Kalaripayattu । చురకత్తి చూపులతో మంచు లక్ష్మీ కళరిపయట్టు సాధన
14 April 2022, 17:12 IST
- ప్రాచీన యుద్ధ క్రీడ కళరిపయట్టును నటి మంచు లక్ష్మీ అభ్యసిస్తోంది. మంచి ఫిట్‌నెస్ తో పాటు ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని చెబుతోంది. ఆ వివరాలు మీ కోసం...
Lakshmi Manchu demonstrates a Kalaripayattu stance, speaks of its benefits
విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఎవరుంటారు అంటే.. టక్కున గుర్తుకొచ్చే పేరు లక్ష్మీ మంచు. నటిగా, ప్రొడ్యూసర్‌గా, టీవీ ప్రెసెంటర్‌గా మల్టీ టాలెంట్స్ కలిగిన మంచు లక్ష్మీ, ఇంకా ఇంకా తనలోని ప్రతిభలకు సానపెడుతూనే కొత్త ప్రతిభలను అందిపుచ్చుకుంటుంది. తన టాలెంట్స్ అన్నీ తన వద్దే ఉంచుకోకుండా నలుగురికి తెలియాలనే గొప్ప ఉద్దేశ్యంతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. కేవలం తన ప్రతిభలు మాత్రమే కాదు.. ఎన్నో ఆసక్తికర విశేషాలను ఎంతో చక్కగా చిత్రీకరించి, తన అందమైన పలుకులతో మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్ది వాటిని యూట్యూబ్ ద్వారా పంచుకుంటుంది. అందుకే ప్లాట్‌ఫామ్ ఏదైనా లక్షల మంది ఫాలోవర్స్ ఆమెను అనుకరిస్తారు.
ప్రస్తుతం లక్ష్మీ మంచు ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ఇందుకోసం అందరిలా రొటీన్‌గా జిమ్, యోగా, కిక్‌బాక్సింగ్ లాంటివి కాకుండా వాటికి లెవెల్ -అప్ అన్నట్లుగా కళరిపయట్టు అనే యుద్ధకళను అభ్యసిస్తుంది. కళరిపయట్టు లేదా కళరి అనేది కేరళ రాష్ట్రంలో ఆవిర్భవించిన ఒక ద్రవిడ యుద్ధ క్రీడ. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన యుద్ధ క్రీడగా ప్రాచుర్యంలో ఉంది.
ఈ క్రీడను సాధన చేస్తే యుద్ధకళ మాత్రమే కాకుండా శరీరానికి మంచి వ్యాయామం లభిస్తుంది, మనస్సుకు మంచి ప్రశాంతత చేకూరుతుంది.
ఎంతో కఠోరమైన సాధన చేస్తే ఈ యుద్ధకళ అబ్బుతుంది. కానీ లక్ష్మీ మంచు ఇందులో ఇప్పటికే మంచి ప్రావీణ్యం సంపాదించింది అన్నట్లుగా ఆమె పోస్ట్ చేస్తున్న భంగిమలు చూస్తేనే అర్థమవుతుంది. తాజాగా లక్ష్మీ మంచు చురకత్తి లాంటి చూపులతో వేటకు సిద్ధంగా ఉన్న పిల్లి భంగిమను తన Instagramలో పోస్ట్ చేసింది. 'మార్జారా వైదు' అని చెప్పే భంగిమలో లక్ష్మీ మంచును చూస్తే అబ్బురం అనిపించకమానదు. ఈ భంగిమ వలన మనస్సుపై నియంత్రణతో పాటు, శారీరక అనుకూలత లభిస్తుందని ఆమె పేర్కొంది. ఇలాంటి ఇంకా ఎన్నో అద్భుతమైన నైపుణ్యాలను త్వరలో అభిమానులందరితో పంచుకుటానని కూడా మంచు లక్ష్మీ ప్రామిస్ చేసింది.