తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Senagapappu Kobbari Kura: శనగపప్పు కొబ్బరికోరు వేపుడు ఇలా చేస్తే తినేయాలనిపిస్తుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు

SenagaPappu Kobbari kura: శనగపప్పు కొబ్బరికోరు వేపుడు ఇలా చేస్తే తినేయాలనిపిస్తుంది, పిల్లలు చాలా ఇష్టపడతారు

Haritha Chappa HT Telugu

20 August 2024, 17:30 IST

google News
    • SenagaPappu Kobbari kura: ఆంధ్రా, తమిళనాడులో శనగపప్పు కొబ్బరికోరు కలిపి చేసే కూర ఎంతో మందికి ఫేవరెట్. తమిళనాడులో దీన్ని కదలై పారుప్పు సుండాల్ అని పిలుస్తారు. దీని రెసిపీ చాలా సులువు.
శెనగపప్పు కొబ్బరి తురుపు వేపుడు
శెనగపప్పు కొబ్బరి తురుపు వేపుడు

శెనగపప్పు కొబ్బరి తురుపు వేపుడు

SenagaPappu Kobbari kura: శనగపప్పు కొబ్బరికోరు వేపుడు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. దీన్ని అన్నంలోనే కాదు, స్నాక్స్‌లాగా తిన్నా టేస్టీగా ఉంటుంది. కాస్త స్పైసీగా చేసుకుంటే పెద్దలకు బాగా నచ్చుతుంది. కారం తగ్గిస్తే పిల్లలు దీన్ని ఇష్టంగా తింటారు. తమిళనాడు, ఆంధ్రాలో ఎక్కువగా ఈ వంటకాన్ని వండుతూ ఉంటారు. తమిళనాడులో దీన్ని కదలై పారుప్పు సుండాల్ అని పిలిస్తే, ఆంధ్రాలో శనగపప్పు కొబ్బరి కూరగా పిలుస్తారు. దీన్ని చేయడం చాలా సులువు. కొమ్ము శనగలను ఉడకబెట్టి తాలింపు వేసుకొని స్నాక్స్‌లా తిన్నట్టే... ఈ కూరను కూడా లాగించేయొచ్చు. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.

శనగపప్పు కొబ్బరికోరు ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు

శనగపప్పు - అర కప్పు

పచ్చి కొబ్బరి తురుము - మూడు స్పూన్లు

ఆవాలు - అర స్పూను

మినప్పప్పు - ఒక స్పూను

ఎండుమిర్చి - రెండు

ఇంగువ - చిటికెడు

కరివేపాకులు - గుప్పెడు

నూనె - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నీరు - సరిపడినన్ని

శనగపప్పు కొబ్బరికోరు ఫ్రై రెసిపీ

1. ముందుగా శనగపప్పును శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టాలి.

2. ఓ గంటసేపు నానిన తర్వాత కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి.

3. తర్వాత పప్పును వడకట్టి నీటిని ఒంపేసి ఒక పళ్లెంలో పప్పును ఆరబెట్టుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. ఆ నూనెలో ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకులు, చిటికెడు ఇంగువ వేసి వేయించుకోవాలి.

6. చిన్న మంట మీద పెట్టి ముందుగా ఉడకబెట్టిన శనగపప్పును అందులో వేసి కలుపుకోవాలి.

7. రుచికి సరిపడా ఉప్పును కూడా చల్లుకోవాలి.

8. అలాగే కొబ్బరి తురుమును కూడా వేసి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీగా శనగపప్పు కొబ్బరికోరు వేపుడు రెడీ అయినట్టే.

దీన్ని అల్పాహారంగా కూడా తినవచ్చు. కాకపోతే శనగపప్పు అధికంగా ఉంటుంది, కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. దీన్ని నవరాత్రుల్లో నైవేద్యంగా కూడా ఉపయోగిస్తారు. ఒక్కసారి తిని చూడండి. మీరు దీనికి అభిమాని అయిపోవడం గ్యారెంటీ.

ఇందులో వాడిన శనగపప్పు, కొబ్బరి తురుము రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. దీనిలో పచ్చి కొబ్బరి తురుమును వాడాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఎండు కొబ్బరి తురుమును వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పచ్చికొబ్బరిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. ఐరన్, పొటాషియం, జింక్, మెగ్నీషియం లభిస్తాయి. అలాగే బి విటమిన్లు కూడా దీనిలో అధికంగా ఉంటాయి. కాబట్టి పచ్చి కొబ్బరి వేసిన ఆహారాలను తింటే జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇది మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

శనగపప్పు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్తహీనత సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి ఒకసారి ఈ రెసిపీ చేసి పిల్లలకు పెట్టి చూడండి. వారికి నచ్చడం ఖాయం. పెద్దలకు కూడా కాస్త స్పైసీగా చేస్తే ఇది రుచిగా అనిపిస్తుంది.

తదుపరి వ్యాసం