Iruppu Falls: ఫ్రెండ్స్‌తో వెకేషన్ వెళ్లేందుకు ఈ వాటర్ ఫాల్స్ బెస్ట్.. ఎక్కడ, ఎలా వెళ్లాలంటే!
14 December 2024, 16:30 IST
- Iruppu Falls Tour: స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు ఇరుప్పు వాటర్ ఫాల్స్ అదిరిపోతుంది. అడవి మధ్యలో ఉండే ఈ జలపాతం మనసులను దోచేస్తుంది. వెకేషన్‍కు వెళ్లేందుకు సూటవుతుంది. ఇక్కడికి ఎలా వెళ్లాలంటే..
Iruppu Falls: ఫ్రెండ్స్‌తో వెకేషన్ వెళ్లేందుకు ఈ వాటర్ ఫాల్స్ బెస్ట్.. ఎక్కడ, ఎలా వెళ్లాలంటే!
ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసేందుకు వాటల్ ఫాల్స్ పర్‌ఫెక్ట్ ప్లేస్‍గా ఉంటుంది. జలకాలు ఆడుతూ.. ప్రకృతిని ఆస్వాదిస్తూ, గంతులు వేస్తూ ఆనందంగా గడపవచ్చు. అందుకే చాలా మందికి జలపాతాలు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ప్రస్తుత డిసెంబర్ నెలలో వాటర్ ఫాల్స్‌కు వెళ్లేందుకు సూటయ్యే సమయం. ఏడాది చివరి నెల కావడంతో చాలా మంది వెకేషన్‍కు ప్లాన చేస్తుంటారు. స్నేహితులతో టూర్ ప్లాన్ చేస్తుంటే కర్ణాటకలోని ఇరుప్పు ఫాల్స్ మంచి ఆప్షన్‍గా ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఎక్కడ ఉంది?
ఇరుప్పు వాటర్ ఫాల్స్.. కర్ణాటకలోని కొడగు జిల్లాలో బ్రహ్మగిరి హిల్ రేంజ్ పరిధిలో ఉంది. ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన కూర్గ్‌కు ఈ జలపాతం 75 కిలోమీటర్ల దూరం. కేరళలోని వయనాడ్ జిల్లా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఇరుప్పు వాటర్ ఫాల్స్ ఉంది. దీన్ని లక్ష్మణ తీర్థ వాటర్ ఫాల్స్ అని కూడా ఉంటారు. కావేరీ ఉపనది లక్ష్మణతీర్థ నుంచి ఈ జలపాతం జాలువారుతూ ఉంటుంది.
170 అడుగులపై నుంచి..
ఇరుప్పు వాటర్ ఫాల్స్ వద్ద నీరు సుమారు 170 అడుగుల ఎత్తు నుంచి కింద పడుతుంది. పచ్చదనం మధ్య జాలువారుతున్న జలపాతం మనసులను దోచేస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలను మనసులను ఆకట్టుకుంటాయి. పక్షుల కిలకిలారావాలు కూడా వినిపిస్తుంటాయి. పర్యాటకులను ఈ వాటర్ ఫాల్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక్కడి జలపాతపు నీటిలో స్నానం చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు.
అడవి మధ్యలో నడుకుంటూ..
ఇరుప్పు వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లేందుకు పచ్చని అందాలతో ఉండే అడవి మధ్య సుమారు కిలోమీటర్ వరకు కొండపై నడుచుకుంటూ వెళ్లాలి. ఈ నడక కూడా మంచి ఎంజాయ్‍తో ఉంటుంది. సరదాగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. శివుడు, రామేశ్వరుడి దేవాలయాలు కూడా ఉంటాయి.
బెస్ట్ టైమ్ ఇదే..
ఇరుప్పు వాటర్ ఫాల్స్‌కు వెళ్లేందుకు ఆగస్టు నుంచి జనవరి మధ్య బెస్ట్ సమయంగా ఉంటుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. ఇరుప్పు వాటర్ ఫాల్స్‌కు ఎంట్రీ ఫీజు రూ.50గా ఉంటుంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ జలపాతంలో ఉండొచ్చు.
లక్ష్మణ తీర్థ పేరు ఎలా వచ్చిందంటే..
సీతాదేవిని వెతుకుతూ రాముడు, లక్ష్మణుడు బ్రహ్మగిరి అడవులకు వచ్చినట్టు రామాయణంలో ఉంది. ఆ సమయంలో రాముడు తాగేందుకు నీరు అడుగారు. నీరు తొరకపోవటంతో బ్రహ్మగిరి కొండలవైపు లక్ష్మణుడు బాణం సంధించారు. దీంతో ఈ నది సృష్టి జరిగిందని నమ్ముతారు. అందుకే దీనికి లక్ష్మణ తీర్థ జలపాతం అని పిలుస్తారు. ఇరుప్పు వాటల్ ఫాల్స్ పేరుతో పాపులర్ అయింది.
హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి ఇరుప్పు వాటర్ ఫాల్స్ సుమారు 850 కిలోమీటర్లు ఉంటుంది. కారులో వెళితే బెంగళూరు హైవే మీదుగా వెళ్లవచ్చు. బెంగళూరు చేరాక కూర్గ్ దారిలో వెళ్లాలి. ఈ ప్రయాణం కూడా చాలా బాగుంటుంది. బెంగళూరుకు ఈ వాటల్ ఫాల్స్ సుమారు 256 కిలోమీటర్ల దూరంలో ఉంది. మైసూరుకు 120 కిలోమీటర్ల దూరం.
బస్సుల ద్వారా అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి.. అక్కడి నుంచి మడికెరి లేదా కూర్గ్ చేరాలి. సీజన్‍లో అయితే హైదరాబాద్ నుంచి కొన్ని ప్రైవేట్ బస్సులు నేరుగా కూర్గ్ వెళతాయ. అక్కడి నుంచి మడికెరి వెళ్లి ఇరుప్పు ఫాల్స్ దగ్గరికి మరో బస్ లేదా ట్యాక్సీ ఎక్కాల్సి ఉంటుంది.
ఇరుప్పి వాటల్ ఫాల్స్‌కు సమీప రైల్వే స్టేషన్ మైసూరే. రైలు మార్గంలో అయితే హైదరాబాద్ నుంచి ముందుగా మైసూర్ రైల్వే స్టేషన్ వెళ్లాలి. అక్కడి నుంచి కూర్గ్ వెళ్లి.. ఇరుప్పు వాటల్ ఫాల్స్ చేరాల్సి ఉంటుంది. విమానంలో వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి మైసూర్ వెళ్లాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది.