Taapsee |ప్రియుడిపై ప్రశంసలు కురిపించిన తాప్సీ
16 May 2022, 7:02 IST
ప్రియుడు సాధించిన విజయాన్ని చూసి ఆనందపడుతోంది పంజాబీ సుందరి తాప్సీ. అందరినీ గర్వపడేలా చేశాడంటూ అతడిపై ప్రశంసలు కురిపిస్తోంది.
తాప్సీ
తొలిసారి థామస్ అండ్ ఉబెర్ కప్ నెగ్గి భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు చరిత్రను సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో ఇండోనేషియాపై విజయాన్ని సాధించిన భారత ఆటగాళ్లతో పాటు కోచ్ లపై పలువురు ప్రశంసలను కురిపించారు. వారిలో కథానాయిక తాప్సీ కూడా ఉంది. డబుల్స్ టీమ్ కోచ్ మాథిస్ బో ను స్పెషల్ గా అభినందించింది. అతడు ఎవరో కాదు తాప్సీ ప్రియుడు.
చాలా ఏళ్లుగా తాప్సీ, మాథిస్ బో మధ్య ప్రేమాయణం సాగుతోంది. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ లో వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. మాథిస్ తో తన ప్రేమబంధాన్ని గురించి పలుమార్లు వెల్లడించింది తాప్సీ. మాథిస్ బోతో తాప్సీ ప్రేమ విషయం ఆమె కుటుంబసభ్యులకు కూడా తెలుసునని సమాచారం.
ప్రస్తుతం మాథిస్ బో భారత పురుషుల డబుల్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. థామస్ ఉబెర్ కప్ లో ఇండియా గెలవగానే తాప్సీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారత్ తొలిసారి థామస్ కప్ ను అందుకోవడం ఆనందంగా ఉందని, యువ ఆటగాళ్లు సాధించి చూపించారని ప్లేయర్స్ అందరిని ట్యాగ్ చేస్తూ వారిపై అభినందనలు కురిపించింది.
అంతేకాకుండా మాథిస్ బోపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించింది. మిస్టర్ కోచ్ మీరు మమ్మల్ని అందరిని గర్వపడేలా చేశారు అంటూ పేర్కొన్నది. మాథిస్ బోను ఓ ప్లేయర్ ఆనందంతో కౌగిలించుకున్న ఫొటోను పోస్ట్ చేసింది. తాప్సీ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఈ పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రియుడి విజయాన్ని చూసి ఆమె ఆనందపడుతోన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే మాథిస్ బోను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.