Joint Pains in Winter: చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువయ్యయా? ఉపశమనం కోసం 7 జాగ్రత్తలను చెప్పిన డాక్టర్
10 December 2024, 14:00 IST
- Joint Pains in Winter: చలికాలంలో కీళ్ల నొప్పుల సమస్య ఎక్కువవుతుంది. చల్లటి వాతావరణంలో ఈ ఇబ్బంది అధికమవుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఎలా పొందాలో కొన్ని జాగ్రత్తలను ఓ డాక్టర్ చెప్పారు.
Joint Pains in Winter: చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువయ్యయా? ఉపశమనం కోసం 7 జాగ్రత్తలను చెప్పిన డాక్టర్
కీళ్ల నొప్పులు ఉన్న వారికి చలికాలం మరింత సవాలుగా ఉంటుంది. ఈ కాలంలో నొప్పులు అధికమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావణం చల్లగా ఉండడం వల్ల కీళ్లకు మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. నొప్పులతో ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం దక్కాలంటే ఏం చెయాలో హెచ్‍టీ లైఫ్‍స్టైల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు బీఎల్‍కే మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కీళ్ల మార్పిడి ప్రోగ్రాం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఈశ్వర్ బోరా. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
కీళ్ల నొప్పులు ఉన్న వారికి చలికాలం చాలా సమస్యగా ఉంటుందని డాక్టర్ ఈశ్వర్ అన్నారు. “చలికాలం చాలా మందికి ఫేవరెట్ సీజన్ కావొచ్చు. కానీ కీళ్ల నొప్పులు ఉన్న వారికి మాత్రం సవాలుగా ఉంటుంది. వాతావరణం చల్లగా అయ్యే కొద్ది నొప్పుల ఇబ్బందులు పెరుగుతాయి. మరిన్ని తీవ్రమైన లక్షణాలు ఉండొచ్చు” అని అన్నారు. కీళ్ల నొప్పులు తీవ్రం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పారు.
హైడ్రేటెడ్‍గా ఉండాలి
శరీరంలో డీహైడ్రేషన్ ఉంటే నొప్పి పెరుగుతుందని డాక్టర్ ఈశ్వర్ చెప్పారు. అందుకే శరీరానికి సరిపడా నీరు కచ్చితంగా తాగుతూ ఎప్పుడూ హైడ్రేటెడ్‍గా ఉండాలని చెప్పారు. చలికాలమైనా సరే శరీరంలో తేమ తగ్గిపోతుందని, అందుకే సరిపడా నీరు తాగితే కీళ్ల నొప్పుల నుంచి కాస్త ఉపశమనం ఉంటుందని చెప్పారు.
శారీరకంగా యాక్టివ్‍గా..
చలికాలంలో కీళ్ల నొప్పులు తీవ్రంగా కాకూడదంటే తప్పనిసరిగా వ్యాయామాలు చేయాలని డాక్టర్ వెల్లడించారు. శారీరకంగా యాక్టివ్‍గా ఉండాలన్నారు. ఫ్లెక్సిబులిటీ ద్వారా కండరాల దృఢత్వాన్ని పెంచి కీళ్ల నొప్పి నుంచి ఎక్సర్‌సైజ్ ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. వర్కౌట్స్ చేసే ముందు వామప్ తప్పనిసరిగా చేయాలని చెప్పారు. కీళ్ల నొప్పులు ఉన్న వారు ఇండోర్ వ్యాయామాలు చేయాలని తెలిపారు.
యాంటీఇన్‍ఫ్లమేటరీ ఆహారాలు
యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే అవకాడోలు, ఫ్యాటీ ఫిష్‍లను ఎక్కువగా తీసుకోవాలి. పసుపు, అల్లం, ఉల్లిపాయలు, ప్రోబయోటిక్ ఫుడ్స్, గ్రీన్ టీ, బెర్రీలు, ఆకుకూరల్లోనూ యాంటీఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి.
వెచ్చగా ఉండేలా..
చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ ఈశ్వర్ వెల్లడించారు. ఇందుకోసం స్వెటర్లు వేసుకోవాలి. కీళ్లకు నేరుగా చల్ల గాలి తగలకుండా చూసుకోవాలి. చేతులకు గ్లౌవ్స్, కాళ్లకు సాక్స్ లాంటివి వేసుకోవాలి.
హీట్ కూడా..
కీళ్లకు హీట్ తగిలేలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం ఉంటుందని చెప్పారు. ఇందుకోసం హీటింగ్ ప్యాడ్స్, వ్రాప్స్ ఉపయోగించవచ్చు. వీటిని కీళ్లపై పెట్టి హీట్ తగిలేలా చేయాలి. దీనిద్వారా ఉపశమనం ఉంటుంది.
సూర్యరశ్మి తగిలేలా..
చలికాలంలో శరీరానికి నేరుగా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలని డాక్టర్ ఈశ్వర్ వెల్లడించారు. దీని ద్వారా విటమిన్ డీ, ఏ లోపం తగ్గుతుందని, దీనివల్ల కీళ్ల నొప్పులు తీవ్రంగా కాకుండా ఉంటాయని అన్నారు. కీళ్ల ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.
బరువు పెరగకుండా..
శీతాకాలంలో కొందరు బరువు పెరుగుతుంటారు. జీవనశైలిలో వచ్చే మార్పులు ఇందుకు కారణం కావొచ్చు. అయితే, చలికాలంలోనూ బరువు పెరగకుండా జాగ్రత్త తీసుకుంటే కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుందని డాక్టర్ ఈశ్వర్ బోరా సూచించారు. ఇప్పటికే అధిక బరువు ఉండే తగ్గించుకునేందుకు కష్టపడాలన్నారు.