తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting: పిల్లలతో కలిసి రోజూ ఈ పనులు చేయండి.. చురుగ్గా తయారవుతారు..

Parenting: పిల్లలతో కలిసి రోజూ ఈ పనులు చేయండి.. చురుగ్గా తయారవుతారు..

HT Telugu Desk HT Telugu

11 June 2023, 16:38 IST

google News
  • Parenting: తల్లి దండ్రులు పిల్లలతో కలిసి రోజూ తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అవేంటో చూసేయండి. వాటివల్ల పిల్లలు ఆనందంగా, చురుగ్గా ఉండగలుగుతారు. 

పిల్లలతో కలిసి చేయాల్సిన పనులు
పిల్లలతో కలిసి చేయాల్సిన పనులు (Pixabay)

పిల్లలతో కలిసి చేయాల్సిన పనులు

పిల్లలతో రోజులో కాసపయినా ఆనందంగా, నాణ్యమైన సమయం గడపాల్సిందే. ముఖ్యంగా సెలవు రోజుల్లో పిల్లలకు కాస్త ఎక్కువ సమయం ఉంటుంది. వాళ్లతో తల్లిదండ్రులు గడపకపోతే వాళ్లు బోరింగ్ గా ఫీలవుతారు. పిల్లలు శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండాలంటే వాళ్లతో పాటూ కలిసి మీరు కూడా కొన్ని పనులు చేయాలి.

1. కలిసి చదవండి:

చదవడం వల్ల పిల్లల ఆలోచనా శక్తి మెరుగుపడుతుంది. భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. తార్కికంగా ఆలోచించగలుగుతారు. రోజులో కాసేపు తప్పకుండా పిల్లలతో కలిసి చదవడానికి సమయం కేటాయించండి. బొమ్మలున్న పుస్తకం, కథల పుస్తకం లేదా స్కూల్ పుస్తకాలు ఏవైనా పరవాలేదు. వాళ్లడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వండి. వాళ్లతో కథలు చర్చిచండి.

2. బయట ఆడుకోవడం:

ఇంట్లోనే రోజు మొత్తం ఉండటం సరికాదు. కాసేపయినా బయట ఆడుకోవాలి. పార్కు, క్యాచ్ ఆడటం లేదా ప్రకృతిలో కాసేపు తిరగడం ఏదైనా సరే రోజులో కాసేపు సమయం కేటాయించండి. బయట ఆటల వల్ల శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారు. బయటి వాళ్లతో మాట్లాడటం నేర్చుకుంటారు.

3. సృజనాత్మకత:

డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్ తయారీ, బ్లాక్ బిల్డింగ్.. ఇలా పిల్లల సృజనాత్మకతను పెంచే పనేదైనా చేయండి. సమస్యలు పరిష్కరించుకునే గుణం అలవాటవుతుంది.

4. భోజనం చేయటం:

కుటుంబమంతా కలిసి భోజనం చేయడం ద్వారా మంచి ఆహారపు అలవాట్లు వస్తాయి. అలాగే అంతా కలిసి నాణ్యమైన సమయం గడిపినట్టుంటుంది. రోజులో కనీసం ఒక్కసారైనా అందరూ కలిసి తినేలా చూస్కోండి. మంచి సంభాషణలు, కథలు చెబుతూ ఆ సమయాన్ని వాళ్లకు ఇష్టమయ్యేలా మార్చేయండి.

5. యాక్టివిటీలు:

వాళ్ల తెలివితేటలు పెరిగేలా పజిల్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సైన్స్ ప్రయోగాలు, సులువైన గణిత శాస్త్ర మెలకువలు నేర్పించండి. వాళ్ల వయసు ప్రకారం వాటిని మారుస్తూ ఉండండి. ఎంజాయ్ చేస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటారు.

6. బాధ్యతలు, పనులు:


వాళ్ల వయసుకు తగ్గట్లు కొన్ని పనులు అప్పజెప్పండి. వస్తువులు తీసిన చోటే పెట్టమనడం, లేదా వాళ్ల బొమ్మల్ని సర్దుకోమనడం.. ఇలా చిన్న పనులు చెప్పొచ్చు. వాళ్ల గది సర్దుకోమనడం, టేబుల్ సర్దమనడం, లేదా మీకు పనుల్లో సాయం చేయమనడం, వాళ్లు సాయం చేశాక అభినందించడం చేయండి.

  • వీటన్నింటితో పాటూ రోజులో కాసేపయినా పిల్లలకు ఇష్టమైన, నచ్చే పనుల కోసం కేటాయించండి. వాళ్లకు ఇష్టమైన హాబీలను ఇంకా నాణ్యంగా తీర్చిదిద్దేలా వాళ్లకు సాయపడండి. చదువుకోవట్లేదంటూ అడ్డుపడకండి. దానికంటూ ప్రత్యేక సమయం కేటాయించండి. అంతే కానీ రోజు మొత్తం చదువుతూనే ఉండాలనే నియమం పెట్టకండి.

తదుపరి వ్యాసం