కఠిన ఇమ్మిగ్రేషన్ నిబంధలతో ట్రంప్ రెడీ!
డొనాల్డ్ ట్రంప్ మరోమారు అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో ఆయన మద్దతుదారులు, రిపబ్లికెన్ పార్టీ సభ్యులు సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ అమెరికాలో చదువుకుంటున్న, లేదా అగ్రరాజ్యానికి వలసవెళ్లిన ఇతర దేశాల ప్రజలు మాత్రం భయపడుతున్నారు! ఇమ్మిగ్రేషన్‌పై అత్యంత కఠినంగా వ్యవహరించే స్వభావం ట్రంప్‌నకు ఉండటం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. వచ్చే నెలలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం, వేల సంఖ్యలో భారతీయులు అమెరికాను విడిచిపెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చు!
వేల సంఖ్యలో భారతీయులు ఇళ్లకే..!
జనవరిలో అధికారంలోకి రానున్న ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలను అమలు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే అమెరికా నుంచి బహిష్కరణను ఎదుర్కొంటున్న 1.45 మిలియన్ల మందిలో దాదాపు 18,000 మంది భారతీయులు ఉన్నారని, వీరందరికి సరైన డాక్యుమెంట్లు లేవని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మంట్ (ఐసీఈ) వెల్లడించింది. "అన్‌డాక్యుమెంటెడ్ ఇమ్మిగ్రెంట్స్‌ని బహిష్కరించడం ట్రంప్ సరిహద్దు భద్రతా ఎజెండాలో ప్రధానమైనది," అని ఐసీఈ వెల్లడించింది.
నవంబర్ 2024లో ప్రచురించిన ఐసీఈ డేటా ప్రకారం 17,940 మంది భారతీయులు ఏజెన్సీ నాన్-డీటైన్డ్ డాకెట్‌లో జాబితా ఉన్నారు. ఐసీఈ కస్టడీలో లేకుండా, డిపోర్టేషన్ కోసం ఎదురుచూస్తున్న వారు కూడా ఇందులో ఉన్నారు. చాలా మంది డాక్యుమెంట్లు లేని భారతీయులు సంక్లిష్టమైన, సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియలో చిక్కుకున్నారు. కొంతమంది తమ కేసుల విచారణ కోసం మూడు సంవత్సరాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆసియాలో 13వ స్థానం..
అమెరికాలో నివాసముంటున్న అన్-డాక్యుమెంటెడ్ ఏషియన్ ఇమ్మిగ్రెంట్స్‌లో భారత్ 13వ స్థానంలో ఉందని యూఎస్ తెలిపింది. బహిష్కరణ ప్రక్రియలో సహకరించని 15 దేశాల్లో భారత్ కూడా ఒకటని నివేదిక పేర్కొంది. ఇప్పుడు సరైన చర్యలు తీసుకోవాలని తేల్చిచెబుతోంది. "ఇంటర్వ్యూలు నిర్వహించడం, సకాలంలో ప్రయాణ పత్రాలను జారీ చేయడం, ఐసీఈ లేదా విదేశీ ప్రభుత్వ తొలగింపు మార్గదర్శకాలకు అనుగుణంగా షెడ్యూల్ చేసిన వాణిజ్య లేదా చార్టర్ విమానాల ద్వారా వారి పౌరుల భౌతిక తిరిగి రావడానికి అంగీకరించడం," వంటి చర్యలు తీసుకోవాలని ఐసీఈ ఉదహరించింది.
గత మూడేళ్లలో దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 90 వేల మంది భారతీయులను అమెరికా సరిహద్దులో అరెస్టు చేశారు. ఈ వలసదారుల్లో సింహభాగం పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి భారత రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.
అమెరికాలో డాక్యుమెంట్లు లేని వలసదారుల్లో ఎక్కువ మంది సరిహద్దులకు దగ్గరగా ఉన్న దేశాలకు చెందినవారని ఐసీఈ నివేదిక నొక్కి చెప్పింది. 2,61,000 మంది డాక్యుమెంట్లు లేని వ్యక్తులతో హోండురాస్ అగ్రస్థానంలో ఉండగా, 2,53,000 మందితో గ్వాటెమాలా రెండో స్థానంలో ఉంది.
ఆసియాలో 37,908 మంది అక్రమ వలసదారులతో చైనా అగ్రస్థానంలో ఉండగా, 17,940 మందితో భారత్ 13వ స్థానంలో ఉంది.