Phone Call Anxiety। ఆ సమయంలో మీ ఫోన్ రింగ్ అవుతుంటే భయాందోళనకు గురవుతున్నారా? కారణం ఇదే!
12 July 2023, 10:03 IST
- Phone Call Anxiety: ఫోన్ కాల్ ఆందోళన అనేది కొన్ని పరిస్థితుల గురించి మనం అతిగా ఆలోచిస్తున్నప్పుడు భయాన్ని అనుభవించే పరిస్థితి. దీని గురించి థెరపిస్టులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి.
Phone Call Anxiety
Phone Call Anxiety: మీరెప్పుడైనా మీ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు భయాందోళనలకు గురవుతున్నారా? దీనినే ఫోన్ కాల్ యాంగ్జైటీ లేదా టెలిఫోబియా (telephobia) అంటారు. ఇదొక మానసిక పరిస్థితి, ఈ రకమైన ఆందోళన ఉన్నప్పుడు మీ ఫోన్ రింగ్ అవుతుందంటే లోపల భయం అనేది కలుగుతుంది. ఆ కాల్‌ని స్వీకరించాలా? వద్దా అనే సందిగ్ధ పరిస్థితిలో ఉంటారు. చాలా సేపటి వరకు అసలు ఆ ఫోన్ స్వీకరించరు, ఆ వరుసగా రింగ్ అవుతూనే ఉంటే, ఏమయి ఉంటుందోనని ఆందోళన మరింత పెరుగుతుంది. కొన్నిసార్లు ఫోన్ ఒకసారి రింగ్ అయి డిస్‌కనెక్ట్ అయినపుడు కూడా భయాందోళనకు గురవుతారు. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? దీని గురించి థెరపిస్టులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకోండి.
ఫోన్ కాల్ ఆందోళన అనేది కొన్ని పరిస్థితుల గురించి మనం అతిగా ఆలోచిస్తున్నప్పుడు, ఆందోళన చెందుతున్నప్పుడు భయాన్ని అనుభవించే పరిస్థితి. అతిగా ఆలోచించడం అనేది భయాందోళనలకు ప్రధాన సంకేతం. అటువంటి సందర్భాల్లో మీకు ఏ ఫోన్ వచ్చినా, అది వారికి చెందినదేనేమోనన్న భయం మొదలవుతుంది. ఈ పరిస్థితిలో ఫోన్ రింగ్ అవుతుంటే భయపడతాం, ఆ ఫోన్ స్వీకరించకుండా స్విచ్ ఆఫ్ చేయడమో చేసి ఆ క్షణంలో ప్రమాదాన్ని తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఎటువంటి పరిస్థితులు ఈ ఫోన్ కాల్ ఆందోళనకు దారితీస్తాయో కూడా నిపుణులు తెలిపారు, కొన్ని ఉదాహరణలు ఇప్పుడు చెప్పుకుందాం.
మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నప్పుడు
ఏదైనా వ్యవహారంలో మీకు బెదిరింపులు వస్తుంటే మీరు దాని గురించే ఆందోళన చెందుతుంటారు. ఇలాంటపుడు మీ ఫోన్ రింగ్ అవుతుంటే భయపడతారు, అది తెలియని నెంబర్ అయితే మరింత భయాందోళనకు గురవుతారు.
మీరు ఏదైనా తప్పు చేసినట్లు భావిస్తున్నప్పుడు
మీరు ఏదైనా తప్పు చేసినట్లు భావిస్తున్నప్పుడు, అపరాధభావంతో ఉన్నప్పుడు మీకు వచ్చే ఫోన్ కాల్స్ స్వీకరించాలంటే భయాందోళనలకు గురవుతారు.
చాలా కాలం తర్వాత ఫోన్ రావడం
మీకు ముఖ్యమైన వ్యక్తుల నుంచి చాలా కాలం తర్వాత ఫోన్ రావడం లేదా అసాధారణ సమయంలో ఫోన్ రింగ్ అవుతుంటే ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా చెడు వార్త వింటామేమో అన్న ఆందోళన మొదలవుతుంది.
మీరు మాట్లాడటానికి సిద్ధంగా లేనపుడు
మీరు ఎవరితో అయినా మాట్లాడటానికి సిద్ధంగా లేనపుడు లేదా వారితో మాట్లాడటానికి ఇబ్బందిగా ఉంటే వారి ఫోన్ కాల్ స్వీకరించరు, మళ్లీ చేస్తే ఆందోళనకు గురవుతారు.
ఇబ్బందికరమైన నిశ్శబ్దం
ఫోన్ కాల్ స్వీకరించాక, వారి నుంచి ఎలాంటి పలకరింపు లేకుండా నిశబ్దంగా ఉన్నప్పుడు. కాల్‌ని డిస్‌కనెక్ట్ చేసి, సంభాషణను మళ్లీ కొనసాగించాలంటే ఆందోళన ఉంటుంది.
ఇలా చాలా అంశాలు మీకు ఫోన్ కాల్ ఆందోళన కలిగించేందుకు కారణం అవుతాయి. అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం, ఇతర పద్ధతుల ద్వారా ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవచ్చు.