Love: ఈ సంకేతాలతో మీకు కాబోయే జీవిత భాగస్వామిపై మీరు ఓ క్లారిటీకి రావొచ్చు!
13 October 2024, 14:00 IST
Love and Relationships: ప్రేమలో ఉన్నప్పుడు మీ లవర్ మాట్లాడే మాటల్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మిమ్మల్ని కాబోయే జీవిత భాగస్వామిగా చూస్తున్నారో లేదో మీకు దాదాపుగా అర్థమైపోతుంది.
![లవ్ లవ్](https://images.hindustantimes.com/telugu/img/2024/10/12/550x309/Love_and_Relationships_1728751523937_1728751524056.jpg)
లవ్
ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీటలు ఎక్కాలని లేదు. చాలా ప్రేమ జంటలు మధ్యలోనే విడిపోతుంటాయి. అయితే.. మీ లవర్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా? లేదా? అనేది ఈ సంకేతాల్ని గమనిస్తే మీకే ఓ క్లారిటీ వస్తుంది. మరీ ముఖ్యంగా అబ్బాయిలు తమ ప్రేయసి విషయంలో ప్రవర్తించే తీరుతో సులువుగా అంచనా వేయవచ్చని మానసిక నిపుణులు చెప్తున్నారు.
అమ్మాయిలు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అంశాలు
మీ లవర్ మిమ్మల్ని కాబోయే భార్యగా చూస్తున్నాడో లేదో తెలుసుకోవడం ద్వారా మీ గురించి ఎంత సీరియస్‌గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. పొగడటం, హావభావాల్ని ప్రదర్శించే అంశాల్ని ఇక్కడ పరిగణించకూడదు. ప్రేమలో అతని నిబద్ధత, మీకు ఇచ్చే గౌరవం సంకేతాల్ని పరిశీలించాలి.
భవిష్యత్తు గురించి అతను ఎలా మాట్లాడుతున్నాడు? మీతో క్రమం తప్పకుండా ఎలా వ్యవహరిస్తున్నాడో చూడటం ద్వారా మీ బంధం దీర్ఘకాలికంగా, అర్థవంతంగా ఉండే అవకాశం ఉందా లేదా అనేది మీరు బాగా అర్థం చేసుకోవచ్చు.
అతని స్నేహితులు,కుటుంబ సభ్యులతో మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాడా లేదా వెటకారం చేస్తున్నాడా అనేది పరిశీలించాలి. అతను మిమ్మల్ని వారికి చూపిస్తూ బహిరంగంగా తరచూ పాజిటివ్‌గా మాట్లాడితే భవిష్యత్తులో మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని సంకేతం.
నా… నా.. పదం వాడుతుంటే
మీతో మాట్లాడేటప్పుడు తరచూ ‘నా’కంటే ‘మనం’అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాడంటే అతను మిమ్మల్ని భాగస్వామిగా చేసుకోవడానికి మానసికంగా సిద్ధమయ్యాడని అర్థం. ఒకవేళ తరచూ నా.. నా.. అంటున్నాడంటే మీరు పునరాలోచించాల్సిందే.
మీ పట్ల అతను చూపే కేర్‌ను మీ కంటే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎక్కువగా గమనిస్తారు. కాబట్టి.. వాళ్లు తరచూ అతను మిమ్మల్ని స్పెషల్‌గా చూస్తున్నాడని మాటల సందర్భంలో ప్రస్తావిస్తుంటే మీరు తాపీగా ఉండొచ్చు.
టఫ్ టైమ్‌లో నిలబడితే
మీకు క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు పారిపోకుండా మీకు అండగా నిలబడితే అతడ్ని మీరు నమ్మవచ్చు. భవిష్యత్తులోనూ మీకు అండగా నిలబడగలడని అది సంకేతం. ఒకవేళ మీరు సమస్యలో ఉన్నా తెలిసి కూడా అతను పట్టించుకోకుండా దూరంగా ఉన్నాడంటే మీరు అతనితో భవిష్యత్తు గురించి మరోసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది.
అతను వేరే అమ్మాయిలతో ప్రేమ, ఇతర వ్యవహారాలను నడిపించకుండా ఉంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా భాగస్వామి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు తెలియకుండా వ్యవహారాలను నడుపుతుంటే మాత్రం పునరాలోచించుకోవాలి.
కేవలం ఈ సంకేతాల ఆధారంగానే కాకుండా.. మీ భాగస్వామిపై ఓ కన్నేసి ఉంచండి. అతనిలో ఏవైనా మీకు తేడాగా అనిపిస్తే మీ ఆప్తులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోండి.