అల్లు అర్జున్ తప్పేమీ లేదు.. అవసరమైతే కేసు విత్‌డ్రా చేసుకుంటా: మృతురాలి భర్త కామెంట్స్ వైరల్
13 December 2024, 16:44 IST
- Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో పెద్ద ట్విస్టే ఇచ్చాడు మృతురాలు రేవతి భర్త. ఇందులో అతని తప్పేమీ లేదని, అవసరమైతే కేసు విత్‌డ్రా చేసుకుంటానని చెప్పడం గమనార్హం.
అల్లు అర్జున్ తప్పేమీ లేదు.. అవసరమైతే కేసు విత్‌డ్రా చేసుకుంటా: మృతురాలి భర్త కామెంట్స్ వైరల్
Allu Arjun: సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి భర్త తాజాగా ఈ కేసుకు మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పేమీ లేదని అతడు అన్నాడు. ఏమైనా ఉంటే తాను కేసు విత్ డ్రా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం విశేషం. బన్నీ అరెస్ట్ నేపథ్యంలో అతడు మీడియాతో మాట్లాడాడు.
కేసు విత్‌డ్రా చేసుకుంటా: మృతురాలి భర్త
అల్లు అర్జున్ పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మృతురాలు రేవతి భర్త స్పష్టం చేశాడు. "మా కొడుకు సినిమా చూద్దామంటేనే మేము వెళ్లాం. అక్కడికి అల్లు అర్జున్ వచ్చినందుకు అతని తప్పేమీ లేదు. ఏమైనా ఉంటే కేసు విత్ డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నా.. న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్లేమీ చెప్పలేదు.
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినట్లు మొబైల్లో చూసి తెలుసుకున్నా. నేను హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడే మొబైల్ చూస్తే నాకు తెలిసింది. అల్లు అర్జున్ కైతే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్ డ్రా చేసుకోవడానికి రెడీగా ఉన్నా" అని తేల్చి చెప్పాడు.
అల్లు అర్జున్ అరెస్ట్, రిమాండ్
అంతకుముందు శుక్రవారం (డిసెంబర్ 13) ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే థియేటర్ యాజమాన్యంలో కొందరిని అరెస్ట్ చేయగా.. తాజాగా బన్నీని కూడా కస్టడీలోకి తీసుకున్నారు.
అతన్ని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లగా.. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలిస్తున్నారు. అయితే ఆ సమయంలోనే మృతురాలు రేవతి భర్త తాను కేసు ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్న ప్రకటన చేయడం గమనార్హం.
మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ కు మద్దతు పెరుగుతోంది. ఇందులో అతని తప్పేమీ లేదని, ఆ ప్రీమియర్ షోకి ముందే పోలీసులు అనుమతి ఇచ్చారంటూ ఆ లేఖను కొందరు సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశారు. అటు మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, నాగబాబులాంటి వాళ్లు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. కోర్టు రిమాండ్ నేపథ్యంలో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఇది ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాలి.