Post-Workout Yoga | వర్కౌట్స్ తర్వత శరీరాన్ని ఈ యోగాసనాలతో చల్లబరచండి!
11 April 2022, 6:30 IST
- వర్కౌట్స్ చేసిన తర్వాత శరీరాన్ని చల్లబరిచి మనస్సుకు ప్రశాంతత కల్పించే అద్భుతమైన యోగాసనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని యోగాసనాల గురించి ఇక్కడ సమాచారం ఇస్తున్నాం, పరిశీలించండి..
Yoga
ఏదైనా వర్కవుట్స్ చేసే ముందు వార్మప్ చేయమని నిపుణులు సలహా ఇస్తుంటారు. అదే సమయంలో బాగా వర్కవుట్స్ చేసిన తర్వాత కూడా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయని మీకు తెలుసా? సుదీర్ఘమైన వర్కవుట్స్, ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఈ వేడిని తగ్గించుకోవడం, శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం కూడా చాలా కీలకం.
ఎలాగైతే చాలాసేపు పనిచేసిన ఒక వాహనం ఇంజన్ హీట్ ఎక్కుతుందో దానిని చల్లబరిచేందుకు ప్రయత్నిస్తాం లేదంటే కొన్ని సార్లు ఇంజన్ స్టార్ట్ అవ్వదు, సమస్యలు వస్తాయి. ఇదే సూత్రం మన శరీరానికి వర్తిస్తుంది.
వర్కవుట్ సెషన్‌ల తర్వాత కొన్ని సులభమైన బేసిక్ యోగా భంగిమలు శరీరాన్ని చల్లబరిచి, తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తాయి. పోస్ట్-వర్కౌట్ రొటీన్‌లో కూల్-డౌన్ ప్రక్రియ కూడా ముఖ్యమైన అంశం. ఇది మీ శరీరం వేగాన్ని తగ్గించడానికి మరియు సమతుల్య స్థితికి తిరిగి రావడానికి అనుమతిస్తుంది.
ఇది మీ శరీరం దాని సాధారణ స్థితికి తిరిగి రావడానికి, శ్వాసక్రియను అలాగే హృదయ స్పందన రేటును అదుపులో ఉంచడానికి, కండరాలను సడలించడానికి, కండరాల నొప్పిని తగ్గించడానికి ఉపకరిస్తుంది.
శరీరాన్ని చల్లబరించేందుకు ఉపకరించే యోగాసనాలు ఇక్కడ చూడండి..
ఏక పాద రాజకపోతాసన
దీనిని పీజియన్ పోజ్ అంటారు. వర్కవుట్ సెషన్ తర్వాత శరీరాన్ని చల్లబరిచేందుకు ఈ యోగాసనం అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీ తుంటిని, వీపును సాగదీసేందుకు ఉపయోగపడుతుంది. సరిగ్గా ఈ ఆసనం వేస్తే వెన్ను కండరాలు, వీపు కండరాలపై భారం తగ్గుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
బాలాసనం
దీనినే చైల్డ్ పోజ్ అని పిలుస్తారు. వర్కవుట్ తర్వాత మిమ్మల్ని చిల్ చేసే మరో అద్భుతమైన ఆసనం ఇది. ఈ యోగాసనం ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శారీరకంగా మీ ఛాతీ, వీపు, భుజాలపైన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. పగటి సమయంలో కూడా మీకు మైకముగా లేదా అలసటగా అనిపిస్తే. కొన్ని నిమిషాలు బాలాసనం భంగిమలో ఉంటే మార్పు కనిపిస్తుంది. ఈ ఆసనం వెన్ను, తుంటి, తొడలు, చీలమండల వరకు కండరాల్లో సున్నితమైన సాగతీతను కలిగించి మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది.
సుఖాసనం
ఇది అన్నింటికంటే సులభమైన ఆసనం. సౌకర్యంగా పీటల మీద కూర్చున్నట్లు కూర్చొని శ్వాసక్రియపై దృష్టిపెట్టాలి. ఈ సమయంలో మెదడులో పలురకాల ఆలోచనలు వస్తే వాటిని మానుకొని కొద్దిసేపు దృష్టంతా శ్వాసక్రియపైనే కేంద్రీకరించాలి. మామూలుగా శ్వాస తీసుకుంటూ వదలడం చేస్తుండాలి. ఈ సుఖాసనం మనస్సు, శరీరానికి ప్రశాంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది.