Moringa powder: క్యాన్సర్‌తో పోరాడుతున్న హీనాఖాన్ మునగాకు పొడి ఎందుకు తింటోంది.. చవకైన అద్భుత ఔషధమిది
05 August 2024, 8:30 IST
Moringa powder: ప్రముఖ టీవీ నటి హీనా ఖాన్ క్యాన్సర్ తో పోరాడుతోంది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మునగాకు పౌడర్ ప్యాకెట్ షేర్ చేసింది. మీరూ దాని ప్రయోజనాలను తెలుసుకోండి.
మునగాకు పొడి లాభాలు
నటి హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతోంది. జుట్టు ఊడటంతో తను గుండు తీయించుకున్న వీడియోను కూడా షేర్ చేసింది. అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, ఆమె వ్యాధితో ధైర్యంగా పోరాడుతోంది. దీనికి సంబంధించిన విషయాలను ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకుంటోంది. తన పోస్టుల ద్వారా అవగాహన కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మునగాకు పొడి ఫొటోను షేర్ చేశారామె. దీన్ని బట్టి ఆమె ఈ వ్యాధిలో ఈ పౌడర్ ను తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. అలాంటప్పుడు, ఈ పొడికి ఉండే అద్భుతమైన ప్రయోజనాలను మీరు కూడా తెలుసుకోండి. దాన్నెలా తయారు చేసుకోవచ్చో కూడా చూడండి.
మునగాకు పొడి లాభాలు:
విటమిన్లు, ఖనిజాలు:
పోషకాలతో నిండి ఉండే మునగాకు ఆకులలో విటమిన్లు, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు మరియు ఆల్కలాయిడ్లతో సహా బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ముఖ్యమైన పోషకాలు రక్తపోటు స్థాయులను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
రోగ నిరోధక శక్తి:
మునగాకు శక్తివంతమైన ఫైటోన్యూట్రియెంట్లతో నిండి ఉంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి ఇన్ఫెక్షన్లు రాకుండా సహాయపడతాయి.
ఫైబర్:
మునగాకు పొడిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. తద్వారా డయాబెటిస్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెద్దప్రేగు ఆరోగ్యాన్ని కాపాడి జీర్ణ సంబంధిత వ్యాధుల ఉపశమనం పొందడంలో సహాయపడతుంది.
బ్లడ్ షుగర్:
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి మునగాకు పౌడర్ సహాయపడుతుందని అనేక నివేదికలు తెలుపుతున్నాయి. 50 గ్రాముల మునగాకు పొడిని ఆహారంలో చేర్చడం వల్ల, తిన్న తర్వాత రక్తంలో చక్కెర పెరుగుదల 21% తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం ఉన్నవారికి మునగాకు రసం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్సులిన్ నియంత్రణను ఇది సరిచేయగలదు.
మునగాకు పొడి ఎలా తయారు చేయాలి?
- ముందుగా తాజా మునగాకులను తెచ్చుకుని శుభ్రం చేసుకోవాలి. ఆకులను కాండం నుంచి వేరు చేయాలి.
- ఒక కాటన్ వస్త్రం మీద ఈ మునగాకును దూరం దూరంగా వేసి ఆరబెట్టుకోవాలి. వాటిలో ఉన్న తేమ ఈ వస్త్రం పీల్చుకుంటుంది.
- తర్వాత గుడ్డ మీద నుంచి తీసి జల్లెడ లేదా మరో న్యాప్‌కిన్ మీద ఈ ఆకులను వేసుకోవాలి.
- ఈ ఆకులను ఎండకు పెట్టి ఆరనివ్వకూడదు. దాంతో పోషకాలు తగ్గిపోతాయి. బదులుగా ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టి లేదా గది మూలల్లో పెట్టి ఆరనివ్వాలి.
- రెండు మూడ్రోజులయ్యాక ఆకులు పైనుంచి వేస్తే చప్పుడు వచ్చేంతలా ఎండిపోతాయి. వీటిని చేత్తోనే పొడిలా చేసుకోవాలి. ఇంకేమైనా కొమ్మలుంటే తీసి పడేయాలి.
- అవసరమనుకుంటే ఒకసారి మిక్సీలో వేసి పొడి పట్టుకోవాలి. గాలి చొరవని డబ్బాలో ఈ పొడి వేసుకుంటే కనీసం ఆరేడు నెలలైనా పాడవ్వదు.
- రోజూ సగం చెంచా నుంచి చెంచాడు దాకా ఈ పొడిని తినొచ్చు. ఒకేసారి ఎక్కువగా తినడం మొదలుపెడితే అజీర్తి, విరేచనాలు రావచ్చు. క్రమంగా దీన్ని అలవాటు చేసుకోవాలి.
- ఈ పొడిని కూరల్లో, పప్పుల్లో చివర్లో దించేటప్పుడు వేసుకోవచ్చు. కాస్త రుచితో పాటూ పోషకాలూ చేరతాయి.