తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Women's Rights: మన దేశంలోని ప్రతి స్త్రీ వారి రక్షణ కోసం తెలుసుకోవాల్సిన అయిదు చట్టాలు, హక్కులు ఇవే

Women's rights: మన దేశంలోని ప్రతి స్త్రీ వారి రక్షణ కోసం తెలుసుకోవాల్సిన అయిదు చట్టాలు, హక్కులు ఇవే

Haritha Chappa HT Telugu

25 October 2024, 16:30 IST

google News
    • Women's rights: మనదేశంలో మహిళల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. కానీ వీటిపై అవగాహన ఉన్న మహిళలు చాలా తక్కువ. భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఐదు చట్టాలు ఇదిగో.
మహిళలు తెలుసుకోవాల్సిన హక్కులు, చట్టాలు
మహిళలు తెలుసుకోవాల్సిన హక్కులు, చట్టాలు (Pixabay)

మహిళలు తెలుసుకోవాల్సిన హక్కులు, చట్టాలు

మనదేశంలో విభిన్న సాంప్రదాయాలు, సామాజిక పరిస్థితులు ఉన్నాయి. నిజానికి మన దేశం సమానత్వం, న్యాయం పై నిలిచి నడవాలని ఆకాక్షించే దేశం. ముఖ్యంగా మహిళలు ముందంజలో ఉండాలని ఎన్నో అవకాశాలను ఇస్తున్న దేశం. సమాజంలో స్త్రీలది ముఖ్యపాత్ర. సమాజం అభివృద్ధి చెందాలంటే స్త్రీ కూడా అభివృద్ధి చెందాల్సిందే. ప్రతి స్త్రీ ఉపాధి, వ్యక్తిగత భద్రత, గృహ జీవితం వంటి విషయాలలో మన దేశం కల్పిస్తున్న హక్కులను తెలుసుకోవాలి. అవసరమైనప్పుడు చట్టాల ద్వారా ఆ హక్కులను కాపాడుకోవాలి. ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన హక్కులను ఇక్కడ ఇచ్చాము.

సమాన వేతనం పొందే హక్కు

భారతదేశంలో ఆడా, మగకు సమాన వేతనం పొందే హక్కు ఉంది. సమాన వేతన చట్టం 1976 ప్రకారం పురుషులు, స్త్రీలకు సమానంగా వేతనం అందాలని ఈ చట్టం నిర్ధారిస్తోంది. రిక్రూట్మెంట్, ప్రమోషన్లలో కూడా వివక్షను చూపించకూడదని చెబుతోంది. ఉద్యోగ నిర్ణయాల్లో లింగం అనేది ప్రధాన పాత్ర పోషించదని ఈ చట్టం హామీ ఇస్తోంది. మహిళల సాధికారతను కల్పించడంలో ఆర్థిక స్వాతంత్రాన్ని అందించడంలో సమాన వేతనం ముఖ్యమైనదని ఈ చట్టం చెబుతోంది.

ప్రసూతి సెలవు హక్కు

మహిళల జీవితంలో అతి ముఖ్యమైన దశ గర్భధారణ. ఈ చట్టం ప్రకారం మహిళలు 26 వారాల వరకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు పొందేందుకు అర్హులు. మెటర్నిటీ బెనిఫిట్ చట్టం 1961 ప్రకారం తల్లీ బిడ్డ ఆరోగ్యం కోసం 6 నెలల పాటు జీతంతో కూడిన సెలవును అందిస్తారు. మహిళలు తమ కెరీర్, కుటుంబం... రెండింటినీ కాపాడుకోవడానికి ఈ చట్టం రూపొందించారు.

పనిచేసే చోట వేధింపులు

పని ప్రదేశంలో మహిళలు లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించారు. దీన్ని PoSH చట్టం అని పిలుస్తారు. ఉద్యోగస్థలాల్లో మహిళలను వేధింపుల నుండి కాపాడి వారికి రక్షణ కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. మీకు అలాంటి పరిస్థితులు ఎదురైతే ఈ చట్టం ప్రకారం ఎవరిపైనైనా కేసు పెట్టవచ్చు.

గృహ హింస

భారతదేశంలో మహిళలకు కోసం తయారుచేసిన అత్యంత ముఖ్యమైన చట్టాల్లో గృహహింస నుండి కాపాడే చట్టం ఒకటి. దీన్ని 2005లో రూపొందించారు. ఈ చట్టం ప్రకారం స్త్రీలు వారి ఇళ్లల్లో, ఉద్యోగ స్థలాల్లో శారీరక, భావోద్వేగ, లైంగిక, ఆర్థిక వేధింపులకు గురికాకుండా కాపాడుతుంది. ఈ చట్టం ప్రకారం కుటుంబ సభ్యులపై కూడా కేసు పెట్టవచ్చు. వారి నుంచి కూడా రక్షణ కోరవచ్చు. ఈ చట్టంలోని నేరస్తులకు నాన్ బెయిలబుల్ జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.

ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు

లైంగిక వేధింపులు, గృహహింస వంటి కేసుల్లో మహిళలు పోరాడాలంటే మహిళలకు ఆర్థిక భరోసా అవసరం. అందుకే వారికి ఉచితంగా న్యాయ సహాయం అందేలా లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ను అమల్లోకి తీసుకొచ్చారు. ఇది వారి ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా తగిన సహాయాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు ఉచితంగానే వీరి తరపున లాయర్లు వాదిస్తారు. మరికొందరు చాలా తక్కువ మొత్తంలోనే ఫీజును తీసుకుంటారు. దీని వల్ల పేద మహిళలు కూడా ఈ చట్టాలను వినియోగించుకోగలరని నమ్మకం రాజ్యాంగానికి ఉంది.

భారతదేశంలో నివసిస్తున్న ప్రతి స్త్రీ పైన చెప్పిన ఐదు చట్టాలను అర్థం చేసుకోవాలి. తమ జీవితంలో ఈ ఐదు చట్టాల భరోసాతో ధైర్యంగా జీవించాలి. అవసరమైనప్పుడు ఈ చట్టాలను ఉపయోగించుకోవాలి.

తదుపరి వ్యాసం