Eruvaka Pournami : ఏరువాక పున్నమి రైతుల కోసం.. మరి వట్ పూర్ణిమా?
14 June 2022, 13:41 IST
- వర్షాకాలంలో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. ఈరోజును రైతులు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. నార్త్ సైడ్లో వట్ పూర్ణిమగా దీన్ని చేసుకుంటారు. వివాహితులు తమ సౌభాగ్యం కోసం ఈరోజు పూజలు చేసి.. ఉపవాసం చేస్తారు.
ఏరువాక పూర్ణిమ
Eruvaka Pournami : మండే ఎండలకు వీడ్కోలు పలుకుతూ.. తొలకరి జల్లులతో నేల తల్లి పులకరించే క్షణాలివి. దీనిలో భాగంగా రైతులు జ్యేష్ఠశుద్ధ పూర్ణమను ఏరువాక పౌర్ణమిగా పిలుస్తారు. రైతన్నలు తమ పంటసాగును ప్రారంభించే ముందు ఈ రోజును పరమ పవిత్రమైన రోజుగా భావించి పూజలు చేస్తారు. ఏరువాక పౌర్ణమి నాడు రైతులు తమకు పంటను ప్రసాదించే భూమి తల్లిని పూజిస్తారు. ఎద్దులకు పసుపు, కుంకుమలతో అందంగా అలంకరించి.. నాగలిని పూజ చేస్తారు.
ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని.. ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం. అంటే వర్షకాలం తొలినాళ్లల్లో వ్యవసాయం మొదలుపెట్టడం అనమాట. సాంప్రదాయంగా రైతులు ఏరువాక పున్నమిని పండుగలా జరుపుకుంటారు. ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. వాటికి పొంగలి పెట్టి... రైతులందరూ కలిసి సామూహికంగా ఎద్దులను తోలుకుని పొలాలకు వెళ్లి దున్నుతారు. కొన్ని ప్రాంతాల్లో ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. కొన్ని చోట్ల బండలాగుడు పోటీలు చేస్తారు.
వట్ పూర్ణమ
దీనిని ఎక్కువగా నార్త్ సైడ్ మహిళలు పాటిస్తారు. జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు ఈ వట్ పూర్ణమ వ్రతం నిర్వహిస్తారు. మహిళలు తమ భర్త దీర్ఘాయువు కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. అంతేకాకుండా కుటుంబ ఆనందం, శ్రేయస్సు కోసం దీనిని చేస్తారు. వట్ పూర్ణిమ రోజు మర్రి చెట్టును పూజిస్తే.. లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని నమ్ముతారు. మీరు పేదరికం, డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఈ రోజు మర్రి చెట్టుకు 7 సార్లు తెల్లటి దారాన్ని కట్టి.. ఆపై నీరు పోయాలని శాస్త్రాలు చెప్తున్నాయి.