Cancer : పేదలకంటే డబ్బు ఉన్నవాళ్లకే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ.. షాకింగ్ అధ్యయనం
04 June 2024, 15:30 IST
- Cancer Risk In Rich People : పేదవారికే రోగాలు ఎక్కువ అనే మాట ఎప్పుడూ వింటుంటాం. కానీ డబ్బు ఉన్నవారికే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ అని ఓ అధ్యయనం వెల్లడించింది. ఈ షాకింగ్ స్టడీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..
డబ్బు ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం
ఎక్కువ డబ్బు ఉన్నవారి కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు వ్యాధుల బారిన పడతారనే మాట ఎక్కువగా ప్రచారంలో ఉంది. అయితే మంచి ఆర్థిక స్థితి కలిగిన వ్యక్తులలో కొన్ని రకాల క్యాన్సర్లు తరచుగా నిర్ధారణ అవుతాయని ఓ అధ్యయనం చెబుతుంది. ఇటీవల ఫిన్లాండ్‌లోని హెల్సింకి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక కొత్త అధ్యయనం సామాజిక-ఆర్థిక స్థితి, అనేక రకాల వ్యాధుల మధ్య సంబందాన్ని చెప్పింది.
షాకింగ్ అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్. క్యాన్సర్‌కు దోహదపడే కారకాలు జన్యుశాస్త్రం, వృద్ధాప్యం, జీవన వాతావరణం, పొగాకు, మద్యపానం, మరిన్ని ఉంటాయి. అంతేకాకుండా సంపన్నుల కంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని కూడా నమ్ముతారు. కానీ పేద ప్రజలతో పోలిస్తే సంపన్నులకు జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.
క్యాన్సర్ వచ్చే అవకాశాలు
పేదవారి కంటే సంపన్నులకే జన్యుపరంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ధనవంతులు రొమ్ము, ప్రోస్టేట్, ఇతర రకాల క్యాన్సర్‌లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనంలో తెలిపింది. డబ్బు తక్కువగా ఉన్నవారు.. డిప్రెషన్, ఆల్కహాలిజం, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు మధుమేహం, ఆర్థరైటిస్ వచ్చే అవకాశం జన్యుపరంగా ఎక్కువ ఉందని స్టడీ చెబుతుంది. ముఖ్యంగా ఈ అధ్యయనం అత్యధికంగా సంపాదిస్తున్న దేశాలల్లో 19 రకాల వ్యాధులలో లింక్ చేసి చేశారు.
పాలీజెనిక్ స్కోర్
వ్యాధి రిస్క్‌పై పాలీజెనిక్ స్కోర్‌ల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది జన్యు అంచనా పద్ధతి ద్వారా లెక్కిస్తారు. ఉదాహరణకు భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన స్క్రీనింగ్ ప్రోటోకాల్‌లను డబ్బు ఉన్నవారు స్వీకరించవచ్చు. దీని ద్వారా వారి ఆరోగ్య పరిస్థితి తెలిసిపోతుంది. అయితే ఈ సందర్భంలో జన్యుపరంగా డబ్బు ఉన్నవారిలోనే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనంలో కనుగొన్నారు.
డబ్బు ఉన్నవారిలో క్యాన్సర్
అధ్యయనం కోసం పరిశోధనా బృందం 35 నుండి 80 సంవత్సరాల వయస్సు గల 2,80,000 పౌరులను ఎంపిక చేసింది. వారి ఆరోగ్య డేటా, వారి సామాజిక-ఆర్థిక స్థితి, జన్యుసంబంధాన్ని సేకరించింది. దీని ద్వారా డబ్బు ఉన్నవారిలో క్యాన్సర్ వచ్చిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు.
జన్యు ప్రభావం
మన జన్యు సమాచారం జీవితకాలంలో మారదు. అయితే వయస్సు లేదా మన పరిస్థితులు మారినప్పుడు వ్యాధి ప్రమాదంపై జన్యు ప్రభావం మారుతుందని పరిశోధనలో పాల్గొన్న నిపుణులు చెప్పారు. ఎందుకంటే తర్వాత లైఫ్ స్టైల్ మారుతుంది. దీని ప్రభావం ఆరోగ్యంపై చూపిస్తుంది. నిర్దిష్ట వృత్తులు, వ్యాధి ప్రమాదాల మధ్య సంబంధాలను అర్థం చేసుకోవడానికి పరిశోధకులు ఇప్పుడు మరో అధ్యయనం చేస్తున్నారు.
పరిశోధకులలో ఒకరైన డాక్టర్ హగెన్‌బీక్ ప్రకారం వ్యాధి ప్రమాదంపై పాలీజెనిక్ స్కోర్‌ల ప్రభావం సందర్భంపై ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇది జన్యువుల ద్వారా వచ్చే వ్యాధిని అంచనా వేస్తుంది. ఆమె మాట్లాడుతూ.. అధిక జన్యుపరమైన ప్రమాదం ఉన్న స్త్రీలు, ఉన్నత విద్యావంతులు సాధారణ స్క్రీనింగ్స్ ఎక్కువగా చేయించుకుంటారు. ఇది తక్కువ జన్యుపరమైన ప్రమాదం లేదా తక్కువ విద్య ఉన్న ఆడవారి కంటే ఎక్కువ అవుతుంది.