Sankranti Festival: సంక్రాంతి సంబరం అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండదు, ప్రసాదంగా కిచిడీ వండుకునే రాష్ట్రమేంటో తెలుసా!
13 January 2025, 20:30 IST
Sankranti Festival: సంక్రాంతి చాలా స్పెషల్. ఎలా అంటే దేశం మొత్తం ఈ పండుగ జరుపుకుంటున్నా, ఈ పండుగను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారట. మరి ఆంధ్ర, తెలంగాణ కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూసేద్దామా..

సంక్రాంతి విశిష్టత
సంక్రాంతి అంటే మన ఇల్లు, మన ఊరు, మన చుట్టూ ఉండే పరిసరాలే కాదు. దేశం మొత్తం పండుగే. సంక్రాంతి అంటేనే ఒక సంబరం. ఇంగ్లీష్ క్యాలెండర్ లో వచ్చే తొలి హిందువుల పండుగ సంక్రాంతి. ఈ మకర సంక్రాంతిని భారతదేశం అంతటా వివిధ రీతుల్లో జరుపుకుంటారు. ఇది దేశ సంస్కృతిలో ఏకత్వాన్ని , వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో గంగిరెద్దుల నుంచి గుజరాత్‌లో రంగురంగుల పైకెట్లు ఆకాశాన్ని అలంకరించడం, బెంగాల్‌లో గంగా స్నానాలు చేయడం వరకు, ప్రతి రాష్ట్రం ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటుంది.
ఇది కేవలం సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నందుకు జరుపుకునే పండుగలా కాకుండా, వివిధ ప్రాంతాల ప్రజలను సంస్కృతులను మరోసారి గుర్తు చేసేలా ఉంటుంది. కలలు, ఉత్సాహం , సంతోషంతో కూడిన అనుభవాలను పంచుకునే పండుగగా నిలుస్తుంది. మకర సంక్రాంతి ఉత్సవాన్ని ఆనందాన్ని అనుభవించడానికి ప్రజలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్‌లో, భోగి మంటలతో సంక్రాంతి పండుగ మొదలవుతుంది. ఈ మంటల్లో ప్రజలు తమకు ఇష్టంలేని, పాత, వాడని వస్తువులను మంటల్లో వేసి కాల్చేస్తారు. పాతదనం పోవాలని సరికొత్తదనం తమ జీవితాల్లోకి రావాలని కోరుకుంటారు.
గొబ్బెమ్మ ఉత్సవం: మహిళలు గొబ్బెమ్మని అంటే ఆవు పేడతో తయారుచేసి దానిపై రేగు పండు, పూలు వేసి అలంకరిస్తారు.
పంచదారతో తయారుచేసిన పిండివంటకాలు: లడ్డూ , అరిసెలు, చెక్కలు, చక్రాలు వంటి పిండివంటలు తయారుచేసి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు పంచిపెట్టి సంతోషిస్తారు.
గంగిరెద్దు పూజ: గంగిరెద్దును శుభ్రంగా కడిగి దానికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ముగ్గుల పోటీలు: పెద్ద ఎత్తులో సంబరాలు చేసి ముగ్గుల పోటీలు నిర్వహిస్తారు. ఇందులో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పండుగ రోజును సంతోషంగా, పోటీతత్వంతో ప్రారంభిస్తారు.
తెలంగాణలో..
తెలంగాణలో మకర సంక్రాంతి ఎంతో ఉత్సాహంతో , సాంప్రదాయ బద్ధమైన ఆచారాలతో జరుపుకుంటారు. పండుగ కార్యక్రమాలు ఒక రోజు ముందుగానే అంటే భోగి పండుగతో ప్రారంభమవుతాయి. ఇందులో ప్రజలు పాత వస్తువులను మంటల్లో కాల్చి చెడు తమ జీవితాల్లో నుంచి పోయిందన్నట్లుగా భావిస్తారు. కొత్త దాన్ని స్వాగతిస్తున్నట్లు భావిస్తారు. సంక్రాంతి రోజున ప్రజలు పగటి వేళలో పవిత్ర నదుల్లో స్నానం చేసి ఆలయాలకు వెళ్లి ఆశీస్సులు కోరుకుంటారు.
హరిదాసు, గంగిరెద్దు ప్రదర్శనలు: తెలంగాణకు ప్రత్యేకమైన హరిదాసులు (విష్ణువు భక్తులు) , గంగిరెద్దుల వారు పాటలు పాడుతూ సంప్రదాయ నృత్యాలు చేస్తారు.
ముగ్గుల పోటీలలో పాల్గొనడం: వీధులన్నీ రంగులతో, రంగోలీలతో వెలిగిపోతాయి.
పశ్చిమ బెంగాల్‌లో..
బెంగాల్‌లో గంగా సాగర్ మేళా ఒక ముఖ్యమైన వేడుకగా ఉంటుంది. ఇందులో వేలాదిమంది భక్తులు గంగా నది సముద్రం కలిసే స్థలంలో పవిత్ర స్నానం చేస్తారు.
పిఠే-పులి ఉత్సవం: పిఠే-పులి పేరుతో పంటల నుంచి ఇంటికి చేరుకున్న వరి గింజలతో పంచదారతో తయారు చేసుకున్న పిండి వంటలు తింటారు.
తుసు పరబ్: పండుగ సందర్భంలో పాటలు పాడి, నృత్యాలు చేయడం , తుసు చెట్టును చుట్టూ తిరిగి పూజలు చేయడం వారికి ఆనవాయితీ.
అఖండ దీపం: బెంగాల్‌లో, మకర సంక్రాంతి సమయంలో అఖండ దీపాన్ని వెలిగించడం అనేక సంవత్సరాల నుంచి వస్తుంది. ఇది ఆనందాన్ని , జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుందని వారు నమ్ముతారు.
బీహార్‌లో..
బీహార్‌లో మకర సంక్రాంతిని "ఖిచడి పర్వ్" లేదా "తిల సంక్రాంతి"గా పిలుస్తారు.
ఖిచిడి అర్పణ: భక్తులు అన్నం , పెసలతో చేసిన నైవేద్యాన్ని సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు.
దహి-చురా: పెసలను, పెరుగుతో కలిపి తినడం వల్ల శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
మాఘి మేళా: బీహార్‌లో ముఖ్యమైన మాఘి మేళా ప్రదర్శనలు, నదిలో స్నానం చేయడం, వేదాలు పఠించడం వంటివి బాగా అమలులో ఉన్నాయి.
గుజరాత్‌లో..
గుజరాత్‌లో మకర సంక్రాంతిని ఉత్తరాయణ పండుగగా పరిగణిస్తారు.
అంతర్జాతీయ గాలిపటాల పండుగ: మకర సంక్రాంతి సందర్భంగా గుజరాత్‌లో అత్యంత ఉత్సాహభరితమైన అంతర్జాతీయ గాలిపటాల పండుగ జరుపుకుంటారు, ఇందులో వివిధ పరిమాణాలు, ఆకారాలు గల రంగురంగుల గాలిపటాలు ఆకాశంలోకి ఎగిరి సందడి చేస్తాయి.
ఉంధియూ, జలేబి: గుజరాత్‌లో సంప్రదాయ వంటకాలు అయిన ఉంధియూ , జలేబిలను ఈ రోజున తప్పనిసరిగా తయారుచేస్తారు.
గాలిపటాల తయారీ వర్క్‌షాప్‌లు: ఈ వర్క్‌షాప్‌లు మకర సంక్రాంతికి ముందు నిర్వహించబడతాయి, ఇవి సంప్రదాయ గాలిపటాల తయారీ కళను కాపాడుకోవడానికి ఉద్దేశించి నిర్వహిస్తారు.
రాత్రి గాలిపటాల (పైకెట్) ప్రదర్శన: రాత్రి వేళల్లో ప్రకాశించే పైకెట్లు , ఆకాశ దీపాలు ఆకాశాన్ని అలంకరించుతాయి.