తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chitti Punugulu: విజయవాడ ఫేమస్‌ చిట్టి పునుగులు.. ఒరిజినల్‌ స్టైల్‌లో చేద్దామా

Chitti Punugulu: విజయవాడ ఫేమస్‌ చిట్టి పునుగులు.. ఒరిజినల్‌ స్టైల్‌లో చేద్దామా

Anand Sai HT Telugu

01 January 2024, 6:30 IST

google News
    • Chitti Punugulu In Telugu : ఇడ్లీ, దోశ, వడ, పునుగు ఎలా చేయాలో అందరికీ తెలుసు.. కానీ ఒక్కో ఏరియాలో వీటిని ఆ ఏరియా ఒరిజనల్‌ స్టైల్లో చేస్తారు. ఈరోజు మనం విజయవాడ ఫేమస్‌ చిట్టి చిట్టి పునుగులు ఎలా చేయాలో తెలుసుకుందాం..
పునుగులు
పునుగులు

పునుగులు

Chitti Punugulu: విజయవాడ ఫేమస్‌ చిట్టి పునుగులు.. ఒరిజినల్‌ స్టైల్‌లో చేద్దామాఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అక్కడి ఆలయాలు, ఆహారాలు ఆ ప్రాంతాన్ని ఫేమస్‌ చేస్తాయి. ఈరోజు మనం బెజవాడ ఫేమస్‌ చిట్టి చిట్టి పునుగులు ఎలా చేయాలో తెలుసుకుందాం. విజయవాడలో తోపుడుబండ్ల మీద అమ్మే ఈ పునుగులు ఉంటాయి రా చారీ.. ఎన్ని ప్లేట్స్‌ తిన్నా తనివితీరదు. అంత రుచిగా ఉంటాయి. కావాలంటే విజయవాడ వాళ్లను అడగండి..! ఇంకెందుకు లేట్‌.. ఆ చిట్టి చిట్టి పునుగులు అసలు ఎలా చేస్తారో ఒరిజినల్‌ స్టైల్లో మనమూ చేద్దామా..

చిట్టి పునుగులు, కాంబినేషన్‌ టమోటా చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

మినపగుళ్లు - ఒక కప్పు

బియ్యం- మూడు కప్పులు

మైదాపిండి- 3 టేబుల్‌ స్పూన్స్‌

బియ్యంపిండి- 3 టేబుల్‌ స్పూన్స్‌

ఉప్పు- తగినంత

జీలకర్ర- 2 టీస్పూన్‌

వంట సోడా- పావు టీ స్పూన్‌

పచ్చిమిర్చి- 4

టమోటాలు- 3

సన్నగా తరిగిన కొత్తిమీర- కొద్దిగా

బెల్లం- చిన్న గడ్డ

వెల్లుల్లి రెబ్బలు- 4

ఆయిల్‌- డీ ఫ్రైకి సరిపడా

తయారు చేసే విధానం

బియ్యం, మినపప్పును 5 గంటల సేపు నానపెట్టుకోని మెత్తగా గట్టిగా అంటే దోశల పిండిలా కాకుండా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండిని రాత్రంతా అలానే ఉంచుకోండి. ఉదయం ఆ పిండిలోకి మూడు టేబుల్‌ స్పూన్స్ మైదాపిండిని, 3 టేబుల్‌ స్పూన్స్‌ బియ్యం పిండిని, రుచికి సరిపడా ఉప్పును, జీలకర్ర ఒక టీ స్పూన్‌, పావు టీ స్పూన్‌ వంట సోడా వేసుకోని చేత్తో బాగా మెత్తగా కలపండి. ఇక్కడ పిండిని బాగా కలిపితేనే పునుగులు బాగా వస్తాయి. ఇప్పుడు స్టవ్‌ ఆన్‌ చేసుకుని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ వేసుకుని బాగా వేడి చేయండి. నూనె వేడి అయ్యాక గోలీ సైజ్‌లో పునుగులు వేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని పునుగులు గోల్డెన్‌ రంగులో వచ్చే వరకూ కాల్చుకోండి. అంతే విజయవాడ ఫేమస్‌ చిట్టి చిట్టి పునుగులు రెడీ.

చట్నీ ఎలా చేయాలంటే

స్టవ్‌ మీద గిన్నె పెట్టుకోని అందులో నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి, కట్‌ చేసుకున్న టమోటాలు మూడు వేసుకుని టమోటా ముక్కలు మునిగేంత వరకూ వాటర్‌ పోసుకోని, ఒక టీ స్పూన్‌ వరకూ నూనెను, చిన్న బెల్లం గడ్డను వేసుకోండి. ఇందులో చింతపండు వేయకూడదు. మూతపెట్టి లో ఫ్లేమ్‌లోనే 50 శాతం ఉడికేంత వరకూ ఉంచండి. నాలుగు ఐదు నిమిషాలకు స్టవ్‌ ఆఫ్‌ చేసి నీళ్లలోంచి టమోటా, పచ్చిమిర్చి ముక్కలు తీసేసి వాటిని చల్లార్చండి.

టమోటాలు ముక్కలు ఉడికించిన నీళ్లలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకోని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడికించిన టమోటా, పచ్చిమిర్చిని మిక్సీ జార్‌లో వేసుకుని నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి, ఒక టీ స్పూన్‌ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోండి. ముందుగా టమోటాలు ఉడికించుకున్న నీళ్లు ఉన్నాయి కదా.. అందులోకి ఈ చట్నీని వేయండి. అంతే తోపుడ బండ్ల మీద చేసే టేస్టీ టమోటా చట్నీ రెడీ.! ఈ రెండు కాంబినేషన్‌తో తింటుంటే ఉంటుంది.. మైమరిచిపోతారు అంతే. ఒకసారి ఈ కాంబినేషన్‌లో మీరు ట్రై చేయండి.

తదుపరి వ్యాసం