HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breast Cancer: రొమ్ము క్యాన్సర్ వల్ల వచ్చే గడ్డ ఎలా ఉంటుంది? స్వీయ పరీక్ష ఎలా చేసుకోవాలి?

Breast cancer: రొమ్ము క్యాన్సర్ వల్ల వచ్చే గడ్డ ఎలా ఉంటుంది? స్వీయ పరీక్ష ఎలా చేసుకోవాలి?

28 June 2024, 14:30 IST

  • Breast cancer: రొమ్ము క్యాన్సర్ లక్షణాలు, ఎవరికి వచ్చే అవకాశాలున్నాయి? , ముందుగానే గుర్తించగలిగే స్వీయ పరీక్షలు ఎలా చేసుకోవాలో తెల్సుకోండి. 

రొమ్ము క్యాన్సర్
రొమ్ము క్యాన్సర్ (pexels)

రొమ్ము క్యాన్సర్

బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ చాలా మందిని వేదిస్తోన్న సమస్య. ఇదివరకు ఎక్కడో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది. ఇప్పుడు అలాకాదు.. వయసులో సంబంధం లేకుండా అందరినీ చుట్టు ముట్టేస్తోంది. నటి హీనాఖాన్ తను రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డానని పెట్టిన పోస్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. వయసుతో సంబంధం లేకుండా వేదిస్తున్న ఈ క్యాన్సర్ విషయంలో నిర్లక్ష్యం వద్దు.

అందుకే ప్రతి ఒక్కరు ఎప్పటికప్పులో రొమ్ముల్లో వచ్చే మార్పులు గమనించుకోవాల్సిందే. స్వీయ పరీక్షలు చేసుకోవాల్సిందే. అలాగనీ చిన్న మార్పు వచ్చినా క్యాన్సర్ అని భయపడక్కర్లేదు. తక్కువ సమయంలో గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. కాబట్టి మనకెక్కర్లేదు అనే ఆలోచన లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో కనీస అవగాహన ప్రతి ఒక్కరికీ ఉండాలి.

స్వీయ పరీక్ష ఎలా చేసుకోవాలి.?

మన శరీరం మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. రొమ్ము పరిమాణం, ఆకారం, రంగు.. ఇలాంటి వన్నీ తెలియాల్సిందే. అయితేనే చిన్న మార్పు వచ్చిన పసిగట్టగలం. దానికోసం..

  1. నెలలో ఒకరోజు స్వీయ పరీక్ష కోసం కేటాయించండి. నెలసరి వల్ల రొమ్ముల పరిమాణంలో కాస్త మార్పు ఉండొచ్చు. కాబట్టి పీరియడ్ అయిపోయాక కొన్ని రోజుల తర్వాత ఒక రోజు ఎంచుకోండి. మీకు పీరియడ్స్ రాకపోతే నెలలో ఏదో ఒక తేదీని దానికోసం కేటాయించండి.
  2. ఇప్పుడు అద్దం ముందు నిలబడి మీ రొమ్ముల ఆకారం, పరిమాణం, రంగు గమనించండి. చేతులు పైకెత్తి మరోసారి గమనించండి.
  3. ఇప్పుడు సోఫా లేదా బెడ్ మీద పడుకుని చేతులతో రొమ్ములను తాకండి. ఏవైనా గడ్డల్లాంటివి, లేదంటే ఏమైనా మార్పులున్నాయా గమనించండి. చనుమొన నుంచి మొదలు పెట్టి చంకల వరకు వలయాకారంలో చేతు తిప్పుతూ చూడండి. రెండు వైపులా ఇలా చేయాలి.
  4. చనుమొనను కాస్త నొక్కి చూడండి. ఏవైనా స్రావాలు విడుదల అవుతుంటే నిర్లక్ష్యం చేయకండి.
  5. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు కూడా మరోసారి రెండు రొమ్ములను చేత్తో తాకుతూ గమనించండి. ఎక్కడైనా మీకు కాస్త భిన్నంగా అనిపిస్తే ఒక డైరీలో రాసి పెట్టుకోండి. కొద్ది రోజుల తర్వాత అదే ప్రాంతంలో మళ్లీ గమనిస్తే సరిపోతుంది. చిన్న తేడా అనిపించినా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.

రొమ్ముక్యాన్సర్ గడ్డ ఎలా ఉంటుంది?

అన్ని క్యాన్సర్లు ఒకేలాగా ఉండవు. కానీ కింద చెప్పే లక్షణాల్లో కొన్ని అయినా ఉండొచ్చు. అదెలా ఉంటుందంటే..

  1. గడ్డకు నొప్పి ఉండదు
  2. గుండ్రంగా ఉండొచ్చు లేదంటే సరైన ఆకారం లేకుండా ఉంటుంది.
  3. గడ్డను కదిలిస్తే, రొమ్ము నొక్కితే కదలదు
  4. అలాగే సమయంతో పాటూ గడ్డ పరిమాణం పెరుగుతూ ఉంటుంది.

కొన్ని రకాల క్యాన్సర్లలో గడ్డకు నొప్పి ఉండొచ్చు కూడా..

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు:

గడ్డతో పాటూ.. కింది లక్షణాలు కనిపించొచ్చు..

  1. రొమ్ములో వాపు లేదా ఉబ్బు
  2. చనుమొన నుంచి ఏవైనా స్రావాలు రావడం
  3. చనుమొన, రొమ్ము చర్మం ఎరుపెక్కడం
  4. చనుమొన కాస్త లోపలికి వెళ్లినట్లు అవ్వడం
  5. భుజం, చేయి, చంకల్లో వాపు..

గడ్డ ఉన్నా లేకపోయినా.. వీటిలో ఏమైనా లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాలి. ప్రతిసారీ ఇవి క్యాన్సర్ సూచనలే కాకపోయినా నిర్లక్ష్యం మాత్రం పనికిరాదు.

వీళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ:

  1. మహిళల్లో పురుషులతో పోలిస్తే ప్రమాదం ఎక్కువ
  2. తల్లి, చెల్లి.. ఇలా ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే మీకొచ్చే ప్రమాదం రెట్టింపు అవ్వచ్చు..
  3. వంశపార్యంగా రావచ్చు..
  4. పొగత్రాగడం వల్ల ప్రమాదం పెరుగుతుంది
  5. ఆల్కహాల్ వల్ల
  6. వ్యాయామం లేని జీవన శైలి వల్ల..

వీటితో పాటూ వయసు, బరువు లాంటి విషయాలు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాల్ని ప్రభావితం చేయొచ్చు. కాబట్టి మనకు రాదు అనే ఆలోచన వల్ల ధైర్యంగా ఉన్నా.. మనకు వచ్చే అవకాశమే లేదులే అనే నిర్లక్ష్య ధోరణి మాత్రం పనికి రాదు. ఎప్పటికప్పుడు మీ శరీరంలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉంటే వ్యాధి తీవ్రతను కాస్త తగ్గించుకోవచ్చు.

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్