Kitchen Tips: కర్రీలో పులుపు ఎక్కువైందా? రుచిని బ్యాలెన్స్ చేసేందుకు ఈ టిప్స్ పాటించండి
14 December 2024, 14:00 IST
- Kitchen Tips - Tips for reduce sourness: కర్రీలో పులుపు ఎక్కువైతే టేస్ట్ బాగోదు. తినాలని అనిపించదు. అలాంటి సమయాల్లో పులుపును తగ్గించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.. వీటిని పాటిస్తే టేస్ట్ అడ్జస్ట్ అవుతుంది.
Kitchen Tips: కర్రీలో పులుపు ఎక్కువైందా? రుచిని బ్యాలెన్స్ చేసేందుకు ఈ టిప్స్ పాటించండి
ఒక్కోసారి వేసే పదార్థాల కొలతల్లో తేడా జరిగితే కర్రీ ఎక్కువగా పులుపుగా అవుతుంది. ముఖ్యంగా టమాటాలు, చింతపండు లాంటివి ఎక్కువగా పడిన సందర్భాల్లో కర్రీ పుల్లగా మారుతుంది. కొంచెమైతే పర్లేదు కానీ.. పులుపు మరీ ఎక్కువగా ఉంటే కర్రీ అంత బాగోదు. మిగిలిన రుచినంతా పులుపు డామినేట్ చేస్తుంది. తినాలనిపించదు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే కర్రీలో పులుపుదనాన్ని తగ్గించవచ్చు. టేస్ట్ బాగా బ్యాలెన్స్ అవుతుంది. ఆ చిట్కాలు ఇవే..
చక్కెర, బెల్లం వేయడం
కర్రీలో పులుపు ఎక్కువ అయితే తీపి వేయడం వల్ల రుచి బ్యాలెన్స్ అవుతుంది. పులుపు దనాన్ని తగ్గించేందుకు కూరలో చక్కెర లేదా బెల్లం వేయాలి. ఇందులోని తీపి వల్ల ఫ్లేవర్స్ అడ్జస్ట్ అవుతాయి. అదనంగా ఉన్న పులుపు చాలా వరకు తగ్గుతుంది. మంచి టేస్ట్ వస్తుంది. తేనె కూడా వేసుకోవచ్చు.
పెరుగు, పాలు కలపడం
కర్రీలో పులుపును పెరుగు కూడా తగ్గిస్తుంది. పెరుగుకు పుల్లటి గుణం ఉన్నా.. కూరలోని టేస్టును బ్యాలెన్స్ చేయగలదు. పెరుగులో కొన్ని పాలు పోసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని నెమ్మదిగా కూరలో వేసి ఉడికించాలి. ఇది పుల్లని రుచిని తగ్గిస్తుంది. రుచిని బ్యాలెన్స్ చేస్తుంది. దీని బదులు ఫ్రెష్ క్రీమ్ కూడా వాడొచ్చు.
ఈ కూరగాయలు
కర్రీలో పులుపు ఎక్కువైతే సరిపడా బంగాళదుంపలు లేదా క్యారెట్లు వేసి ఉడికించాలి. దీని ద్వారా పులుపు బాగా తగ్గుతుంది. టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. బఠానీలు వేసినా పులుపు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఇవి వేస్తే కర్రీకి పోషకాలతో పాటు మంచి రుచి కూడా వస్తుంది.
కొబ్బరి లేదా నట్స్ పేస్ట్
కర్రీలో పలుపు ఎక్కువ అయితే కొబ్బరి పొడి లేదా కొబ్బరి తురుము వేయవచ్చు. దీని వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. క్రీమీగా కావాలంటే కొబ్బరిని గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఆక్రోటు (వాల్‍నట్స్) పేస్ట్ వేసినా పులుపు తగ్గుతుంది. బాదం, గసగసాల పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా కర్రీలోని రుచిని సమతుల్యం చేస్తాయి. టేస్ట్ కూడా పెరుగుతుంది.
కాస్త వంట సోడా
కర్రీ పుల్లగా ఉంటే వంట సోడా కూడా వాడవచ్చు. కాస్తే బేకింగ్ సోడా వేస్తే రుచులు బ్యాలెన్స్ అవుతాయి. అయితే, సోడాను ఎక్కువగా వేస్తే రుచి ఎక్కువగా మారిపోతుంది. అందుకే వంటకాన్ని బట్టి ఓ చిటికెడు వేస్తే సరిపోతుంది. పులుపును కాస్త తక్కువగా అడ్జస్ట్ చేయాలంటే ఈ సులువైన మార్గం సరిపోతుంది.
అయితే, పులుపు తగ్గేందుకు మీరు చేసిన కూర ఎంత ఉందో.. పులుపు ఎంత ఎక్కువైందనే దాన్ని బట్టి వీటిని ఆ మేర వేసుకోవాలి. టేస్ట్ అడ్జస్ట్ అయ్యేంత మోతాదులో యాడ్ చేయాలి.