Bombay Chutney Recipe: బొంబాయి చట్నీ తయారీ విధానం.. పూరీ, చపాతీతో అదుర్స్
07 August 2023, 17:31 IST
బొంబాయి చట్నీ తయారీ విధానం ఇక్కడ తెలుసుకోండి. పూరీ, చపాతీ, ఇడ్లీలతో పాటు తింటే అద్భుతంగా ఉంటుంది.
బొంబాయి చట్నీ
ఎక్కువగా చపాతీ, పూరీ ఇష్టపడే వారికి అందులో కర్రీ కాస్త వెరైటీగా ఉండాలనుకుంటే బొంబాయి చట్నీ ట్రై చేయొచ్చు. నగరాల్లో ఇది తరచుగా కనిపించదు. కానీ ఇప్పటికీ గ్రామాల్లో తయారు చేసుకుంటారు. బొంబాయి చట్నీ చపాతీ, ఇడ్లీ, పూరీకి చాలా రుచిగా ఉంటుంది. దీంతో మళ్లీ మళ్లీ తినాలనే భావన కలుగుతుంది. ఇందులో శనగ పిండిని ప్రధానంగా ఉపయోగిస్తారు. దీన్ని ఎలా చేయాలో చూద్దాం.
బొంబాయి చట్నీకి అవసరమైన పదార్థాలు
- శనగ పిండి - అర కప్పు
- మినప పప్పు - టీ స్పూను
- శనగ పప్పు - టీ స్పూను
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 2
- ఆవాలు - ½ టీ స్పూన్
- జీలకర్ర - ½ టీ చెందా
- కరివేపాకు - కొద్దిగా
- పసుపు - పావు టీస్పూన్
- కొత్తిమీర - కొద్దిగా
- నూనె - ఒక చెంచా
- ఉప్పు - కావలసినంత
బొంబాయి చట్నీ తయారీ విధానం
ఒక పాత్రలో అరకప్పు శనగ పిండి తీసుకుని అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోయాలి. అంటుకోకుండా బాగా కలపాలి.
మరో బాణలిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పప్పులు వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
నీళ్లలో కలిపిన శనగ పిండి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. ప్రతి రెండు నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలి. ఉప్పు తగినంత వేయాలి. ముద్దలు లేకుండా కలపాలి. పైన కొత్తిమీర చల్లి దించాలి. పది నిమిషాల్లో ఈ చట్నీ రెడీ. రుచి అమోఘంగా ఉంటుంది.
కొందరు ఉడికించిన బంగాళదుంపలను కూడా దీనిలో కలుపుతారు. బంగాళదుంపల అదనపు రుచి చాలా బాగుంటుంది.