Zika Virus: జికా వైరస్‌పై గర్భం ధరించిన ప్రతి స్త్రీ అవగాహన పెంచుకోవడం అవసరం అంటున్న వైద్యులు
Published Jul 17, 2024 04:56 PM IST
- Zika Virus: భారత్‌లో ఇటీవల జికా కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. దీనిపై అందరికీ అవగాహన అవసరమని చెబుతున్నారు ఫెర్నాండెజ్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ తారకేశ్వరి.
జికా వైరస్
ఈ మధ్య కాలంలో జికా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా ఇటీవల జికా కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఒక సూచనను జారీ చేసింది. ఇది కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను ప్రభావితం చేసిందని అందులో పేర్కొంది. సాధారణంగా జికా వైరస్ సోకిన చాలా మంది వ్యక్తులు ఆ లక్షణాలను ప్రదర్శించరు. కానీ అవి బయటపడ్డప్పుడు దద్దుర్లు, జ్వరం, కండరాలు-కీళ్ల నొప్పులు, కండ్లకలక (ఎరుపు కళ్ళు) వంటి లక్షణాలను ప్రదర్శిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా వ్యాధికారక దోమ కుట్టిన 3-14 రోజుల తర్వాత కనిపిస్తాయి.
జికా వైరస్ ఎలా సోకుతుంది?
జికా వైరస్ ప్రధానంగా వ్యాధికారక ఆడ ఏడెస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో తల్లి నుండి పిండానికి కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్ తల్లి పాలలో ఉన్నట్లు కనుగొనబడినప్పటికీ, తల్లి పాలివ్వడం ద్వారా ప్రసారం అవుతుందని ఇంకా ధృవీకరించలేదు. అంతేకాకుండా జికా లైంగిక సంపర్కం ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఈ జికా వైరస్ లక్షణాలు కనిపించిన ఏడు రోజులలోపు రక్తం యొక్క RT-PCR పరీక్ష నిర్వహించడం వలన జికా వైరస్‌ను నిర్ధారించడంలో సహాయపడుతుంది. లాలాజలం, మూత్రం, అమ్నియోటిక్ ద్రవం వంటి ఇతర శరీర ద్రవాలలో కూడా వైరస్ ఉనికిని గుర్తించవచ్చు.
గర్భధారణ సమయంలో జికా వైరస్ సంక్రమంఇంచడం వలన శిశువులో తీవ్రమైన దుష్పలితాలకు కారణమైతుంది. దీనిని పుట్టుకతో వచ్చిన జికా సిండ్రోమ్ (కాంజెనిటల్ జికా సిండ్రోమ్) అంటారు. మైక్రోసెఫాలీ (చిన్న తల పరిమాణం), బ్రెయిన్ కాల్సిఫికేషన్‌లు, అవయవాల సంకోచాలు, పెరిగిన కండరాల స్థాయి, కంటి సమస్యలు, వినికిడి లోపం వంటి పలు అనారోగ్యాలకు దారితీసఉంది. ముఖ్యంగా గర్భం దాల్చిన తొలి వారాల్లో ఇన్ఫెక్షన్ సోకితే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో జికా వైరస్ ఇన్ఫెక్షన్ల కారణంగా 2016లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఆధ్వర్యంలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని సైతం ప్రకటించింది ప్రకటించింది.
ఈ నేపథ్యంలో… జికా వైరస్ ఇన్‌ఫెక్షన్ సంబంధించి గర్భిణీ స్త్రీలను పరీక్షించడం, పాజిటివ్ వచ్చిన తల్లులలో పిండాల పెరుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఫెర్నాండెజ్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ తారకేశ్వరి ఆసుపత్రులకు సూచించారు. జికా వైరస్‌ను నివారించడంలో భాగంగా సామాజికంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ప్రత్యేక చర్యలు తీసుకుని దోమల కాటు నుండి సంరక్షించుకోవాలని తెలిపారు. కమ్యూనిటీల్లో నీటి కంటైనర్‌లను మూసి ఉంచడం, సురక్షితమైన నీటి నాణ్యతను నిర్ధారించడం, అపరిశుభ్ర వ్యర్థాలను పారవేయడం, పరిశుభ్రతపైన అవగాహన కల్పిస్తూ కమ్యూనిటీల పరిశుభ్రతకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం ప్రధానమని డాక్టర్ తారకేశ్వరి పేర్కొన్నారు. శరీరాన్ని కప్పి ఉంచేలా దుస్తులను ధరించడం, పెర్మెత్రిన్-పూతతో కూడిన వలలను ఉపయోగించడంతో పాటు గర్భధారణ సమయంలో సురక్షితమైన DEET వంటి దోమల నివారకాలను వినియోగించడం తప్పనిసరి అని వివరించారు.
టాపిక్