తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sankranti Recipes: సంక్రాంతి పండుగకి సకినాలు, అరిసెలు ఇలా సింపుల్ గా చేసేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది

Sankranti recipes: సంక్రాంతి పండుగకి సకినాలు, అరిసెలు ఇలా సింపుల్ గా చేసేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది

Gunti Soundarya HT Telugu

11 January 2024, 19:27 IST

google News
    • Sankranti recipes: సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఇంట్లో ఖచ్చితంగా సకినాలు, అరిసెలు చేసుకుని తీరాల్సిందే. ఎక్కువ శ్రమ లేకుండా సింపుల్ గా ఇలా చేసేసుకోండి. 
అరిసెలు, సకినాలు
అరిసెలు, సకినాలు (shravani kitchen(youtube))

అరిసెలు, సకినాలు

Sankranti recipes: తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఇంటి ముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలు, ఘుమఘుమలాడే పిండివంటలు, ఇంటి నిండా బంధువులు, తోబుట్టువులతో సందడి వాతావరణం నెలకొంటుంది. పండుగ సందర్భంగా రుచికరమైన పిండి వంటలు చేసుకుని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. అరిసెలు, జంతికలు, లడ్డూలు, చెక్కలు వంటి వాటిని చేసుకుని తింటారు.

సంక్రాంతి పండుగ అంటే తెలంగాణలో తప్పనిసరిగా చేసుకునే పిండి వంటకం సకినాలు. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే సకినాలు అంటే చాలా మందికి ఇష్టం. ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్ గా సకినాలు చేసుకోవచ్చు. దీనికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. కేవలం నాలుగైదు పదార్థాలతో టేస్టీ, క్రంచీగా ఉండే సకినాలు ఇలా చేసేసుకోండి.

కావలసిన పదార్థాలు..

బియ్యం

ఉప్పు

వాము

జీలకర్ర

నువ్వులు

తయారీ విధానం

కేజీ బియ్యం తీసుకుని వాటిని నీటితో బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత తడి బియ్యం ఏదైనా వస్త్రం మీద ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత బియ్యం మెత్తగా పొడి చేసుకోవాలి. నూక లేకుండా జల్లెడ పట్టుకుని పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అందులో కిలో పిండికి 100 గ్రాముల నువ్వులు, కొద్దిగా వామ్ము లేదంటే జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీటిని పోసుకుంటూ పిండిని మరీ పలచగా కలుపుకోకూడదు. కొద్దిగా చపాతీ పిండి మాదిరిగా కలిపి కాసేపు మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.

ఏదైనా కాటన్ వస్త్రం తీసుకుని దానికి రంధ్రం పెట్టుకుని అందులోకి పిండి వేసుకోవాలి. సకినాల ఆకారంలో పిండిని ఒత్తుకోవాలి. ఇక స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసుకుని బాగా మరిగించుకోవాలి. నూనె మరిగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న సకినాలు అందులో వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా రుచికరమైన సకినాలు రెడీ అయిపోతాయి. మీరు గుండ్రంగా వద్దని అనుకుంటే ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంలో సకినాలు చేసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో వేసే వామ్ము అజీర్తి సమస్యల్ని నయం చేస్తుంది. ఇందులో వేసే నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది.

సకినాలతో పాటు అరిసెలు కూడా తప్పనిసరిగా చేసుకుంటారు. పాకం సరిగ్గా పట్టుకున్నారంటే చాలు ఎంతో మెత్తగా టేస్టీగా ఉండే అరిసెలు రెడీ అయిపోతాయి. ఇవి కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ కూడా ఉండదు.

కావాల్సిన పదార్థాలు

బియ్యం

బెల్లం

నెయ్యి

యాలకుల పొడి

వేయించుకోవడానికి సరిపడా నూనె

నువ్వులు

తయారీ విధానం

ముందుగా బియ్యం బాగా నానబెట్టుకోవాలి. కొంతమంది అయితే రోట్లో బియ్యం వేసుకుని దంచుకుంటారు. ఈరోజుల్లో దంచే ఓపిక ఎవరికీ ఉండకపోవడంతో మర వేయించుకుంటున్నారు. పిండి జల్లెడ పట్టుకుని నూక లేకుండా చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పట్టుకుని అందులో నీరు పోసుకుని బెల్లం మెత్తగా చేసుకుని అందులో వేసుకోవాలి. పాకం వచ్చే వరకు పట్టుకోవాలి. పాకం కుదిరిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి.

ఒక చిన్న ప్లేట్ లో నీరు తీసుకుని అందులో కొద్దిగా బెల్లం పాకం వేసుకుని ముద్దగా అవుతుందో లేదో చూసుకోవాలి. బాగా మెత్తగా కాకుండా ఒక మాదిరిగా పాకం అయిన తర్వాత దాన్ని నీటిలో వేసి చెక్ చేసుకోవాలి. పాకం కుదిరిందని అనుకున్న తర్వాత అందులో కొద్ది కొద్దిగా పిండి వేసుకుని ఉండలు కట్టకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. పిండితో పాటే కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇష్టమైన వాళ్ళు అందులో సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేయించుకుని కూడా కలుపుకుంటారు.

అరిసె చేసుకునేందుకు వీలుగా ఉండే విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకుని ఒత్తుకోవాలి. అవి చేసుకునేటప్పుడు నువ్వులు వేసుకుని రెండు వైపులా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇక స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి బాగా మరిగించుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అరిసెలు అందులో వేసుకుని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. తీసే ముందు నూనె లేకుండా ఒత్తుకుని తీసుకోవాలి. అంతే సింపుల్ గా అయిపోయే అరిసెలు మీరు ట్రై చేసి చూడండి. నెయ్యి వేయడం వల్ల అరిసెలు కూడా చాలా మెత్తగా ఉంటాయి.

తదుపరి వ్యాసం