HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Skin Icing: ఈ విషయాలు తెలిస్తే చర్మానికి ఐస్ ఇంకోసారి పెట్టరు

Skin icing: ఈ విషయాలు తెలిస్తే చర్మానికి ఐస్ ఇంకోసారి పెట్టరు

08 July 2024, 8:00 IST

  • Skin icing: చర్మ సంరక్షణ విషయంలో ఎప్పటికీ స్కిన్ ఐసింగ్ ట్రెండింగ్ లో ఉంటుంది. దానివల్ల చర్మం మీద ఎలాంటి ఫలితాలుంటాయో వివరంగా తెల్సుకోండి. 

స్కిన్ ఐసింగ్
స్కిన్ ఐసింగ్ (Pinterest)

స్కిన్ ఐసింగ్

చర్మ సౌందర్యం విషయంలో చాలా రకాల ట్రెండ్స్ వస్తుంటాయి.. పోతుంటాయి. అయితే వాటిలో చాలా కాలంగా మన మధ్య ఉన్న ట్రెండ్ మాత్రం స్కిన్ ఐసింగ్. అంటే చర్మానికి ఐస్ రాయడం. ఐస్ రోలర్లు, ఐస్ క్యూబ్స్ రాసుకోవడం గురించి చాలా రోజులుగా చూస్తున్నాం. దీనివల్ల మెరిసిపోయే చర్మం సొంతం అవుతుందని చాలా చోట్ల చెబుతుండడం చూస్తుంటాం. కానీ దీనివల్ల విపరీతమైన నష్టాలున్నాయట.

సెలెబ్రిటీ ఆస్తటీషియన్ దిన్యార్ హెచ్‌టి లైఫ్‌స్టైల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చర్మానికి ఐస్ రాసుకోవడం వల్ల జరిగే నష్టాల గురించి వివరించారు. యాక్నె తగ్గించడానికి, ముఖంలో ఉబ్బుతగ్గించడానికి, కళ్లలో ఉబ్బు తగ్గించడానికి ఐస్ వాడటం మంచిదా కాదా.. వాడితే ఎలాంటి ఫలితాలుంటాయో కూడా ఆయన వివరించారు. ఆ వివరాలన్నీ తెల్సుకోండి.

1. చర్మ ఉష్ణోగ్రత మీద ప్రభావం:

చర్మం ఎప్పుడు సాధారణ ఉష్ణోగ్రతతో ఉంటుంది. దానిమీద చల్లని ఐస్ రాయడం వల్ల చర్మం ఉష్ణోగ్రత ఉన్నట్టుండి పడిపోతుంది. దీంతో చర్మం పొడిబారడం, ఎరుపుగా మారడం, ర్యాషెస్ లాంటివి రావచ్చు. ఉన్నట్టుండి చర్మం చల్లబడటమే దీనికి కారణం.

2.ఇన్ఫెక్షన్లు:

చర్మాన్ని ఒక సున్నితమైన బెలూన్ అనుకోండి. బయట వాతావరణానికి, లోపలి శరీరానికి ఇది అడ్డు తెరలాగా ఉంటుంది. ఐస్ ముక్కను నేరుగా చర్మం మీద పెట్టడం వల్ల అంత సున్నితమైన చర్మం మీద ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చర్మం సున్నితంగా మారి తొందరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంది.

3. ఎర్ర మచ్చలు రావచ్చు:

మన చర్మం కింద అనేక రక్త కేశనాళికలుంటాయి. ఇవి చర్మంలో రక్త సరఫరాను పెంచుతాయి. చర్మం మీద మంచు పెట్టినప్పుడు వాటి మీద తీవ్ర ఒత్తిడి పడుతుంది. దాంతో ఇవి చిట్లిపోయి చర్మం మీద ఎర్రటి మరకలు కూడా రావచ్చు. చూడ్డానికి ఇవి ర్యాషెస్ లాగా కనిపిస్తాయి. దీనివల్ల దీర్ఘకాలిక చర్మ సమస్యలు వచ్చే అవకాశమూ ఉంది.

4. చర్మ సంబంధిత వ్యాధులు మరింత తీవ్రం:

ఎగ్జీమా, యాక్నె లాంటి సమస్యలు, ఇంకేవైనా దీర్ఘకాలిక చర్మ సమస్యలు ఉన్నవాళ్లు ఐస్ పెట్టుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రం అవుతుంది. చల్లటి ఉష్ణోగ్రత వల్ల చర్మంలో ఉండే సహజ నూనెలు తగ్గిపోతాయి. చర్మం తేమ కోల్పోతుంది. దాంతో సులువుగా పొడిబారిపోతుంది. చర్మం మీద పొలుసుల్లాగా ఊడిపోవడం గమనించవచ్చు.

5. దీర్ఘకాలిక సమస్యలు రావచ్చు?

ముఖంలో ఉబ్బినట్టు అనిపించడం, వాపు ఉన్నప్పుడు చర్మం మీద ఐస్ పెట్టి రుద్దడం వల్ల కాస్త తగ్గినట్లు అప్పటికి మాత్రం ఉపశమనంగా అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలికంగా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చర్మం మీద సన్నటి గీతలు, ముడతలు, చర్మం సాగిపోయే లక్షణాన్ని కోల్పోవడం లాంటి సమస్యలొస్తాయి.

6. ఇంకేం ప్రత్యామ్నాయాలు ఉన్నాయి?:

చర్మానికి ఐస్ పెట్డడం ఒక్కటే చర్మ సౌందర్యానికి మార్గం కాదు. సరైన జీవనశైలి, ఆహారం, వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం, మంచి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందొచ్చు.

 

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్